గుండాలకోన వద్ద రెచ్చిపోయిన ఏనుగుల దాడిలో నలుగురు మృతి
ఏపీ అసెంబ్లీ ఉలిక్కిపడింది. పవన్ కల్యాణ్ హుటాహుటిన రైల్వేకోడూరు ఎమ్మెల్యేను ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లమని ఆదేశించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.;
By : The Federal
Update: 2025-02-25 04:32 GMT
తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ స్పందించారు. ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను వై.కోటకు వెళ్లాలని పవన్ ఆదేశించారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖ అధికారులను పవన్ ఆదేశించారు. ఏనుగులు దాడి (Elephants Attack on Devotees) లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మహాశివరాత్రి (Mahashivratri) ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు శేషాచలం (Seshachalam) అడవుల గుండా తలకోన(Talakona)కు నడిచివెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే అటుగా వచ్చిన ఏనుగుల గుంపు భక్తులను చూసి రెచ్చిపోయింది. భక్తులపైకి దూసుకెళ్లేందుకు ఏనుగులు ప్రయత్నించగా వారంతా వాటిని భయపెట్టేందుకు గట్టిగట్టిగా కేకలు వేశారు. అయినప్పటికీ అవి బెదరకుండా ఎదురుదాడికి దిగడంతో భక్తులంతా పరుగులు పెట్టారు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడి మరీ దాడి చేసి నలుగురిని చంపేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను రైల్వేకోడూడు ఆస్పత్రికి తరలించగా.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. కాగా, అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరిని కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన మణెమ్మ, చెంగల్ రాయుడుగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అడవి ఏనుగులు దాడి చేశాయి. వై. కోటకు చెందిన ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఏనుగులను అడవుల్లోకి తరిమికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలికాలంలో వరుసగా జనావాసాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్న రాయలసీమ జిల్లాలలో ఏనుగుల సంచారం పెరిగింది.
చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోని అడవులు ఏనుగుల సంచారానికి కేంద్రాలుగా మారాయి. గత నెలలో పొరుగు రాష్ట్రాల నుండి రెండు అడవి ఏనుగుల గుంపులు శేషాచలం అడవులలోకి ప్రవేశించాయి.
35 ఏనుగులున్న రెండు గుంపులు ఆహారం, నీరు, ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయని, సమీప గ్రామాలలో విధ్వంసం సృష్టిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
జనవరి 18న చిత్తూరు జిల్లాలోని కందులవారిపల్లిలో అడవి ఏనుగుల దాడిలో ఒక వ్యక్తి మరణించాడు.
అడవుల్లో వనరులు తరిగిపోవడం, ఆవాసాలు లేకపోవడం వల్ల ఏనుగులు మానవ నివాసాలలోకి వెళ్తున్నాయి. ఫలితంగా పంటలు, ఆస్తి, ప్రాణాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని అటవీ అధికారులు చెబుతున్నారు.
2011 నుండి అవిభక్త చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల్లో 22 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2015 నుండి ఈ ప్రాంతంలో మొత్తం పంట నష్టం 233 ఎకరాలు ఉంటుందని అంచనా.
ఒడిశా సరిహద్దులోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు కూడా ఇటీవలి కాలంలో జనావాసాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడుల్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సాయాన్ని కూడా కోరింది.
అటవీ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమధ్య కర్ణాటక అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేను కలిసి, సమస్య పరిష్కారానికి సహాయం అందించమని కోరారు.
అడవి ఏనుగులను అదుపులో ఉంచేందుకు, జనావాసాల్లోకి వచ్చినపుడు తరిమికొట్టేందుకు, అదుపు తప్పిన వాటిని పట్టుకోవడానికి శిక్షణ పొందిన 8 కుమి ఏనుగులను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.