‘ఓంక్యాప్’ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలు
నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.;
By : The Federal
Update: 2025-07-16 07:27 GMT
నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్న వారికి ఓంక్యాప్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లే వారికి ఆయా దేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అందుకు తగిన విధంగా గైడ్‌లైన్స్ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన ‘నైపుణ్యం’ పోర్టల్‌ను సెప్టెంబరు మొదటి తారీఖున ప్రారంభించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబందించిన పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
లోకేష్ ఏమన్నారంటే..
నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్షించాను. నైపుణ్యం పోర్టల్ ను ఆగష్టు నాటికి పూర్తిచేసి సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించాను. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓంక్యాప్ ద్వారా కల్పించాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయక మార్గదర్శకాలను రూపొందించాలి. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 0863–2340678, లేదా వాట్సాప్ నెంబర్ 8500027678 ను సంప్రదించాలి. ఇటీవల థాయ్ ల్యాండ్ లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓంక్యాప్, ఎన్‌ఆర్ టి ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. అంటూ ట్వీటర్ వేదికగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.