వసూలు చేసిన ఆ కరెంటు చార్జీలు వెనక్కి ఇచ్చేయండి!

APERC చరిత్రలో కీలక ఆదేశాలు.. వినియోగదారులకు రూ.923 కోట్లు రిఫండ్ ఇవ్వాలని ఆదేశం

Update: 2025-09-29 04:56 GMT
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు దసరా, దీపావళి కానుకల్ని ప్రకటించింది. 20నెలలుగా వసూలు చేసిన ట్రూఅప్ చార్జీలను తగ్గించాల్సిందేనని విద్యుత్ సంస్థను, పంపిణీ సంస్థలను ఆదేశించింది. పరిమితికి మించి ఇప్పటికే వసూలు చేసిన విద్యుత్‌ ఛార్జీలను తిరిగి ఇచ్చివేయాలని (ట్రూడౌన్) రాష్ట్ర విద్యుత్ సంస్థకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రూపంలో ప్రజలకు రూ.923.55 కోట్లు వెనక్కి వెళ్లనున్నాయి. APERC స్థాపన (1999) తర్వాత వినియోగదారులకు రిఫండ్ చేయాలని ఆదేశించిన ఘటన ఇదే తొలిసారి.

2024-2025 కాలానికి ట్రూ అప్‌ ఛార్జీలను డిస్కమ్‌లు ( విద్యుత్ పంపిణీ సంస్థలు) వసూలు చేశాయి. ఈ చార్జీలపై ఈఆర్‌సీ విచారణ జరిపింది. అయితే డిస్కమ్‌ల లెక్కలు, విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో తేడాలు గుర్తించింది. 2024-25 సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలుగా డిస్కంలు ప్రతిపాదించిన రూ.2,758.76 కోట్లలో.. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అదనంగా వసూలు చేసిన రూ.923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
విద్యుత్ చార్జీల విషయంలో 2024-2025 సంవత్సరానికి డిస్కమ్ లు సుమారు 2,758.56 కోట్లను ప్రతిపాదించాయి. విద్యుత్ కొనుగోలు, వినియోగదారులు చెల్లించే ధరల మధ్య తేడాతో డిస్కమ్ లు నష్టపోతున్నాయని, అందుకు యూనిట్ కి 40 పైసల చొప్పున ట్రూఅప్ చార్జీలు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరాయి. ఈ అంశాన్ని పరిశీలించిన APERC సుమారు 1863 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
అయితే డిస్కంలు- SPDCL-1106 కోట్లు, APEPDCL-1060 కోట్లు, APCPDCL-614 కోట్లు వసూలు చేశాయి. ఈ మొత్తాలు ఏపీఇఆర్సీ ఇచ్చిన దానికన్నా సుమారు 924 కోట్లు ఎక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీఇఆర్సీ అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించింది. నవంబర్ నెల నుంచి ట్రూడౌన్ చేయాలని తేల్చిచెప్పింది.
ప్రజల పక్షాన నిలబడిన ఏపీఇఆర్సీ
1999లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) తన 25 ఏళ్ల చరిత్రలో ఇలాంటి తీర్పు ఇవ్వలేదు. వినియోగదారుల నుంచి డబ్బు గుంజడమే తప్ప తిరిగి ఇవ్వమని చెప్పిన పాపాన పోని ఏపీఇఆర్సీ ఈసారి ప్రజల పక్షాన నిలబడిందని సీపీఐ నాయకుడు, ఏఐటీయూసీ నాయకుడు ఆర్. రవీంద్రనాథ్ చెప్పారు. ఈ చార్జీలు పెంచేటపుడే వ్యతిరేకించామని, అయినా ఈ ప్రభుత్వం వినకుండా సర్దుబాటు పేరిట ధరలు పెంచి ప్రజలపై భారం మోపి ఇప్పుడు తగ్గించారని సీపీఎం నేత ఈశ్వరరావు అభిప్రాయపడ్డారు.
అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ట్రూఅప్ చార్జీలు వేసిన ప్రభుత్వమే ఇప్పుడు ట్రూ డౌన్ కూడా చేస్తోందని -ఏపీఇఆర్సీ ఇచ్చిన ఆదేశాలను- తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
చంద్రబాబు ఏమన్నారంటే..
సంస్కరణలు, వ్యవస్థల సమర్థ నిర్వహణతో ప్రజలకు మేలు జరుగుతుందనడానికి జీఎస్టీ సంస్కరణలు, తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు అంశాలే ప్రత్యక్ష ఉదాహరణలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో ఎప్పుడూ ట్రూ అప్‌ ప్రతిపాదనలే ఉండేవని.. కానీ తొలిసారి ట్రూ డౌన్‌ వచ్చేలా చేశామని అన్నారు. సమర్థత, అనుభవాలతోనే ఇది సాకారమైందని పేర్కొన్నారు. ‘వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నాశనం చేసింది. ఎక్కువ ధరకు కొనడంతో ప్రజలపై భారం పడింది. కూటమి ప్రభుత్వం రాగానే విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టాం. రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ అవసరాల్ని ముందుగానే సమీక్షించుకొని తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టాం. దీంతో దాదాపు రూ.వెయ్యి కోట్లు ఆదా అయ్యి ప్రజలపై భారం తగ్గింది’ అని వివరించారు.
విద్యుత్ శాఖ మంత్రి ఏమన్నారంటే..
ఇన్నాళ్లూ యూనిట్‌కు 40 పైసల చొప్పున వసూలు చేస్తున్న ఇంధన సర్దుబాటు ఛార్జీలను తగ్గించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. నవంబరు నెల నుంచి యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఛార్జీల భారం ఇంకా తగ్గుతుందని వివరించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచకుండా.. వీలైతే తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం 15 నెలల్లో నిలబెట్టుకుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఛార్జీలు మరింతగా తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ ఛార్జీల్లో రూ.923 కోట్లు ట్రూడౌన్‌ చేశామని చెప్పారు.
‘గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసి.. ఆ భారాలను ప్రజలపై మోపింది. ఐదేళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.18 వేల కోట్ల ట్రూఅప్‌ భారాలు వేసింది. విద్యుత్‌ సంస్థలను రూ.1.25 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పీపీఏలు రద్దు చేయడంతో ఆ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వాడుకోలేకపోయాం. అంతర్జాతీయ సమాజంలో తలదించుకుని రూ.9 వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెరగడంతో చిన్న పరిశ్రమలు, మెకానిక్‌ షెడ్లు, పిండి మిల్లుల వారు తీవ్రంగా దెబ్బతిన్నారని పేర్కొన్నారు. ‘2019లో మిగులు విద్యుత్‌తో ఉన్న రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసింది. రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన పరిస్థితి ఉన్నా.. రాజస్థాన్‌ నుంచి 7వేల మెగావాట్లు తీసుకునేందుకు ఒప్పందాన్ని అప్పట్లో కుదుర్చుకుంది’ అని తెలిపారు.
ఈ వాదనలు ఎలా ఉన్నా “APERC చరిత్రలో తొలిసారి స్వతంత్రంగా వ్యవహరించి, ప్రజల సొమ్ము తిరిగి ఇవ్వాలని డిస్కంలకు ఆదేశించింది. ఇది గొప్ప విషయమని” విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు కె.పూర్ణచంద్రరావు అభిప్రాయపడ్డారు. వినియోగదారులపై భారం పడకుండా చూడడమే సంస్కరణల లక్ష్యం కావాలి గాని అడ్డగోలుగా దోచుకోవడం కాకూడదని ఆయన అన్నారు.
Tags:    

Similar News