ఐదు ఊర్లు సరే..! ఆ రెండిటి మాటేంది బాబూ?

ఉభయ రాష్ట్రాల సీఎంల చర్చపై భిన్నస్వరాలు వ్యక్తం అయ్యాయి. ఆగిన చోటి నుంచి కాకుండా, చర్చలకు మళ్లీ కమిటీలు ఎందుకు? టీటీడీ, తీరప్రాంత వాటాపై సీఎం చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? వారివి గొంతెమ్మ కోరికలే అని అంటున్నారు.

Update: 2024-07-09 05:33 GMT

ఉభయ తెలుగు రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ విభజన చట్టం- 2014 మేరకు ఆస్తుల పంపకంపై చర్చలకు తొలి అడుగు వేశారు. చర్యలు సామరస్య వాతావరణంలో జగడానికి మూడు కమిటీలు ఏర్పాటు చేయడం వరకు ఓకే. ప్రభుత్వ పెద్దల మాటలు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి నోటి నుంచి వచ్చిన రెండు అంశాలు గొంతెమ్మకోర్కెను తలపిస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి అర్ధరహితమైనవని కొందరు వ్యాఖ్యానించారు. ఇలాంటివి చర్చలకు ప్రతిబంధకం అవుతాయన్నారు. తిరుమలలో మొక్కులు చెల్లించడానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఆమె చేసిన ప్రతిపాదనలు కొనసాగింపుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయనే భావన కూడా వ్యక్తమైంది. అంతేకాకుండా, పోలవరం సమీపంలోని ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు కేటాయించే అంశంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చర్చల సారాంశాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు ఎందుకు వెల్లడించలేదు. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి.

హైదరాబాద్ వేదికగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు రెండు రోజుల కిందట తమ రాష్ట్ర అధికారులు, మంత్రులతో కలిసి భేటీ నిర్వహించడం ఆహ్వానించతగిన అంశమే. ఇరు రాష్ట్రాల్లో భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశాల్లో వారిద్దరూ చతురత పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే..

మానవనిర్మిత భవనాలు, అభివృద్ది కార్యక్రమాలతో సృష్టించిన సంపద, ఆదాయ వనరులను పంచుకోవడంలో పట్టువిడుపులు ఉండాలి. పరస్పర సహకారం కూడా అవసరం. అది కూడా విభజన చట్టాలకు లోబడి ఉంటే రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వంతో సాగించిన చర్చలు కొనసాగింపుగా కాకుండా, మూడు కమిటీల ఏర్పాటుతో మరింత ఆలస్యం కావడమే కాకుండా, నిర్దిష్ట అజెండా సిద్ధం చేశారా? లేరా? వాటిని వెల్లడించలేదు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి.
అదే ప్రస్తుతం చర్చ
"సహజసిద్ధంగా ఏర్పడిన తీరప్రాంతంలో వాటా కోరడం, వందల, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన టీటీడీ, ప్రధానంగా తిరుమలలో 42 శాతం వాటా" కోరుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సూచన ప్రాయంగా వెల్లడించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పెద్దల మదిలో ఈ విషయం లేకుంటే ఒక అధికారిగా ఆమె ఆ తరహా లీక్ ఇస్తారా? అనేది కూడా చర్చకు దారితీసింది. ఈ అంశం అన్యాయం. చర్చలకు ప్రతిబంధకం కాకూడదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు.
"ఏపీ పోర్టులు, తీరప్రాంతంలో వాటా కావాలని తెలంగాణ కోరడంపై సీఎం చంద్రబాబు ఎందుకు ఖండించలేదు. ఇందులో ఏమైనా అర్థం ఉందా?" అని ఆయన ప్రశ్నించారు. " విభజన సమస్యలపై ఇద్దరు సీఎంలు మాట్లాడింది తక్కువ. మిగిలిన అంశాలపైనే ఎక్కువ మాట్లాడారు" అని మార్గాని భరత్ ఆరోపించారు.

చంద్రబాబు ముందు సవాల్...

తెలంగాణ అధికారులు తెరమీదకు తీసుకు వచ్చిన రెండు అంశాల విషయంలో ఏపీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు చతురతకు సవాల్ గానే నిలిచిందని చెప్పవచ్చు. ఎన్.టీ. రామారావు తరహాలో ధృడమైన నిర్ణయం తీసుకోవాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తు చేస్తోంది.

