ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-06-22 06:13 GMT

ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్‌ ఇంటర్మీడియట్‌ విద్యపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా ఇవ్వడం లేదు. అయితే 2024–25 విద్యా సంవత్సరానికి ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలని లోకేష్‌ ఆదేశించారు. గత సంవత్సరం ఇంటర్‌లో పరీక్షలు రాసిన వారిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,99,556 మంది ఉన్నారు. రెండో సంవత్సరం విద్యార్థులు 5,02,394 మంది ఉన్నారు. మొత్తం 10,01,950 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఉంటారు.

ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్‌ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్‌ బుక్స్‌ పంపిణీ చేయనున్నారు. పది లక్షల మంది విద్యార్థులు ఈ ప్రకటనతో లోకేష్‌ను అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు పుస్తకాలు కొనుక్కోలేని విద్యార్థులు చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు కొనుక్కొంటున్నారు. లోకేష్‌ నిర్ణయంతో పుస్తకాలు ఫ్రీగా అందటం ఆనందాన్ని కలిగిస్తోందని విద్యార్థులు చెప్పారు.
సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్‌ ఆఫీసర్‌ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టెక్ట్స్‌ బుక్స్‌తో పాటు నోట్‌ బుక్స్, బ్యాగ్‌లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు. పుస్తకాలు కొనుగోలు చేసే బాధ్యతను తెలుగు అకాడమి వారికి అప్పగించారు.
Tags:    

Similar News