Tirumala| శ్రీవారి భక్తులకు ఉచితంగా 'వైకుంఠ ద్వార దర్శనం' టికెట్లు
తిరుమలలో ఏడాదికి ఒకసారి మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. జనవరి పదో తేదీ నుంచి పది రోజుల పాటు సామాన్య యాత్రికుల కోసం ఉత్తరద్వారాలు తెరిచి ఉంచనున్నారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-11-26 07:08 GMT
తిరుమల శ్రీవారి క్షేత్రం కొన్ని ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. అందులో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు కూడా ప్రధానమైనవి. ఈ ఆలయంలో శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని వెలుపలికి రాగానే పోటు (వంటశాల) వద్ద వకుళమాత విగ్రహాన్ని దర్శించుకున్నతరువాత ఉపఆలయం విగ్రహం వద్ద అర్చకులు తీర్ధం, శఠారి ఇచ్చి ఆశీర్వదిస్తారు. కిందికి దిగగానే బంగారుబావికి పక్కనే.. ప్రధాన ఆలయం ప్రాంగణాన్ని ఆనుకుని వైకుంఠ ద్వారం (ఉత్తరద్వారం) తలుపులు నిత్యం మూసి వేసి ఉంటారు. వైకుంఠ ఏకాదశి ఘడియల్లో గతంలో రెండు రోజులు మాత్రమే ఈ ద్వారాలు తెరవడం ద్వారా భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కానీ,
అందరికీ వైకుంఠ ద్వార ప్రవేశం..
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార ప్రవేశం కొందరికి మాత్రమే దక్కుతున్న విషయం సామాన్యులు కలత చెందారు. కరోనా రాక ముందు, ఆ తరువాతి నుంచి వైకుంఠ ఏకాదశి, ద్వాదిశి రోజే కాకుండా, పది రోజుల పాటు ద్వారాలు తెరిచి ఉంచడం ద్వారా సామాన్య యాత్రికులకు కూడా ఉత్తరద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ ద్వారం నుంచి ప్రవేశించి, బయటికి వస్తే, తమ జన్మధన్యం కావడమే కాదు. స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందనేది యాత్రికుల ప్రగాఢ విశ్వాసం. గతంలో మాదిరే ఈసారి కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచడానికి టీటీడీ అధికారులు సంసిద్ధం అవుతున్నారు.
ఆ పది రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి నిర్ణీత కౌంటర్ల వద్ద ఆధార్ కార్డు ప్రామాణికంగా వైకుంఠ ద్వార దర్శనానికి టైంస్లాట్ టికెట్లు కేటాయిస్తారు. దీనిపై టీటీడీ అధికారులు ఇప్పటి నుంచి ఏర్పాట్లకు సమాయత్తం అవుతున్నారు.
ఈ ఏకాదశికీ ఉచిత టోకెన్లు
ఏకాదశి నుంచి పది రోజుల పాటు ఐదు లక్షల మంది సామాన్య యాత్రికులకు కూడా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయ. యాత్రికులు ఖచ్చితంగా ఆధార్ కార్డుతో రావాల్సి ఉంటుంది. ఆ కార్డు ఆధారంగా టికెట్ జారీ చేస్తారు. గతంలో మాదిరే తిరుమల, తిరుపతిలో పది కౌంటర్లు ఏర్పాటు చేయడానికి సమాలోచనలు సాగిస్తున్నారు. దీనిపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. గతంలో మాదిరే తిరుపతిలో..
1. ముత్యాలరెడ్డిపల్లె (ఎంఆర్. పల్లి) జెడ్పీ హైస్కూల్,
2. బైరాగిపట్టెడ లోని రామానాయుడు జెడ్పీ హైస్కూల్
3. రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణునివాసం
4. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయం
5.అలిపిరికి సమీపంలో భూదేవి కాంప్లెక్స్
6. జీవకోనం వద్ద ప్రాధమిక పాఠశాల,
7. పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలోని ఇందిరామైదానం
8.తిరుపతిలో రామచంద్రపుష్కరిణి
9. రైల్వేస్టేషన్ సమీపంలో సత్రాలు కూలదోయడం వల్ల ఆ కౌంటర్ శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీ (ఎస్.జీ.ఎస్) ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.
10. తిరుమల ఓ కౌంటర్ ఈ ఏడాది వైకుంఠ దర్శనం టికెట్ల జారీకి వీలుగా ఏర్పాటు చేశారు. అంటే మొత్తం మీద 90 కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉచితంగా టోకెన్లు కేటాయించారు.
అధికారులతో సమీక్ష
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈఓ సిహెచ్. వెంకయ్యచౌదరి సమీక్షించారు. 2024 జనవరి 10న వైకుంఠ ఏకాదశికి యాత్రికులకు 10 రోజుల పాటువైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుందని తెలిపారు. 40 రోజులు మాత్రమే ఉండటంతో యాత్రికుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధం కావాలని అన్ని శాఖల అధికారులను అడిషనల్ ఈఓ ఆదేశించారు.
మళ్ళీ సమీక్ష
తిరుమలలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రత్యేకంగా సూచించారు. "సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేవిధంగా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం" అని ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశికి ఆలయం, పరిసరాలు, అనుబంధ ఆలయాల్లో పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.
ఆర్జిత సేవలు రద్దు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ సన్నద్ధం అవుతోంది. దీంతో ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి చెప్పారు. ఈ పదిరోజులు వీఐనీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు స్వల్పంగా ఉంటాయన్నారు. జనవరి 10న స్వర్ణరధం ఊరేగింపు, 11వ తేదీచక్ర స్నానం నిర్వహిస్తారు.
"పది రోజుల పాటు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు కూడా ఉంటాయి" అని ఆయన వివరించారు.
రద్దుచేసే సేవలు
1. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వరకు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.
2. ఆర్జిత సేవలు రద్దు
ఈ విశేష రోజుల్లో సామాన్యయాత్రికులకు అందుబాటులో ఉంచడంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.