సీఎం చంద్రబాబు తప్పిదం వల్లే వరదలు, 60 మంది బలి : మాజీ సీఎం వైఎస్ జగన్
తుపాను వస్తుందని ముందే తెలిసినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. నందిగం సురేషన్కు అక్రమంగా అరెస్టు చేశారు. తప్పుడు సంప్రదాయం రేపు సునామీ అవుతుందని హెచ్చరించిన జగన్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే విజయవాడకు వరదలు సంభవించాయని మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తుపాను వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. శుక్రవారం నుంచి భారీ స్థాయిలో భారీ స్థాయిలో వర్షాలు పడుతాయని బుధవారం నాటికే అలెర్ట్ వచ్చిందని, సీఎం చంద్రబాబుకు బుధవారం, గురువారం, శుక్రవారం మూడు రోజుల వరకు సమయం ఉంది. మూడు రోజుల వరకు సమయం ఉన్నా.. రెడ్ బుక్ పాలనపైనే దృష్టి పెడుతున్నారే కానీ ప్రజల మీద కానీ, ప్రజల అగసాట్లపైన కానీ ధ్యాస పెట్ట లేదనేదానికి వరదలే నిదర్శనమన్నారు. ముందస్తుగా సమాచారం ఉన్న కూడా ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. తుపానుపై అలెర్ట్ వచ్చిన బుధవారం నాడే రివ్యూ మీటింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇంత విపత్తులు జరిగి ఉండేవి కాదన్నారు.
డ్యామ్‌లన్నీ మునిగి ఉన్నాయనే సంగతి సీఎం చంద్రబాబుకు తెలసని, ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ నుంచి వరద నీళ్లు వస్తున్నాయనే సంగతి కూడా సీఎం చంద్రబాబుకు తెలుసని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా తుపాను రాబోతుందని కూడా తెలుసని, ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి, చీఫ్ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెటరీ, హోం శాఖ కార్యదర్శిలతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉండి ఉంటే తర్వాత వీరందరూ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఉండేవారు, తగిన చర్యలు తీసుకునే వారు. ఇరిగేషన్ కార్యదర్శి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో వచ్చిన వరద నీటిని నిల్వ చేసి ఉండే వారు. రెవిన్యూ సెక్రెటరీ రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసే వారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, రిలీఫ్ క్యాంపులకు తలించే పని హోమ్ శాఖ కార్యదర్శి చేసే వారు. ఇవన్నీ ఎందుకు చేయలేదని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఇవన్నీ చేయక పోవడం వల్ల పై నుంచి వచ్చే వరద నీళ్లు, పులిచింతల నుంచి దిగువన వచ్చే నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి వరదలకు కారణమయ్యాయి. చివరికి కృష్ణా నదికి పోవలసిన బుడమేరును కూడా తన ఇంటికి ఇబ్బంది కలిగిస్తాయని ప్రజలకు నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి దాటిన తర్వాత బుడమేరు గేట్లు ఎత్తివేసి విజయవాడ మీదకు వరద నీటిని వదిలేశారన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది బలయ్యారన్నారు. 60 మంది చినిపోయిన తుపాను ఘటన ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడుపైన ఎందుకు నెగ్లిజెన్స్ కేసు నమోదు చేయకూడదన్నారు. ఈ తప్పును డైవర్ట్ చేసేందుకు మాజీ ఎంపీ నందిగం సురేషన్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్టులకు తెరతీసారన్నారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల గురించి మాట్లాడుతూ వాటికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో కూడా ఈ బోట్లున్నాయన్నారు. ఈ బోట్లు గత నాలుగు నెలలుగా సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఇసుక దోపిడీలో భాగస్వాములయ్యారని విమర్శించారు. ఉషాద్రి అనే వ్యక్తి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో కలిసి దిగిన ఫొటోలు కనిపిస్తున్నాయన్నారు. రామ్మోహన్ అనే వ్యక్తి టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరామ్ సోదరుడి కుమారుడు అని అన్నారు. టీడీపీ హయాంలోనే వీటికి అనుమతులిచ్చారని అన్నారు. ఆలూరి చిన్నా వ్యక్తి కూడా టీడీపీకి చెందిన వారే అన్నారు. బోట్లన్నీ టీడీపీకి చెందిన వారివే అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు గోబెల్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.