అన్నదానం వేళ.. అల్లాడిపోయిన చిన్నారులు!

దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా విశాఖలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్రమాదవశాత్తూ వేడి గంజి పడడంతో 16 చిన్నారులు సహా 20 మంది గాయపడ్డారు.

Update: 2025-10-04 15:59 GMT
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులు

అప్పటి వరకు ఆ చిన్నారులంతా ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. మధ్యాహ్నం తమ వీధిలో జరిగే అన్నదాన కార్యక్రమానికి వెళ్లే వరకు కేరింతలు కొట్టారు. అన్నదానానికి వేళయిందన్న కబురందడంతో అక్కడకు ఉరుకులు, పరుగులతో చేరుకున్నారు. అంతలోనే ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఏడ్పులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 16 మంది చిన్నారులు, మరో నలుగురు పెద్దలు నేలపై దొర్లుతూ కొందరు, పరుగులు పెడుతూ మరికొందరు కనిపించారు.


కాలిన గాయాలతో బాధపడుతున్న మహిళ

అసలేం జరిగిందంటే?
ఏటా విశాఖలోని జాలరిపేటలో దసరా ముగిశాక అన్నదానం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఎప్పటిలాగే శనివారం పిళ్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపం సమీపంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాసేపట్లో భోజనాలు వడ్డిస్తారనగా అన్నం వార్చే క్రమంలో సలసలా మరుగుతున్న గంజి పాత్ర ప్రమాదవశాత్తూ తిరగబడి అక్కడున్న వారిపై పడడంతో సమీపంలో ఉన్నవారి కాళ్లు, చేతులూ కాలిపోయాయి. హుటాహుటీన స్థానికులు వీరిని కింగ్‌ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్‌)కు తీసుకెళ్లారు. వీరిని ఎమర్జెన్సీ వార్డులో చేర్చి కేజీహెచ్‌ వైద్యులు అత్యవసర వైద్యం అందించారు. చిన్నారుల్లో ఆరుగురు తీవ్రంగాను, మిగిలిన వారు స్వల్పంగానూ గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అందించి వారి ఇళ్లకు పంపించేశారు. తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్‌లోని ప్లాస్టిక్‌ సర్జరీ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.వాణి చెప్పారు.

గంజి పడి కాళ్లు కాలిపోయిన బాలిక

తల్లడిల్లిన తల్లిదండ్రులు..
అన్నదానంలో మధ్యాహ్న భోజనానికి వెళ్లిన తమ బిడ్డలపై వేడి గంజి పడిందన్న సంగతిని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వీరు ఇళ్ల వద్ద, ఇతర ప్రాంతాల నుంచి ఉరుకులు, పరుగులతో కేజీహెచ్‌కు చేరుకున్నారు. తమ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వార్డుల్లోకి వెళ్లి పెద్ద పెట్టున రోదించారు. ఒకపక్క కాలిన గాయాలతో చిన్నారులు, ఇతర బాధితులు, మరోపక్క తల్లిదండ్రులు రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం హోరెత్తింది.

కాళ్లకు గాయాలతో చికిత్స పొందుతున్న బాలిక

సీఎం చంద్రబాబు ఆరా..
విశాఖలో వేడి గంజి పడి చిన్నారులు సహా 20 మంది గాయపడిన ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌తో ఆరా తీశారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ వైద్య సాయం అందించాలని ఆదేశించారు. బాధితులందరికీ నిపుణులైన వైద్య బృందం ప్రత్యేక వైద్యం అందిస్తోందని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాలకు ముప్పు లేదని సీఎంకు కలెక్టర్‌ వివరించారు. మరోవైపు విజయవాడలో ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ కూడా కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు తక్షణ వైద్యం అందించాలని కోరారు.
Tags:    

Similar News