భక్తులు సమర్పించే కానుకలు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాకి మాత్రమే చెందాలి. అని వందల ఏళ్లుగా ఉన్న మిరాశీ వ్యవస్థను మాజీ సీఎం ఎన్.టీ. రామారావు 1986 రద్దు చేశారు. అప్పటి వరకు పోటు (లడ్డూ, ఇతర ప్రసాదాలు తయారు చేసే వంటశాల) టీటీడీ పాలక మండలి పరిధిలోకి తీసుకుని రావడంతో పోటు మిరాశీదారు కింద పనిచేసే వైష్ణవ బ్రాహ్మణులు సంస్థ ఉద్యోగులుగా మారారు. ఆ తరువాత న్యాయస్ధానం సూచనతో వారికి, నాలుగు వంశాల్లో గొల్లపల్లి,పెద్దింటి, పైడిపల్లి, తిరుపతమ్మ వంశానికి చెందిన నలుగురు ప్రధాన అర్చకులుగా, 25 మంది అర్చకులుగా, సహాయకులుగా సంభావన కింద అర్చకులుగా 45 మంది శ్రీవారి సేవలో ఉన్నారు.

ఎన్టీ. రామారావు కాలంలో తీసుకుచ్చిన సంస్కరణల ద్వారా తిరుమల ఆధ్యాత్మిక గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి స్వామివారి ఆస్తులు, స్వామి వారికి చెందేలా చేయడంతో పాటు ధార్మిక, విద్య, వైద్యం, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ మరింత విస్తృతం చేశారు. ఆ కోవలో ఏర్పడినవే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పేదల కోసం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం స్విమ్స్ ఆస్పత్రి ఏర్పాటు, అంతర్జాతీయంగా ఖ్యాతి సంపాదించిన 1985లో ఏర్పాటు చేసిన, బర్డ్స్ ఆస్పత్రి కొత్త భవనాలతో పదేళ్ల క్రితం సీఎం ఎన్. చంద్రబాబు విస్తరించారు. వీటన్నింటిలో వాటా కోసం తెలంగాణ గొంతెమ్మ కోర్కెలకు ఆయన తన సమర్థతతో ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే.

రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, "ఇది వివాదానికి ఆజ్యం పోయడమే కాకుండా, అర్ధరహితమైంది" అన్నారు. "క్షమార్హం కాని ఈ అంశం జోలికి వెళ్లకూడదు" అని సూచించారు. చారిత్రక నేపథ్యం కలిగిన కట్టడాలు ఏ ప్రాంతంలో ఉన్నవి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయాలి. మినహా వాటా కోరడం అంటే, కొత్త వివాదాలను తెరపైకి తీసుకుని రావడమే" అన్నారు. "మదరాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పడు పెద్ద మనుషులు తమిళనాడులోని ఆలయాలు, ఆస్తుల్లో వాటా కోరారా?" అని గుర్తు చేశారు. ఈ సూత్రాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంత సెంటిమెంట్ ఆ ప్రాంతానికి పరిమితం చేసి, పరస్పరం గౌరవించుకోవాలన్నారు. రాష్ట్రం విడిపోయినప్పడు కర్నూలులో రాజధాని ఉంది. అన్ని ప్రాంతాల సౌలభ్యం కోసమే కదా.. రాజధానిని రాయలసీమ వాసులు త్యాగం చేసింది. అని కూడా భూమన్ గుర్తు చేశారు. మాట వరుసకు అంటున్నా.. హైదరాబాద్ లో సగం వాటా అడిగితే ఇస్తారా? ఇది కరెక్ట్ కాదు. అని భూమన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.


