ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ కీలక నిర్ణయం
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్ణయంతో లిక్కర్ స్కాం నిందితుల్లో గుబులు మొదలైంది. ఏమి జరుగుతుందో దిక్కుతెలియడం లేదు.;
గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణం కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు 30 మంది కేసులో నిందితులుగా ఉండగా అందులో ఆరుగ్గురు అరెస్ట్ అయ్యారు. వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తున్నందున కేసు స్వరూపం మారుతూ వస్తోంది. మొత్తం 30 మంది కేసులో నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు ఇటీవల కె ధనుంజయ్ రెడ్డి (ఏ31), కృష్ణమోహన్ రెడ్డి (ఏ32), గోవిందప్ప బాలాజీ (ఏ33)లను నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన వారిలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి మాత్రమే. చివర్లో కేసు నమోదైన ముగ్గరు గత ప్రభుత్వంలో దిగ్గజాలు. వీరంతా వేల కోట్లు దోచుకుని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే నిర్ణయానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వచ్చింది. ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ. తనంతట తాను రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులకు లేఖ రాసి వివరాలు ఇవ్వాలని మనీ లాండరింగ్ కోణంలో తాము దర్యాప్తు చేస్తామని తెలిపింది. ఇది ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) లో కీలక పరిణామం.
ఈడీ లేఖలోని అంశాలు
కేసు వివరాల అభ్యర్థన: విజయవాడ పోలీసుల నుంచి మద్యం స్కామ్ కేసుకు సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR)తో పాటు పూర్తి వివరాలను అందించాలని ఈడీ కోరింది.
నిందితుల విచారణకు అనుమతి: కేసులో నిందితులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ విజయవాడ పోలీసులను అభ్యర్థించింది.
PMLA కింద కేసు నమోదు: మద్యం స్కామ్‌లో ఆర్థిక లావాదేవీలు మనీ లాండరింగ్‌కు సంబంధించినవని భావిస్తూ, PMLA కింద కేసు నమోదు చేసేందుకు ఈడీ సన్నద్ధమవుతోంది.
సిట్ చీఫ్, పోలీస్ కమిషనర్‌కు లేఖ: ఈ లేఖ సిట్ చీఫ్‌తో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు పంపబడింది. ఇది కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
కేసును ఈడీ తీసుకోవటానికి కారణాలు
మనీ లాండరింగ్: మద్యం స్కామ్‌లో భారీ ఆర్థిక లావాదేవీలు, అక్రమ నగదు బదిలీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ప్రధాన లక్ష్యం మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడం. కాబట్టి ఈ కేసు దాని అధికార పరిధిలోకి వస్తుంది.
కేంద్ర సంస్థల పాత్ర: ఈడీ ఒక కేంద్ర సంస్థ కాబట్టి, రాష్ట్ర స్థాయి దర్యాప్తు (SIT) కంటే విస్తృతమైన అధికారాలు, వనరులు ఉంటాయి. ఈ కేసు రాజకీయంగా సున్నితమైనది కావడంతో, కేంద్ర సంస్థ జోక్యం చేసుకోవడం ద్వారా దర్యాప్తు మరింత పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది.
రాజకీయ ఒత్తిడి: ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు ఆరోపణల్లో ఉండటం. దీనిని రాజకీయంగా వినియోగించుకునే అవకాశం ఉండటం వంటి అంశాలు ఈడీ రంగంలోకి రావడానికి కారణం కావచ్చు. ఈడీ జోక్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచవచ్చు.
అంతర్జాతీయ లావాదేవీలు: మద్యం స్కామ్‌లో అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీల ద్వారా నగదు బదిలీలు జరిగి ఉంటే, ఈడీ నైపుణ్యం, అధికారాలు ఈ లావాదేవీలను ఛేదించడానికి అవసరమవుతాయి.
లేఖ రాయడం వెనుక కారణాలు
స్వతంత్ర గుర్తింపు: ఈడీకి స్వతంత్రంగా కేసులను గుర్తించి, దర్యాప్తు ప్రారంభించే అధికారం ఉంది. మద్యం స్కామ్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకల గురించి ఈడీకి ముందస్తు సమాచారం అంది ఉండవచ్చు. దీని ఆధారంగా లేఖ రాసి ఉండొచ్చు.
సమాంతర దర్యాప్తు అవసరం: SIT దర్యాప్తు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నప్పటికీ, ఈడీ ఈ కేసులో సమాంతర దర్యాప్తు చేయాలని భావించి ఉండవచ్చు. ఇది కేసు విశ్వసనీయతను పెంచడంతో పాటు, ఆర్థిక లావాదేవీలను లోతుగా పరిశీలించేందుకు సహాయపడుతుంది.
సోషల్ మీడియా: సోషల్ మీడియాలో ఈ కేసు గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ కేసులో ఈడీ జోక్యం చేసుకోవడం ద్వారా దర్యాప్తు మరింత పటిష్ఠంగా జరుగుతుందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో అయి ఉండవచ్చు.