దర్శి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైసీపీ వీడి జనసేనలో చేరిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అవసరాల కోసమే బాలినేని పార్టీ మారారని, ప్రజల కోసం కాదన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు బాలినేని విశ్వ ప్రయత్నాలు చేశారని, కానీ అక్కడ దగ్గరకు చేరనీక పోవడంతో జనసేనలోకి వెళ్లారని బాలినేని మీద విరుచుకు పడ్డారు. తన రాజకీయ లబ్ది కోసమే బాలినేని జనసేనలోకి వెళ్లారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తనకు డబ్బులు ఇవ్వాలని బాలినేని చెప్పారని, ప్రకాశం జిల్లాలో బాలినేని ఎంత దోచుకున్నారో.. అందరికీ తెలుసని, నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి బాలినేని భారీగానే దోచుకున్నారని, బాలినేని దోచుకున్నట్లు ఎవ్వరూ దోచుకోలేదని అన్నారు. బాలినేని దోచుకున్న విషయం ఒంగోలు ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నాటి నుంచి వైసీపీ చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో పీడా విరిగి పోయిందని ప్రజలు భావిస్తున్నారని బూచేపల్లి అన్నారు. బాలినేని వేరే పార్టీలోకి పోవడం వల్ల తమ పార్టీ బాగుదందని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారని చెప్పారు. అవసరమైతే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ మార్చేస్తానని బాలినేని చెబుతున్నాడని, బాలినేనిలాగా పార్టీ మారే వ్యక్తులు లేరని అన్నారు. పదవుల కోసం, పార్టీ మారే బాలినేని లాగా వైసీపీలో ఎవరు లేరని అన్నారు.
పిఠాపురంలో ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ మీద, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద బాలినేని శ్రీనివాసుల రెడ్డి చేసిన విమర్శలను బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తిప్పి కొట్టారు. ఆదివారం బూచేపల్లి మాట్లాడుతూ బాలినేని మీద నిప్పులు చెరిగారు. వైసీపీని కానీ, మాజీ సీఎం జగన్ గురించి కానీ మాట్లాడే అర్హత బాలినేనికి లేదన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద యాక్టర్. ఆయనొక కమలహాసన్. ఆయనతో పెద్ద సినిమా తీయొచ్చంటూ ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ గురించి, వైసీపీ గురించి బాలినేని నానా రకాలుగా మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి లేక పోతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తే లేదని మాట్లాడారని, వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో చనిపోతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011లో పార్టీ పెట్టారని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి మన్ననలతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. బాలినేని అనే వ్యక్తి అవకాశ వాది అని, అలాంటి బాలినేని పట్ల జాగ్రత్త ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సూచించారు.