రిమాండ్ నుంచి పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ నందిగం సురేశ్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు ఆదేశాల మేరకు శనివారం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేషన్‌ను రిమాండ్ నుంచి పోలీసు కస్టడీలోకి తీనుకోనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టనున్నారు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతులు ఇవ్వాలని పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు 48 గంటలు అంటే రెండు రోజులు పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిస్తూ శుక్రవారం అనుమతులిచ్చింది. కోర్టు నుంచి అనుమతులు మంజూరు కావడంతో నందిగం సురేష్‌ను శనివారం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.
అయితే కోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పోలీసులు ఆయనను ప్రశ్నించాల్సి ఉంటుంది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉండగా 2020 డిసెంబర్‌లో రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యులు అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 78వ నిందితుడిగా నందిగం సురేషన్‌ను పోలీసులు చేర్చారు.