‘నా ఓటు హక్కును తొలగించారు’.. ఏబీ వెంకటేశ్వరరావు

తన ప్రాథమిక హక్కు అయిన ఓటును కూడా సమాచారం లేకుండా తొలగించారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.

Update: 2024-05-14 06:01 GMT

సోమవారం ఆంధ్ర రాష్ట్రమంతా పోలింగ్ జాతర జరిగింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. పలు కేంద్రాల్లో అర్థరాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. కానీ ఈ పోలింగ్ అంశంపై స్పందించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓటు హక్కు లేకుండా కూడా చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఐదేళ్లుగా కక్ష సాధింపు చర్యలను పాల్పడిన వైసీపీ.. ఇప్పుడు తన ప్రాథమిక హక్కు అయిన ఓటును కూడా తొలగించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనతోపాటు తన భార్య ఓటును కూడా తొలగించారని వెల్లడించారాయన.

సమాచారం లేకుండానే తొలగించారు

విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉండే తమకు లయోలా కాలేజీ ప్రాంగణంలోని 59వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండేవని చెప్పారు. ‘‘ఎప్పటిలానే సోమవారం కూడా ఓటు వేయాడానికి నేను, నా భార్య కలిసి వెళ్లాము. అక్కడి వెళ్లిన తర్వాత మా పేర్లు జాబితాలో లేవని, అక్కడ డిలీటెడ్ అని ఉన్నాయని అధికారులు చెప్పారు. డిసెంబర్ వరకు కూడా మా పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మాకు ఎటువంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండా మా ఓటును తొలగించారు. ఐదేళ్లుగా అక్రమ కేసులు, సస్పెన్షన్లు, పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు తనను ఇలా వేధిస్తుంది’’అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News