ఒరేయ్, ఎర్రిస్వామి.. బస్సెట్టా తగలబడిందో చెప్పరా!

బస్సు తగలబడిన తీరును ఎస్పీ వివరిస్తూ.. అసలు రహస్యం బయటపడిందన్నారు

Update: 2025-10-25 12:22 GMT
“మేమిద్దరం ఎగిరిపడ్డాం... కింద నుంచి పెట్రోల్‌ వాసన వచ్చింది, క్షణాల్లో మంటలు చెలరేగాయి. ఇక అంతే నేను అక్కడి నుంచి పారిపోయా” అంటున్నాడు కర్నూలు బస్సు దగ్ధం కేసులోని ప్రత్యక్ష సాక్షి. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు కొత్త సీసీటీవీ వీడియో దొరికింది. ఇప్పుడిదో కొత్త మలుపు.

ఎర్రిస్వామి గ్రాఫిక్స్

కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదంలో బైక్‌పై ప్రయాణించిన ఇద్దరిలో ఎర్రిస్వామి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతని మిత్రుడు శివశంకర్ బస్సు కింద పడి చనిపోయాడు. బస్సు ఈడ్చుకుపోయిన అతని మోటారు సైకిల్ నుంచి మంటలు వచ్చి బస్సుకి అడుగుభాగాన నిప్పంటుకుంది. దీంతో 19 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పారిపోయిన ఎర్రిస్వామి కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల విచారణకు ప్రధాన సాక్షిగా నిలిచాడు.
ఈ ఎర్రిస్వామి స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లి. డోన్ వెళుతుండగా ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. తన మిత్రుడు శివశంకర్ బండి ఎక్కేముందు వీళ్లిద్దరూ మద్యం తాగినట్టు చెబుతున్నారు.
ఎర్రిస్వామి చెప్పిన వివరాల ప్రకారం..
“మేం బండిపై పోతున్నాం. బస్సు చాలా వేగంగా ఢీకొట్టింది. మేమిద్దరం ఎగిరి పడిపోయాం. నేను రోడ్డుపక్కకు జారుకున్నాను. కింద నుంచి పెట్రోల్‌ వాసన వచ్చింది. క్షణాల్లో మంటలు చెలరేగాయి. వెంటనే పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బస్సులో నుంచి కేకలు మాత్రమే వినిపించాయి.” అని ఎర్రిస్వామి పోలీసులకు చెబుతున్నాడు.
అతని వాంగ్మూలం ప్రకారం, మొదట మంటలు బస్సు కింద భాగంలోనే అంటుకున్నాయి. ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించాయి. బస్సును పూర్తిగా కమ్మేశాయి. పోలీసులు ఈ వాంగ్మూలాన్ని ప్రాధమిక ఆధారంగా తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసు రీకనస్ట్రక్షన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది.
బస్సు దగ్ధం కావడానికి కొన్ని గంటల ముందు రికార్డయిన ఒక సీసీటీవీ వీడియో ఇప్పుడు దర్యాప్తును కొత్త దిశలోకి మళ్లించింది. ఆ ఫుటేజ్‌ ప్రకారం, ప్రమాదానికి గంట ముందు బైక్‌ రైడర్‌ బీ. శివశంకర్‌ తన స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు. అక్కడ పెట్రోల్ పోసే వ్యక్తి లేకపోవడంతో పెద్దపెద్దగా కేకలు వేస్తూ పిలిచారు. కాసేపు అటూఇటూ తిరిగారు. పట్టరాని కోపంతో బండిని సైడ్ స్టాండ్ పై గిరగిరా తిప్పుతూ బండిని స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతను ప్రవర్తించిన తీరు మద్యం మత్తులో చేసినట్టుగా కనిపించింది.
ఫుటేజ్‌లో శివశంకర్‌ కదలికలు నిలకడగా లేవు. మద్యం లేదా మరే ఇతర మత్తు పదార్థం ప్రభావంలో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని నిర్ధారించేందుకు అతడి విసెరా నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు.
పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, ప్రమాదం ఉల్లిండకొండ సమీపంలో ఉదయం 3 నుంచి 3.30 మధ్యలో జరిగింది. శివశంకర్‌ బైక్‌ వేగంగా వెళ్తుండగా వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టాడు. శుక్రవారం వేకువజామున స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి శివశంకర్‌ ద్విచక్ర వాహనంపై డోన్‌కు బయలుదేరాడు. వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో వారిద్దరు ఎగిరిపడ్డారు. ఘటనాస్థలిలోనే శివశంకర్‌ మృతి చెందగా.. ఎర్రిస్వామికి గాయాలయ్యాయి. దీంతో ఎర్రిస్వామి ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాడు. ప్రమాద ఘటనపై అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
బస్సు బైక్‌ను దాదాపు 200 మీటర్లు ఈడ్చుకుపోయింది. బైక్‌ నుంచి కారిన పెట్రోల్‌, రాపిడి వేడి కలగలిపి మంటలు చెలరేగాయి.
ఆ మంటలు బస్సు లగేజీ క్యాబిన్‌లోని సరుకును అంటుకుని, పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. నిద్రలో ఉన్న 19 మంది ప్రయాణికులు బయటపడలేక సజీవదహనం అయ్యారు.
ఎర్రిస్వామి వాంగ్మూలం సీసీటీవీ ఆధారాలతో సరిపోవడంతో పోలీసులు అతడిని కీలక సాక్షిగా పరిగణిస్తున్నారు. పెట్రోల్ బంక్ వద్ద రికార్డు అయిన సమయం ప్రకారం శివశంకర్ తెల్లవారుజామున 2.34 గంటలకు పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లారు. బస్సుప్రమాదం 3 నుంచి 3.30 మధ్యలో జరిగింది.
ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్లు లక్ష్మయ్య, శివనారాయణలను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌, ప్రాణనష్టం కలిగించడంపై కేసులు నమోదు చేశారు.

