‘సృష్టి’ వ్యవహారంపై ఈడీ దృష్టి!
సరోగసీ పేరిట పిల్లలు లేని దంపతులను మోసం చేసి రూ.కోట్లు గడించిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండీ డాక్టర్ నమ్రత వ్యవహారాలపై ఈడీ దృష్టి సారించింది.;
కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ‘సృష్టి’ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ పచ్చిపాల నమ్రత అలియాస్ అత్తలూరి నమ్రత యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. సంతానం కోసం పరితపిస్తున్న దంపతులకు సరోగసీ ద్వారా సంతానయోగాన్ని కల్పిస్తానంటూ ఎవరికో పుట్టిన శిశువులను కొనుగోలు చేసి వారికి అమ్ముతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇటీవల రాజస్థాన్‌కు చెందిన దంపతులు గోవింద్‌సింగ్, సోనియాలు డాక్టర్ నమ్రత చేతిలో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సరోగసీ కుంభకోణం బయట పడింది. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపాక కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీలో ఆమె నుంచి కళ్లు బైర్లుగమ్మేలాంటి విషయాలను రాబట్టారు. గడచిన రెండేళ్లలోనే డాక్టర్ నమ్రత 80 మంది శిశువులను సరోగసీ ద్వారా విక్రయించినట్టు గుర్తించారు. రెండున్నర దశాబ్దాలుగా ఆమె ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతూ పిల్లలు పుట్టని దంపతుల నుంచి సరోగసీ పేరిట రూ.30–40 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసులు ఇప్పటికే తమ ప్రాధమిక విచారణలో తేల్చారు.
ఇలా ఈ పాతికేళ్లలో వందల సంఖ్యలో శిశు విక్రయాలు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 80 మంది శిశువుల విక్రయాల ద్వారా రూ.30 కోట్లు వసూలు చేసినట్టు అంచనాకొచ్చారు. దీనిని బట్టి అంతకు ముందు ఇరవయ్యేళ్లలో ఎన్ని కోట్లు వసూలు చేశారనే దానిపై పరిశోధన జరుగుతోంది. ఇంకా ఐవీఎఫ్‌ల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేశారు.
ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్టు అనుమానించిన ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా దృష్టి సారించింది. సృష్టి కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని హైదరాబాద్, సికింద్రాబాద్ గోపాల్‌పురం పోలీసులకు లేఖ రాసింది. సృష్టి ఎండీ డాక్టర్ నమ్రత తన అక్రమ సామ్రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఆరేడు రాష్ట్రాలకు విస్తరించడంతో ఈడీ రంగంలోకి దిగింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)