నాన్-లోకల్ కోటా రద్దు, సాంస్కృతిక బంధానికి ముగింపు?

నాన్ లోకల్ కోటా రద్దుతో ప్రైవేటు విద్యాసంస్థల జోరు పెరుగుతుందా?;

Update: 2025-05-17 02:20 GMT
ఆంధ్రా ఎంసెట్ లో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ..
తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్షల్లో ఆంధ్రా విద్యార్థుల హవా..
నీట్ లో తెలుగు విద్యార్థుల ఘనత వంటి పత్రికల శీర్షికలు ఇక కనబడవు. వినపడవు. రాష్ట్రం విడిపోయినా గత పదేళ్లుగా విద్యావ్యవస్థలో కొనసాగిన నాన్- లోకల్ కోటాలు రద్దు కావడంతో రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్టుగా భావించవచ్చు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన ప్రాంతీయత, స్థానికతకు పెద్ద పీట వేయడంతో ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ఉమ్మడితనం కనుమరుగైంది. దీంతో ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగిన సాంస్కృతిక అనుబంధం (కల్చరల్ బాండేజీ) కూడా తెగిపోయింది. ఆయా రాష్ట్రాల్లోని పేరున్న విద్యాసంస్థల్లో చదువుకోవాలన్న ఆకాంక్షకు తెరదించినట్టయింది.
విద్యాసంస్థల్లో నాన్ లోకల్ సీట్ల కేటాయింపు రద్దుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చినట్టయింది. ఇప్పటి వరకు తెలంగాణతో పాటు ఇతర నాన్ లోకల్స్ కి ఇస్తున్న 15 శాతం సీట్ల కేటాయింపు విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఏపీలోని ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం కేటాయించిన 15 శాతం సీట్ల కోటా విధానం మే 13తో ముగిసింది.