దర్యాప్తు సంస్థలు ఈ ప్రమాదం వెనుక మూడు ప్రధాన కారణాలను పరిశీలిస్తున్నాయి. వాటిలో 1.బైక్‌ రైడర్‌ నిర్లక్ష్యం లేదా మత్తు ప్రభావం 2. బస్సు కంపెనీ భద్రతా ప్రమాణాల ఉల్లంఘన, 3. లిథియం బ్యాటరీల రవాణా వంటి చట్టవిరుద్ధ చర్యలు. ప్రస్తుతం పోలీసులు, ట్రాన్స్‌పోర్ట్‌, రెవెన్యూ శాఖలతో కూడిన హై లెవల్ కమిటీ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది.
జిల్లా ఎస్పీ ఏమన్నారంటే...

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మీడియాకు వెల్లడించారు.

‘‘శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్‌ నడుపుతూ చనిపోయిన శివశంకర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రిస్వామి అలియాస్‌ నానిగా గుర్తించాం. అతన్ని పలు కోణాల్లో విచారించాం. ఎర్రిస్వామి, పల్సర్‌ బైక్‌ నడుపుతున్న శివశంకర్‌ ఇద్దరూ కలిసి లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 2గంటలకు) తుగ్గలికి బయల్దేరారు. మార్గ మధ్యలో అర్ధరాత్రి 2.24 గంటలకు కియాషోరూమ్‌ సమీపంలోని ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద రూ.300 పెట్రోల్‌ పోయించుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే చిన్నటేకూరు సమీపంలో శివశంకర్‌ బైక్‌ నడుపుతూ స్కిడ్‌ అయి.. రోడ్డుకు కుడివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక ఉన్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న శివశంకర్‌ను పక్కకు తీసి, బైక్‌ను తీద్దామనుకునే సరికి అంతలోనే వేగంగా వచ్చిన బస్సు బైక్‌ను ఢీకొని కొద్ది దూరం ఈడ్చు కెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో ఎర్రిస్వామి భయపడి అక్కడి నుంచి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లి పోయాడు. బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనగిస్తున్నాం’’ అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

Tags:    

Similar News