నెల్లూరులోనే ఉన్నా, అరెస్ట్ చేస్కోవచ్చు!

వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర పోలీసులకు సవాల్ విసిరారు.;

Update: 2025-07-10 12:51 GMT
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర పోలీసులకు సవాల్ విసిరారు. తానెక్కడికీ పారిపోలేదని, ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని తేల్చిచెప్పారు. ప్రసన్నకుమార్‌రెడ్డి (Prasanna kumar reddy)లో ప్రవహిస్తున్నది నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి రక్తమన్నారు. చేతికి నొప్పి ఉండటంతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వచ్చానని తెలిపారు. వాస్తవం ఇది కాగా కొంతమంది తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
‘‘నాది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్లడ్‌.. భయపడటం మా బయోడేటాలో లేదు. నేను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. ఇప్పుడు కావాలన్నా నన్ను అరెస్టు చేసుకోవచ్చు. మా ఇంటిపై జరిగిన దాడికి వచ్చిన వారి వీడియోలు ఉన్నాయి. ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి’’ అని ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరులో మీడియాతో చెప్పారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఆయన ఈ సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలు మహిళా సంఘాల వరకు పలువురు ప్రసన్నకుమార్‌రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు చేశారు. తనను వ్యక్తిగతంగా, అసభ్య పదజాలంతో దూషించిన ప్రసన్నను అరెస్టు చేయాలన్నారు. తనలా మరో మహిళ బాధపడకుండా చూడాలని పోలీసులను ఆమె కోరారు. ఈ క్రమంలో కేసు నమోదైంది. కేసు నమోదు అయిన తర్వాత ఆయన చికిత్స కోసం చెన్నై వెళ్లారు. దీంతో ఆయన పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. వీటికి ధీటుగా ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడీ సవాల్ చేయడం గమనార్హం. ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం మహిళా సంఘాలు కూడా ఆరోపించాయి.
Tags:    

Similar News