అమరావతికి రూ. 31వేల కోట్లు రెడీ!
అమరావతి నిర్మాణానికి డబ్బులు క్రమంగా సమకూరుతున్నాయి. కేంద్రం రూ. 15వేల కోట్లు అప్పు ఇప్పిస్తుండగా, హడ్కో, జర్మన్ బ్యాంక్ మరో రూ. 16వేల కోట్లు అప్పు ఇస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం సుగుమమైంది. నిధులు లేని కారణంగా అమరావతి నిర్మాణం నిదానంగా జరిగే అవకాశం ఉందనే అనుమానాన్ని మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ద్వారా రూ. 15వేల కోట్లు ఇప్పించేందుకు గత బడ్జెట్ సమావేశాల్లోనే తెలిపింది. బడ్జెట్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికి రెండు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని సంప్రదించి అమరావతి నిర్మాణానికి సాయం అందించాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు. జనవరి నుంచి పనులు వేగంగా జరుగుతాయని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. అమరావతి నిర్మాణ పనులను నారాయణ పర్యవేక్షిస్తున్నారు. సీఆర్‌డీఏ ద్వారా ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్నాయి. ప్రతి వారానికి ఒక సారి సీఆర్‌డీఏ వారితో నారాయణ సమీక్షలు నిర్వహిస్తున్నారు.