రోడ్డెక్కిన " ఉక్కు" మహిళ!.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇదే ప్రథమం
విశాఖ ఉక్కు చరిత్రలో ఇదే తొలిసారి. నెలన్నరగా నిలిచిపోయిన వేతనాల చెల్లింపులు. ఇప్పటికే చనిపోయిన కార్మికుల బెనిఫిట్లు నిలిపివేత.
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సరికొత్త ఆందోళనకు తెరలేచింది. ఈ ప్లాంట్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా జీతాల కోసం భార్యాపిల్లలు రోడ్డెక్కారు. ఈ ఉక్కు కర్మాగారం కొన్నాళ్ల నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పైగా ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. ఒకపక్క నష్టాలు, మరోపక్క అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొన్నాళ్లుగా ప్లాంట్లో ఉన్న మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటి మాత్రమే ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. రెండోది ఇటీవలే పునః ప్రారంభించినా ఉత్పత్తికి ఇంకా సమయం పట్టనుంది.
దీంతో ప్రస్తుతం మూడో వంతు మాత్రమే (ఏడు వేల టన్నులు) ఉత్పత్తి జరుగుతోంది. నాలుగున్నరేళ్లుగా ఉక్కు కార్మికులు ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినా వీరి ఘోష కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇలా రోజురోజుకూ ఉక్కు చిక్కుల్లో కూరుకుపోతోందే తప్ప ఉపశమనం కలగడం లేదు. ఈ ప్లాంట్ కోసం కేంద్రం ఇటీవల రూ.1640 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. అయితే ప్లాంట్ యాజమాన్యం ఈ సొమ్మును జీఎస్టీ బకాయిలు, బ్యాంకు అప్పులకు చెల్లించింది. దీంతో ఆశించిన స్థాయిలో ఊరట లభించ లేదు.
వాస్తవానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల చాన్నాళ్ల నుంచి ఉక్కు ఉద్యోగులు/కార్మికులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదు. ఫలితంగా ఈ కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా 15వ తేదీలోగా ఒక దఫా, 25వ తేదీలోగా రెండో దఫా జీతాలను చెల్లిస్తుంది. నెలన్నర నుంచి ఈ జీతాలు కూడా ఇవ్వడం మానేసింది. ఇప్పటికే ఏటా దసరాకిచ్చే బోనస్ కూ మంగళం పాడింది. దీపావళికి కూడా వేతనం ఇవ్వకుండా ఉక్కు ఉద్యోగులను ఉసురు పెట్టింది.
కొద్దిరోజులుగా జీతాల చెల్లింపు ఇదిగో అదిగో అంటూ వస్తున్న యాజమాన్యం ఆ హామీలేవీ అమలు చేయకుండా వాయిదాలేస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారింది. కడుపు మండిన కార్మిక కుటుంబాలు జీతాలు చెల్లించాలంటూ బుధవారం రోడ్డెక్కాయి. కార్మికుల భార్యా పిల్లలు ఉక్కు మెయిన్ గేటు ట్రైనింగ్ సెంటరు వద్ద స్వచ్ఛందంగా (యూనియన్ల ప్రమేయం లేకుండా) ఆందోళన చేపట్టారు.
'తక్షణమే వేతనాలు చెల్లించి ఉద్యోగుల కుటుంబాలను కాపాడండి.. ప్లీజ్ సేవ్ అవర్ ఫ్యామిలీ' అంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఇన్నాళ్లూ ప్రైవేటీకరణ చేయవద్దంటూ కార్మికులే ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్లాంట్ చ రిత్రలోనే తొలిసారిగా కుటుంబ సభ్యులు జీతాల కోసం ఆందోళన బాటపట్టడం కలకలం రేపుతోంది. నెలకు ప్లాంట్ ఉద్యోగులకు సుమారు రూ.80 కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది.
మున్ముందు మరింత మందితో..
బుధవారం కార్మికుల కుటుంబాలు జీతాల కోసం రోడ్డెక్కిన ఘటనతో మిగిలిన ఉక్కు కార్మికుల్లో చర్చనీయాంశమైంది. వీరి స్ఫూర్తితో త్వరలో మరింత మంది ఇదే తరహాలో నిరసనకు దిగాలని యోచిస్తున్నారు. మరోవైపు ఈనెల 10న (ఆదివారం) పాతగాజువాక జంక్షన్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
చనిపోయిన వారి బెనిఫిట్లలోనూ..
ఇక ఉద్యోగంలో ఉంటూ మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇచ్చే బెనిఫిట్ల విషయంలోనూ యాజమాన్యం కనికరం లేకుండానే వ్యవహరిస్తోంది. ఉక్కు యాజమాన్యం నిబంధనల ప్రకారం.. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం కింద ఎవరైనా కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి పీఎఫ్, గ్రాట్యుటీలు యాజమాన్యం వద్దనే ఉంచుకుని పదవీ విరమణ వయసు (60 ఏళ్ల) వరకు ఆ కుటుంబానికి పూర్తి జీతాన్ని ఇవ్వాలి. అరవయ్యేళ్లు పూర్తయ్యాక ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.
కానీ ఇలా మరణించిన 91 మంది కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన బెనిఫిట్లను గడచిన ఆరు నెలలుగా ఇవ్వడం మానేసింది. ఇలా ఒక్కో కుటుంబానికి సగటున రూ.40 లక్షల చొప్పున రూ.35 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్నాయి. ఎన్నిసార్లు అడుగుతున్నా ఇదిగో అదిగో అంటోందే తప్ప యాజమాన్యం స్పందించడం లేదని ఈ బాధిత కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.