ఐపీఎస్‌ అంజనేయులుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ క్లీన్‌చిట్‌

తనకు, అంజనేయులుకు మధ్య జరిగిన సంభాషణను ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వెల్లడించారు.;

Update: 2025-05-05 08:43 GMT

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో జైల్లో ఉన్న డీజీపీ ర్యాంకు ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్టు మీద స్పందించారు. అధికారులుగా ఉండి తనకు స్నేహితులైన వారిలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఒకరని వెల్లడించారు. తర్వాత కాలంలో మంచి స్నేహితులుగా మారాం. హైదరాబాద్‌లోని ఆంజనేయులు ఇంటికి కూడా వెళ్లాను. ఆయన భార్య కూడా తనకు బాగా తెలుసు. వారి పిల్లలు కూడా బాగా తెలుసు. నాకు తెలిసి పీఎస్‌ఆర్‌ అంజనేయులు మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడు రాలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు. ఎక్కడకు వెళ్తే అక్కడ ఆంజనేయులు టెర్రర్‌ క్రియేట్‌ చేశారు. డౌడీ యిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచి వేశారు. తర్వాత వైఎస్‌ఆర్‌ హయాంలో అంజనేయులును వాట్‌ మిస్టర్‌ అంజన్‌ అని పిలిచేవారు. అలా వైఎస్‌ఆర్‌తో ఉన్న పరిచయం మూలంగా వైఎస్‌ జగన్‌కి కూడా దగ్గర అయ్యుండొచ్చు. అంటూ ఉండవల్లి మాట్లాడారు.

తనకు.. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు ఈ కేసు గురించి జరిగిన ఫోన్‌ సంభాషణను ఆయన వెల్లడించారు. ముంబాయి సినీ నటి కేసులో తక్కిన ఆఫీసర్లు ముందస్తు బెయిల్‌ తీసుకున్నప్పుడే ఆంజనేయులుకు ఫోన్‌ చేసి మీరు కూడా యాంటిస్పేటరీ బెయిల్‌ తీసుకోండి అని చెప్పాను. లేదండీ.. ఒక పది రోజులు జైలుకు వెళ్లి వస్తాను అని అంజనేయులు నాకు చెప్పారు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏంటీ ఆంజనేయులు జోక్‌ చేస్తున్నాడా? అని అనుకున్నాను. సరేలే.. మీరెళ్లండి జైలుకు.. మిమ్మల్ని చూసేందుకు జైలుకు వస్తాను అన్ని చెప్పాను. దీంతో ఆంజనేయులు నవ్వారు.. నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తు ఉండి పోయింది. నేను ఏమనుకున్నానంటే.. ఒక వేళ జైలుకు పంపితే రాజమండ్రికి పంపుతారని అనుకున్నాను. దేశంలో ఇప్పటి వరకు డీజీపీ ర్యాంకులో ఉన్న అధికారులను ఎక్కడా.. ఎప్పుడు అరెస్టు చేయలేదు. ఒక వేళ అరెస్టు అయినా.. జైలుకెళ్లింది లేవు. నాకు తెలిసి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులే జైలుకు వెళ్లిన మొదటి డీజీపీ స్థాయి ఐపీఎస్‌ అధికారి. జైలుకెళ్లినా.. బెయిల్‌ ఇచ్చేస్తారు.
ఆంజనేయులు అరెస్టు అయ్యి జైలుకెళ్లిన తర్వాత నేను విజయవాడ జైలుకు వెళ్లి ఆంజనేయులును కలిశాను. ఇంత ఎండలోబడి ఎందుకు వచ్చారని అంజనేయులు అడిగితే.. అప్పడు చెప్పాను కదా.. మిమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపితే.. చూడ్డానికి వస్తానని.. అందుకే వచ్చాను అని చెప్పాను. కొన్నాళ్లు అయిన తర్వాత, వర్షాలు పడిన తర్వాత రావచ్చు కదా అని ఆంజనేయులు అన్నారు. ఎన్నాళ్లు జైల్లో ఉంటారని అంజనేయులును నేను అడిగాను. అప్పుడే ఎందుకు వదులుతారు. ఇంకా ఉంచుతారు. దీనికి ముందుగానే మానసింగా ప్రిపేరయ్యాను అని పీఎస్‌ఆర్‌ అంజనేయులు తనకు చెప్పినట్లు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు.
తర్వాత ముంబాయి సినీ నటి కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆమె మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. బెయిల్‌ వచ్చిన తర్వాత విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని తిరగతోడారు. డీజీపీ, ఐజీ, డీఐజీ స్థాయిలో ఉన్న అధికారులపై కేసులు పెట్టారు. ఇలా అయితే పోలీసులు ఎవరైనా పని చేయడానికి ముందుకు వస్తారా? అని ప్రశ్నించారు. ఇంకా ఈ కేసు పెండింగ్‌లో ఉండగా.. దీనిని తిరగతోడి కేసు ఎలా పెడతారు? అని నిలదీశారు.
Tags:    

Similar News