ఉచిత సిలిండర్లు : బాబు ఎన్ని ఇళ్లలో 'సూపర్ సిక్స్' కొడతారో..?

దీపావళికి ఎన్ని ఇళ్లలో కూటమి సూపర్ -6 కొడతుందనేది విధివిధానాలతో తేలుతుంది. దీనిపై స్పష్టత లేక ఏజెన్సీలు, అందుతుందో.. లేదో అని కొందరు పేదలు హైరానా పడుతున్నారు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-10-24 12:38 GMT

టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్-6 పథకాలు పురిటినొప్పులు పడుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సామాజిక పింఛన్ల మొత్తం పెంపుదలతో పంపిణీ చేశారు. ఏడాదికి మూడు ఉంచిత గ్యాస్ సిలిండర్లు అందించే పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూనే ఉంది.

ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి సంసిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకోవడానికి అర్హత లు, ప్రామాణికాలు ఏమిటనేది ఇంతవరకు ఖరారు కాలేదు. ఇంకో ఆరు రోజుల్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టే విధంగా టీడీపీ (Telugu desam Party) కూటమి క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం నుంచి విధివిధానాలు అందిని స్థితిలో గ్యాస్ ఏజెన్సీలు, డీలర్లు అయోమయంలో ఉన్నారు. లబ్ధిదారులైన తెలుపు రేషన్ కార్డుదారులు ఉత్కంఠకు గురవుతున్నారు. తమ సందేహాలను తీర్చుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు పోటెత్తుతున్నారు. ఈకేవైసీ చేయించుకోవడానికి పోటీ పడుతున్నారు. వారికి సమాధానాలు చెప్పలేక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. ఇదిలా ఉంటే,
అక్టోబర్ 24 వ తేదీ (ఈరోజు) గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి పథకం ప్రారంభించిన రోజు లబ్ధి చేకూరుతుందనే ప్రచారం జరిగింది. దీంతో గ్యాస్ ఏజెన్సీల సర్వర్లు మోగిపోయాయి. సాధారణ రోజుల్లో గ్యాస్ బుక్ చేసుకునే వారి సంఖ్యకు, ఈరోజు గ్యాస్ బుక్ చేసుకున్న వారి సంఖ్యకు పొంతనే లేదని చెబుతున్నారు.
క్యాబినెట్ ఏం నిర్ణయించింది..
2024 ఎన్నికలవేళ టీడీపీ చీఫ్, సీఎం ఎన్ చంద్రబాబు, మిత్రపక్ష జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తో కలిసి సూపర్ సిక్స్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో సామాజిక పింఛన్ల మొత్తం పెంపుదల మొదటిదిగా పరిగణించారు. అధికారంలకి రాగానే దానిని మొదటి నెల నుంచి అమలు చేశారు. మేనిఫెస్టోలో రెండోదిగా ఎంచుకున్న ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితం పథకాన్నినెలల తర్వాత ఆటక నుంచి కిందికి దించారు. దీపావళి కానుకగా ఈ పథకం అమలు చేస్తామని సీఎం ఎన్. చంద్రబాబు, అంతకుముందు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
2024 అక్టోబర్ 23: అమరావతిలో జరిగిన టీడీపీ కూటమి మంత్రివర్గ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే పథకానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇందులో, అక్టోబర్ 31వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
"గ్యాస్ బండ కోసం బుక్ చేసుకోవడంతో పాటు డెలివరీ సమయంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం 48 గంటల్లో వినియోగదారని ఖాతాలో తిరిగి జమ అవుతుంది" అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకంలో...
2025 ఏప్రిల్1 నుంచి జూలై నెలాఖరు వరకు మొదటిది, ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ నెల వరకు రెండు, డిసెంబర్ ఒకటి నుంచి 2026 నెలాఖరు వరకు మూడో సిలిండర్ అందించేలా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూడు సిలిండర్లు ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,684 కోట్లు భారం భరించడానికి సిద్ధమైంది అని కూడా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ పథకం అమలు చేయడానికి చక్కటి ప్లానింగ్ కూడా చేశారనే విషయం స్పష్టం అవుతుంది.
విధివిధానాలేవి...
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై అనేకమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బీపీఎల్ ( Bilo powerty line) కింద తెలుపు కార్డులు (white ration cards) ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వర్తిస్తుంది అని ప్రకటించారు. రాష్ట్రంలో 1.30 కోట్ల తెలుపు రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు చెప్పింది. అంతకు ముందు ఆ సంఖ్య 1.40కోట్లు ఉంటుందని కూడా పేర్కొన్నారు. అంటే మిగతా వాటి సంఖ్య తగ్గడానికి తెలుపు రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ పురుషుల పేరుతో ఉంటే సిలిండర్ లభించదా? అనే ధర్మసందేహాలు ఎక్కువయ్యాయి. ఈ సందేహాలు తీర్చుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు.

ఈ విషయంపై తిరుపతిలోని వీకేఆర్ఆర్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ నీలకంఠ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు."చమురు సంస్థల నుంచి ఇప్పటికీ మాకు ఎలాంటి విధివిధానాలు అందలేదు. మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్ లేకుంటే ఉచిత పథకం వర్తిస్తుందా లేదా అనేది మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతోంది. దీనిపై మాకు స్పష్టత లేదు" అని నీలకంఠ తెలిపారు. ఇదిలా ఉంటే,
అక్టోబర్ 31వ తేదీ నుంచి అమలు చేయనున్న సూపర్-6 పథకంలోని మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం అక్టోబర్ 24వ తేదీ బుకింగ్ చేసుకోవాలని విషయం కూడా ప్రచారం అయింది. దీంతో, తెలుపు రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు భారీగా సిలిండర్లు బుక్ చేశారు.
"మా ఏజెన్సీ పరిధిలో 33 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో 500 నుంచి 700 బుకింగులు జరిగేవి" అని గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ నీలకంఠ చెప్పారు. "తాజాగా జరిగిన ప్రచారం వల్ల 24వ తేదీ మా ఏజెన్సీ కి మాత్రమే దాదాపు 1600 బుకింగ్ జరిగాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు" అని నీలకంఠ వివరించారు.
"ఉచిత గ్యాస్ కనెక్షన్ల మంజూరు వ్యవహారం పై మాకు కూడా ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు" అని తిరుపతిలోని టీటీఎస్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి సునీల్ కుమార్ చెప్పారు. కాగా,
డీఎస్ఓ ఏమంటున్నారంటే..

ఈ వ్యవహారంలో తిరుపతి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎస్ఓ (civil supplies department) రాజు మాట్లాడుతూ, "ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు" అని రాజు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో వివిధ రకాల తెలుపు రేషన్ కార్డులు 6, 00,305 ఉన్నాయని వివరించారు. రెండు మూడు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు అందే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తం మీద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ముహూర్తం కూడా నిర్ణయించింది. అయితే, ఎక్కువ రోజులు సమయం తీసుకున్నప్పటికీ ఈ పథకం అమలుకు సంబంధించి నిర్దిష్టమైన విధివిధానాలు తయారు చేయడంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీనమేషాలు లెక్కించిందని విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈనెల 31వ తేదీ నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఈ పథకానికి సంబంధించి ఎలాంటి చమక్కులు చోటు చేసుకుంటాయి! మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే పథకం వర్తిస్తారా!? లేదు తెలుపు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ వర్తింప చేస్తారా? అనే విషయంలో ప్రభుత్వం ఇచ్చే స్పష్టత కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదనేది వేచి చూడాలి.
Tags:    

Similar News