‘ఆపరేషన్ బుడమేరు’ సీఎం గ్రీన్ సిగ్నల్.. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
పురపాలనశాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ సింగ్‌నగర్‌లో వరద ముంపు తగ్గిందని వెల్లడించారు.
పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ సింగ్‌నగర్‌లో వరద ముంపు తగ్గిందని వెల్లడించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉందని చెప్పారు. కండ్రిక దగ్గర రోడ్డు సమాంతరంగా లేకపోవడంతో ఒకవైపు నిలిచిన నీటిని మోటార్ల సహాయంతో కాలువలకు మళ్ళించామని చెప్పారు. బుధవారం సాయంత్రానికి ఎక్కడా నీరు లేకుండా చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరోమారు ఇటువంటి వరదలు రాకుండా చూసుకునేలా చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా బుడమేరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఇప్పటికే ‘ఆపరేషన్ బుడమేరు’కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని, ఈ ఆపరేషన్‌ను యుద్ధప్రాతిపదికన అమలు చేసేలా చర్యలు చేపట్టనున్నామని మంత్రి చెప్పారు. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అక్కడ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించామన్నారు.
ఆక్రమణలపై ఫుల్ ఫోకస్
బుడమేరు ఆక్రమణలను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ‘‘ఏళ్ల తరబడి ఆక్రమించుకుని ఉన్న వారికి తగిన ప్రత్యామ్నాయం చూపించే తొలగింపులు చేపడతాం. ఇందుకు మనకున్న చట్ట నిబంధనలు సరిపోకపోతే అవసరాన్ని బట్టి కొత్త చట్టం తీసుకొస్తాం. ఆక్రమణలకు చట్ట ప్రకారమే తొలగిస్తాం. అదే విధంగా భవిష్యత్తులో బుడమేరుకు అంత సులభంగా గండ్లు పడకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ఆ అంశంపై సమీక్షలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు.
రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు..
విజయవాడలో వరద నష్టం అంచనా ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని మంత్రి నారాయణ వివరించారు. అంతేకాకుండా విజయవాడలో పారిశుద్ధ్యం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని, ప్రతి ఇంటికి వెళ్లి మరీ శుభ్రం చేస్తున్నారని, ఇంటి యజమానులు ఇంట్లో లేకపోయినా, ఊరు వెళ్లి ఉన్నా.. వారు వచ్చిన తర్వాత నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి విజయవాడలో దాదాపు 10వేల మంది పారిశుద్ధ్య కామర్ికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని, బుడమేరుకు గండిపడటం వల్ల వచ్చి నీరుకు ఎటూ పోయే అవకాశం లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయని తెలిపారు. బుధవారం, గురువారాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఆహారం అందిస్తామని అన్నారు.