జగన్ కేసులో కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.;
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాల్మియా సిమెంట్‌కు సంబంధించిన రూ. 793 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జగన్ అక్రమాస్తుల కేసు తెరపైకొచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్ మీద కేసులు నమోదు చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్‌కు లీజుకు ఇచ్చింది.
అయితే ఈ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్‌మీద కేసులు నమోదు అయిన రోజుల్లోనే సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో 2013లో జగన్‌తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనులకు సంబందించిన లీజులను పొందినట్లు చార్జిషీట్ కూడా సీబీఐ దాఖలు చేసింది. ఈ లీజు వ్యవహారంలో దాదాపు రూ. 150 కోట్ల వరకు అక్రమంగా జగన్ లబ్ధి పొందినట్లు ఆ చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా రఘురామ్ సిమెంట్స్‌లో రూ. 95 కోట్ల విలువైన షేర్లు జగన్‌కు ఇవ్వడంతో పాటు రూ. 55 కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ జగన్‌కు ఇచ్చినట్లు సీబీఐ అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ. 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.