దీంతో రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా సంస్థల సీట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకే దక్కుతాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 లోని సెక్షన్ 95 ప్రకారం 2014 జూన్ నుంచి 10 ఏళ్ల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు 85:15 నిష్పత్తిలో స్థానికులు, ఇతర రాష్ట్ర విద్యార్థులను చేర్చుకోవాల్సి ఉంది. ఆ పదేళ్ల గడువు 2024 జూన్ తో ముగిసింది. కొత్త విద్యా సంవత్సరం 2025 జూన్ నుంచి మొదలవుతుండడంతో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలు- నాన్ లోకల్ క్యాటగిరీ సీట్లకు ముగింపు పలికాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) సిఫారసులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మ్-డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి కోర్సుల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్టాయిలకు ప్రవేశం పొందే రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని ఉన్నత విద్యామండలి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది.
దీంతో, ప్రభుత్వం ఆంధ్రా యూనివర్శిటీ (AU), శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (SVU)ల ప్రవేశ నిబంధనల్లో మార్పులు చేసింది. AU ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఆ ప్రాంతంలో స్థానికులవుతారు. వారికి 85% సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లు SVU ప్రాంతం విద్యార్థుల కోసం నాన్-లోకల్ కోటాగా ఉంటాయి. SVU ప్రాంతం విద్యార్థులకు కూడా అదే విధంగా 85% స్థానిక కోటా, మిగిలిన 15% AU ప్రాంతం విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
"గతంలో ఉస్మానియా యూనివర్శిటీ (OU) ప్రాంత విద్యార్థులు కూడా ఈ నాన్ లోకల్ క్యాటగిరీలో ప్రవేశాలు పొందేవారు. కానీ ఇప్పుడు OUను పూర్తిగా తొలగించారు. ఇకపై ప్రవేశాలు కేవలం AU, SVU ప్రాంతాల్లోని స్థానికత ఆధారంగా జరుగుతాయి. దీని వల్ల మొత్తం 100% సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కుతాయి" అని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చదివిన విద్యార్థులు AU ప్రాంతానికి, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో చదివిన విద్యార్థులు SVU ప్రాంతానికి చెందిన వారిగా పరిగణిస్తారు. వాళ్లు స్థానికులు అవుతారు.
విద్యార్థులు స్థానికతను గుర్తించాలంటే కనీసం నాలుగేళ్లు ఒకే ప్రాంతంలో చదివి ఉండాలి లేదా ఆ ప్రాంతంలో నాలుగేళ్ల పాటు నివసించి ఉండాలి – అటువంటి విద్యార్థులే స్థానికులుగా అర్హత పొందుతారు.
AU, SVU ప్రాంతాలతో పాటు కొన్ని రాష్ట్రవ్యాప్త విశ్వవిద్యాలయాలు కూడా ఈ విధానానికి లోబడి ఉంటాయి. అవి:
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV), తిరుపతి
ద్రావిడ విశ్వవిద్యాలయం (DU), కుప్పం
డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం (AHUU), కర్నూలు
డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ, కడప
రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)
సిల్వర్ జూబిలీ గవర్నమెంట్ కాలేజ్, క్లస్టర్ యూనివర్శిటీ
ఈ విశ్వవిద్యాలయాల్లో AU, SVU ప్రాంతాలకు 85% సీట్లు ఉంటాయి. ఇందులో 65.62% AU విద్యార్థులకు, 34.38% SVU విద్యార్థులకు ఉంటుంది. మిగిలిన 15% సీట్లు రెండు ప్రాంతాల విద్యార్థులకు మెరిట్ ఆధారంగా ఉంటాయి.
ఇలాంటి చర్యను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2024 ఫిబ్రవరి 27న తీసుకుంది. వారు కూడా 15% నాన్-లోకల్ కోటాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం-
85% సీట్లు OU ప్రాంత స్థానికులకు, 5% సీట్లు తెలంగాణ సంతతి కానీ ఇతర రాష్ట్రాల్లో కనీసం 10 ఏళ్లుగా నివసిస్తున్న వారికి, 10% సీట్లు రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, కేంద్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి కుటుంబాలకు కేటాయిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం — రాష్ట్రంలోని వృత్తిపరమైన, డిగ్రీ, పీజీ స్థాయి విద్యాసంస్థలలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం కేటాయించిన 15 శాతం సీట్ల కోటా రద్దు అయింది. విద్యా రంగంలో ఇదో పెద్ద మలుపు. దీంతో రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల పాటు అమలులో ఉన్న విధానానికి ముగింపు పలికినట్టయింది.
