ఫ్రీబస్సు–2.64 కోట్ల మంది మహిళలకు లబ్ధి

విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు.;

Update: 2025-08-15 12:56 GMT

స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.64 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం ఫ్రీ బస్సు పథకాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచేందుకు కూటమి ప్రభుత్వం కష్ట పడి పని చేస్తోందన్నారు. ఫ్రీ బస్సు ప్రారంభించడం ద్వారా ఆడబిడ్డలకు మంచి చేశామనే తృప్తి కలుగుతోందని తెలిపారు. ఫ్రీబస్సు పథకం కింద రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణిం చేయొచ్చని వెల్లడించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తూ దూసుకెళ్తామన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయలేమని చాలా మంది ఎగతాళిగా మాట్లాడారని, ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు అదే సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయిందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు, మహిళలకు నవ్వడమే మర్చి పోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఇంటా.. బయటా కూడా ప్రజలకు ఆనందం లేకుండా పోయిందని, రోడ్ల మీదకు వస్తే తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకుంటామా అనే నమ్మం కూడా లేకుండా పోయిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలో భరోసా కల్పించామన్నారు. మహిళలను, ఆడబిడ్డలను కించపరిస్తే సహించేది లేదని, కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, ఆడబిడ్డల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు.
త్వరలో ఈ–బస్సుల్లో మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆర్టీసీకి ఆదాయ మార్గాలు పెంచుతామన్నారు. రానున్న రోజుల్లో ఈ బస్సులే కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఫ్రీ బస్సు పథకం కింద నష్ట పోకుండా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామన్నారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షులు మాధవ్‌లు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఉండవల్లి సీఎం చంద్రబాబు నివాసం నుంచి ఉండవల్లి.. కాల్వ దాటి తాడేపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇంటి దారి నుంచి జాతీయ రహదారి.. కనక దుర్గమ్మ వారధి మీదుగా.. ఆర్టీసీ బస్‌స్టేషన్‌ వరకు ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుల్లా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్‌లు ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ముచ్చటిస్తూ వచ్చారు.
Tags:    

Similar News