తిరుమలలో రేవంత్ హింట్
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిశాక, మనువడి పుట్టు వెంట్రుకలు తీయించడం ద్వారా మొక్కు చెల్లించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన తన మనసులోని రెండు కోరికలు వెల్లడించారు. "తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి సత్రం, కల్యాణ మండపం నిర్మాణం" కోసం "ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం, సీఎంను కలసి విన్నవిస్తా" అని తిరుమలలో వాటా కోసం అన్నట్లు ముందుగానే హింట్ ఇచ్చారు. అప్పటికే టీడీపీ కూటమి ఏర్పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్. చంద్రబాబు నాయడు సీఎం కావడం తథ్యం అనే భావనతోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలా వ్యాఖ్యానించి ఉండవచ్చనేది తాజా మాటలు ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.
"శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వ్యవహారంపై సీఎంలు ఎందుకు చర్చించలేదు. అని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. టీటీడీ ఆదాయం, పోర్టుల్లో వాటా కావాలని తెలంగాణ కోరింది. సీఎంల భేటీ చర్చల అజెండా రహస్యంగా ఎందుకు ఉంచారు" అని అంబటి ప్రశ్నించారు.
ముందున్న సమస్యలు ఇదే కదా..
పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై ఇరువురు సీఎంల మధ్య ప్రధానంగా చర్చ జరగాలి. షీలా బీడే కమిటీ సిఫార్సులను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగడానికి చొరవ తీసుకోవాలి. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాలు,. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధాన అంశాలు. ఉద్యోగుల పరస్పర మార్పిడి,వృత్తి పన్ను పంపకం, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశం కూడా ప్రధానమైంది. హైదరాబాద్​లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించే అంశంపై తెలంగాణ సమాజంలో నిరసన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో కూడా విరుచుకు పడుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిపోయాయి. రెండు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా బ్యాంకులకు మాత్రమే పరిమితమైన రూ. ఎనిమిది వేల కోట్లు సద్వినియోగం చేసుకునే దిశగా పంపకాలు పూర్తి చేసుకుంటే మంచిది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత వల్ల ఆ నిధుల వినియోగంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 9వ షెడ్యూల్‌లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపి జెన్కో విలువే రూ.2,448 కోట్లుగా నిర్ధారణ అయ్యింది. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్​ఫెడ్​ను విలువ కట్టారు. 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నట్టు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను ఏపీ - తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. అయితే రూ.1,435 కోట్ల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పంచాయితీ తేలడం లేదు.

హామీ ఇచ్చారు. సాధిస్తున్నారు..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ఐదు గ్రామాలను 2014 రాష్ర్ట విభజన తరువాత అప్పటి సీఎం ఎన్. చంద్రబాబునాయుడు పట్టుబట్టి సాధించారు. తెలంగాణ రాష్ర్ట సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి కృషి చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ మేనిఫోస్టోలో ప్రకటిచింది. తాజాగా తెలంగాణ, ఆంధ్ర సీఎంలు రేవంత్ రెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల అధికారులతో కలిసి సాగించిన చర్చల్లో ఐదు పంచాయతీలుఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తమ పట్నం, పిచుకాలపాడు సమస్య వచ్చింది. తిరిగి ఆ పంచాయతీలకు తెలంగాణకే కేటాయించడానికి ఏపీ అధికారుల నుంచి సానుకూలత సాధించారు. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరాన్ని ఏపీ అధికారులు గుర్తు చేశారు. ఆ గ్రామాల ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటే, రెండు రాష్ట్రాల మధ్య వారు నలిగిపోవాల్సిన అవసరం ఉండదు. సమస్య కూడా సామరస్యంగానే పరిష్కారం అవుతుంది.
ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పందించారు. "ఏడు గ్రామాలను అన్యాయంగా ఏపీలో కలిపారని అంటున్న వారు చరిత్ర తెలుసుకోవాలి. ఆ గ్రామాలు ఏపీకి చెందుతాయి" అని స్పష్టం చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా ఉం దని గుర్తు చేశారు. "రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు, వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ వేయడం మంచిందని చెప్పిన ఆయన, ఆస్తుల పంపకాల విషయంలో పంతాలకు పోకపోవడం మంచిది" అని హితవు పలికారు.
మూడు కమిటీలు కాలయాపనకే..
పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు ద్వరా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలకు త్రిసూత్ర పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అందులో అధికారులు, మంత్రులు వారి పరిధిలో సాధ్యం కాకుంటే ఉభయ రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుంటారని వెల్లడించారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ ప్రతినిధులుగా మాజీ మంత్రులు పేర్ని నాని, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పది అంశాలతో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "పోలవరం ముంపు గ్రామాలు తిరిగి అప్పగించడం, టీటీడీలో వాటా కోరిన విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఏపీ నుంచి ఒక అధికారి కూడా ప్రకటన చేయకపోవడం సందేహాలను బలపరిచినట్టు అవుతుంది" అని పేర్కొన్నారు.
"కమిటీ ఏర్పాటు అంటే విభజన సమస్యల పరిష్కారంలో ఏపీని వెనక్కు లాగడం మాదిరి ఉంది " అన్నారు. కమిటీ ఏర్పాటు అంటే మరింత జాప్యం చేయడమే. పార్లమెంట్ చేసిన చట్టంలోని అంశాలపై కేంద్రం సీనియర్ అధికారి షీలా బేడీ కమిటీ నియమించింది. ఆస్తుల వివాదంపై ఆ కమిటీ సిఫారసులు చేసింది. పదేళ్లుగా అనేక దఫాలు చర్యలు జరిగాయి. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి చర్యలు సాగించాలి. మినహా మళ్లీ కమిటీలు ఎందుకు అని వారు ప్రశ్నించారు.
Tags:    

Similar News