సెక్షన్ 95 ముగిసిన నేపథ్యంలో...
ఈ విధానం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 95 ప్రకారం అమలులోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం, రెండు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థలు పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశ విధానాన్ని కొనసాగించాలని, అందులో 85% స్థానికులకు, 15% ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు కేటాయించాలని పేర్కొంది. ఆ గడువు 2024 జూన్ 2తో ముగియడంతో, ఆ మినహాయింపు ఇక అమలుకావద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు లాభమేనా?
నిజానికి, ఇప్పటి వరకు తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాలో ఉన్న సీట్లలో భాగంగా పెద్ద సంఖ్యలో ప్రవేశాలు పొందుతున్నారు. ఇప్పుడు ఆ 15% కోటా రద్దయింది. అంటే, ఆ సీట్లు ఇక ఆంధ్రా విద్యార్థులకే దక్కనున్నాయి. ఇది ప్రత్యేకించి వ్యవస్థాపిత స్థానిక విద్యార్థులకు ప్రయోజనం కలిగించే పరిణామం.
నాన్-లోకల్ కోటా ద్వారా గతంలో అర్థికంగా వెనుకబడిన జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో అవకాశాలను పొందగలిగారు. ఇప్పుడు అది మూసుకుపోవడంతో సోషల్ మొబిలిటీపై (social mobility) ప్రభావం పడే అవకాశం ఉంది.
అర్హత ఉన్న తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాలో ప్రవేశాలు పొందే అవకాశాన్ని కోల్పోవడంతో, వారి సామాజిక అభివృద్ధికి అవరోధం ఏర్పడవచ్చు.
ఒకే తరగతిలో రెండు రాష్ట్రాల విద్యార్థులు కలిసి చదవడం వల్ల పెరిగిన పరస్పర సహకారం, భిన్నత్వం, సమన్వయం తగ్గే ప్రమాదం ఉంది.
ఈ మార్పులు ప్రధానంగా మధ్య తరగతి, తక్కువ ఆదాయ గల కుటుంబాల పిల్లలపై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే వీరికి ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరే ఆర్ధిక వెసులుబాటు ఉండకపోవచ్చు.
కల్చరల్ బాండేజీకి వీడ్కోలు?
ఉమ్మడి విద్యా వేదికల మాధ్యమంగా సంస్కృతులు పరస్పరం బలపడే అవకాశం ఉంది. ఉమ్మడి తరగతులు రెండు ప్రాంతాల సంస్కృతులను, భాషా పద్ధతులను, ఆచారాలను పరిచయం చేస్తాయి. నాన్-లోకల్ కోటా రద్దుతో ఈ 'కల్చరల్ మిక్సింగ్' క్రమంగా తగ్గిపోతుంది.
ఈ తరహా బై-రీజినల్ మేళవింపులే భవిష్యత్తులో సమైక్యభావనకు బలంగా నిలిచేవి. ఇప్పుడు, ప్రాంతీయ పునాదులపై నిర్మితమైన విద్యా వ్యవస్థ వల్ల యువతలో 'ఇతర రాష్ట్రం' పట్ల అవగాహన లేకపోవచ్చు.
తెలంగాణ-ఆంధ్ర విద్యార్థులు ఒకే వేదికపై చదివిన సందర్భాల్లో మాటల, సాంస్కృతిక పరస్పర ప్రభావం ఉండేది. ఇప్పుడు ఆ దారులు మూసుకుపోనున్నాయి.
తెలంగాణ విద్యార్థులకు ఇక ఆంధ్రాలో అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. వారు ప్రస్తుతం ఐదే శాతం ఇతర రాష్ట్రాల్లో ప్రయోజనానికి అర్హులు. కానీ, మారిన పరిస్థితుల్లో వారు ప్రైవేట్ కాలేజీలపై ఆధారపడాల్సి వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రాల మధ్య సంబంధాలపై సంకేతం
ఈ మార్పులు — చట్టబద్ధంగా సరైనవే అయినప్పటికీ — రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి పరస్పర భాగస్వామ్య విధానాల ముగింపుకు సంకేతం కావచ్చు. ఇది కేవలం విద్య రంగానికి పరిమితమైనదే కాక, ఇతర రంగాల్లోనూ స్వయం పాలన, ప్రాంతీయత ఆధారంగా మార్పుల దిశగా రాష్ట్రాలు సాగుతున్నాయని స్పష్టమవుతుందని ఓ ప్రైవేటు యూనివర్శిటీకి పీఆర్వో గా పని చేస్తున్న రాజశేఖర్ చెప్పారు. దీని లాభనష్టాలను ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు గిరాకీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

AU-SVU మధ్య పరస్పర కోటా కొనసాగుతోంది కానీ ఇది ఆంధ్రాలోపలే పరిమితం. కొన్ని రాష్ట్రవ్యాప్త విశ్వవిద్యాలయాల్లో మాత్రం AU-SVU నుంచి వచ్చే విద్యార్థులకు కోటా వల్ల నష్టం జరుగుతుందనే అభిప్రాయం ఉంది.
ఈ మార్పులను చూస్తే 2014లో మొదలైన విభజన ప్రక్రియ 2024 నాటికి విద్యా రంగంతో పూర్తి అయింది. ఉమ్మడి కోటాలు, సంయుక్త ప్రవేశ విధానాలు ముగిసిపోయాయి. ఇకపై ప్రతి రాష్ట్రం తమ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు మరింత ప్రాంతీయత, స్పష్టతతో పాలన సాగించాల్సిన దశకు వచ్చింది. ఇది విద్యార్థులపై, రాష్ట్రాల పరస్పర సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందో కాలమే తేల్చాలి.
Tags:    

Similar News