ఉన్నట్లుండి ఊగిపోయి మాట్లాడే పవన్ కల్యాణ్ కశ్మీర్ ఉగ్రదాడి వ్యవహారంలో ఆవేశాన్ని పక్కన బెట్టారు. చాలా సంయమనం పాటిస్లున్నారు. ఒక నాటి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఆయన యుద్ధావేశంతో వూగిపోయారు. ఈ సారి అలాలేదు. సౌమ్యంగా ముస్లీమా? హిందువా? అని అడిగి చంపడం ఏమిటని ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్ర దాడి వ్యవహారంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జాతీయ సమస్య కావడం వల్ల గతంలో స్పందించినంతగా ఆయన మాటల్లో దూకుడు కనిపించలేదు. శనివారం తమ పార్టీ వ్యూహం ఏమిటో ప్రకటించే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం విజయవాడలోని ఏలూరు రోడ్డులో జనసేన నేతలు మానవహారం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ హిందూత్వ వాదిగా కఠినమైన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు చాలా జాగ్రత్తగా అభిప్రాయాలు వ్యక్తం చేసే తెలుగుదేశం నాయకత్వాన్ని ఇరుకున పెడుతుందని, కూటమి ఆరోగ్యానికి అది మంచిది కాదని పవన్ భావించారా?
ఈ దాడిలో ఏపీకి చెందిన కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు, విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి మరణించారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి ఆవేదన విన్నప్పటికీ, సంచలనాత్మక ప్రకటనలు చేయకుండా నిశ్శబ్ద నిరసనకు పరిమితమయ్యారు. ఇలాంటి పెద్ద సంఘటన ఎదురైనపుడు పవన్ భావావేశం తో ఊగిపోవాలి. రెచ్చిపోవాలి. పళ్లు పటపట కొరకాలి. ఏవో ప్రతిజ్ఞలు చేయాలి. అలాంటి సన్ని వేశం నిన్న ఎదురవలలేదు. ఆశ్చర్యం.
ఇది ఆయన గత వైఖరులతో పోలిస్తే అసాధారణ మని చెప్పొచ్చు. ఉదాహరణకు తిరుపతి లడ్డూ వివాదంలో ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసి, సనాతన ధర్మం గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తరువాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించే క్రమంలో ఆవేశ పూరితంగా మాట్లాడారు. జాతీయ వార్త అయ్యారు. దేశంలోని పత్రికలన్నీ ఆయన మాటలను విశ్వేషించాయి.కొందరయితే మరీ రెచ్చిపోయి దక్షిణాది యోగి అని కూడా అన్నారు. అయితే పహల్గాం ఘటనలో ఆ స్థాయి ఉద్వేగం కనిపించలేదు. ఈ వైఖరి వెనుక రాజకీయ కోణాలు అనేకం ఉన్నాయని భావించాల్సి ఉంటుంది.
సంయమనం వెనుక రాజకీయ కోణాలు
పవన్ కల్యాణ్ సాధారణంగా భావోద్వేగ ప్రకటనలకు పేరుగాంచిన నాయకుడు. ఆయన జనసేన ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై ఉద్వేగంతో స్పందించడం, ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా విమర్శించడం చేస్తూ వచ్చారు. అయితే పహల్గాం ఉగ్రదాడి విషయంలో ఆయన సంయమనం పాటించడం వెనుక కీలక రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల మేరకు పవన్ సంచలన వ్యాఖ్యలకు బదులు కొవ్వొత్తుల వెలుగులో నిశ్శబ్ద నిరసన ద్వారా తన నిరసనను తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వంలో సమన్వయం, స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నంగా కనిపిస్తోంది. జనసేన బీజేపీతో కూటమిలో భాగంగా ఉంది. పహల్గాం ఉగ్రదాడి జాతీయ భద్రతాంశం కావడంతో ఏమాత్రం మితిమీరి స్పందించిన కూటమి ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని పవన్ భావించి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. పవన్ గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీని విమర్శించినప్పుడు రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుని, ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, కూటమి భాగస్వాములు తలా ఒకరీతిగా స్పందించరాదని, కూటమి నుంచి ఒకే స్థాయి రాష్ట్ర రాజకీయాల పరిస్థితులకు అనువుగా స్పందించాలని పవన్ కొందరు సలహా ఇచ్చారని టాక్.
జాతీయ నాయకుడిగా ఎదుగుదలలో భాగం..
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తన ఇమేజ్‌ను రాష్ట్ర స్థాయి నాయకుడి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సంచలనాత్మక ప్రకటనలు ఆయన్ని వివాదాస్పద నాయకుడిగా మారుస్తున్నాయి తప్పహోదా పెంచేందుకు ఉపయోపడటం లేదు. అందుకే నిశ్శబ్ద నిరసన ద్వారా ఆయన సంయమనం, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తిరుపతి లడ్డూ వివాదంలో ...
తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా స్పందించి, 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఈ విషయం సనాతన ధర్మంతో ముడిపడి ఉండడం, ఆయన అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తించడం వల్ల ఆయన బలంగా స్పందించారు. విజయవాడలో దుర్గమ్మ గుడి మెట్లు కడిగి బొట్లు పెట్టి పూజలు చేశారు. అయితే పహల్గాం ఉగ్రదాడి జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడం, ఇందులో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కీలకం కావడంతో, ఆయన రాజకీయంగా సున్నితంగా వ్యవహరిస్తున్నారు. లడ్డూ వివాదం రాష్ట్ర స్థాయి అంశంగా ఉండగా, పహల్గాం ఘటన జాతీయ స్థాయి సున్నితమైన అంశం కావడం వల్లే ఆయన దూకుడు వ్యాఖ్యలు చేయలేదని పరిశీలకుల మాట. ఈ వ్యత్యాసమే ఆయన వైఖరిలో తేడాను తెచ్చిందనొచ్చు.
ఈ కూటమిని బలహీనం చేసే ఏ చర్యనైనా పవన్ నివారించాలనుకుంటున్నట్లు సమాచారం. జనసేనను బలోపేతం చేసేందుకు పవన్ రాష్ట్రంలోనే కాక తెలంగాణలో కూడా పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన దీర్ఘకాల లక్ష్యాలను దెబ్బతీస్తాయని భావించి ఉండవచ్చనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. నిశ్శబ్ద నిరసన ద్వారా పవన్ బాధిత కుటుంబాల పట్ల సానుభూతిని చూపడంతో పాటు, రాజకీయ విమర్శల నుంచి తప్పించుకున్నారు.
సోషల్ మీడియాలో పవన్ పై అసంతృప్తి పవన్ సంయమన వైఖరి కొందరిలో అసంతృప్తిని కలిగించింది. సోషల్ మీడియాలో కొందరు ఆయనను "మౌనంగా ఉండిపోయారు" అని విమర్శించారు. గతంలో ఆయన ఉద్వేగభరిత వైఖరికి అలవాటైన అభిమానులు, ఈ సంయమనాన్ని బలహీనతగా భావించే అవకాశం ఉంది. అయితే ఈ విమర్శలను తట్టుకునేందుకు పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవం, అభిమానుల మద్దతు సరిపోతాయని భావించవచ్చు.
పవన్ మాటల వెనుక కూటమి రాజకీయం..
పహల్గాం ఉగ్రదాడిపై పవన్ కల్యాణ్ అసాధారణ సంయమన వైఖరి వెనుక కూటమి రాజకీయాలు, బీజేపీతో సంబంధాలు, జాతీయ స్థాయి ఇమేజ్ నిర్మాణం వంటి వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. తిరుపతి లడ్డూ వివాదంలో ఆయన చూపిన ఉద్వేగం రాష్ట్ర స్థాయి అంశానికి సరిపోయినప్పటికీ, పహల్గాం వంటి జాతీయ అంశంలో సంయమనం రాజకీయంగా సముచితమని ఆయన భావించినట్లు కనిపిస్తుంది. ఈ వైఖరి జనసేన భవిష్యత్తును, 2029 ఎన్నికల్లో ఆయన పాత్రను బలపరచడంలో కీలకమయ్యే అవకాశం ఉంది. అభిమానుల అంచనాలను సమతుల్యం చేయడం ఆయనకు సవాలుగా మారింది.
చంద్రబాబు రాజకీయ వ్యూహం
చంద్రబాబు సాధారణంగా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన గతంలో భావోద్వేగ ప్రకటనల వల్ల కొన్ని రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పవన్ ఎక్కువగా స్పందిస్తే, చంద్రబాబు జాతీయ స్థాయిలో కేంద్రంతో సమన్వయం చేసుకునే వ్యూహం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబు కూటమిలో పవన్ కల్యాణ్‌ను కీలక భాగస్వామిగా చూస్తారు. కానీ ఆయన స్వతంత్ర వైఖరిని నియంత్రించాలనుకుంటారు. పవన్ అతిగా స్పందిస్తే, జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఉద్వేగాలు పెరగొచ్చు. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచవచ్చు. టీడీపీ-జనసేన మధ్య అంతర్గత ఘర్షణలకు దారితీయవచ్చు నని భావించిన చంద్రబాబు పవన్ కల్యాన్ ను కొన్ని అంశాల్లో నియంత్రిస్తున్నట్లు సమాచారం.
కొన్ని సందర్భాల్ల్ పవన్ కల్యాణ్ స్పందనలు చంద్రబాబు కూటమి ఐక్యత, రాజకీయ వ్యూహం, పరిపాలనా స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు సంయమనం, సమన్వయం కోసం పవన్‌ను నిశ్శబ్ద నిరసన వంటి సున్నితమైన చర్యలకు పరిమితం చేసినట్లు కనిపిస్తుంది.