జనసేనకే గాజు గ్లాసు గుర్తు.. అవన్నీ అబద్దాలే..

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ గాజు గ్లాసు కోసం ఎంత పోరాటం జరిగిందో తెలుసా..

Update: 2024-04-29 10:20 GMT

ఆంధ్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అందుకు జనసేన పార్టీ గుర్తు కూడా ఒక కారణమే. తమకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేయాలని జనసేన అభ్యర్థిస్తుంటే దానిపై ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఉంది. ఇన్నాళ్లూ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌ జాబితాలోనే ఉంచింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం.. గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్‌గా కేటాయించిందని, జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కావాలంటే ఈ గుర్తును ఎన్నుకోవచ్చని ప్రచారాలు జరిగాయి.

అవన్నీ అబద్దాలే

అయితే గాజు గ్లాసును ఎన్నికల సంఘం కామన్ సింబల్‌గా ప్రకటించిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని జనసేన వర్గాలు తేల్చి చెప్పాయి. ఎన్నికల సంఘం వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కాకపోతే జనసేన కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తున్న నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీలు ఎన్నుకునే సౌలభ్యం కల్పించాలని తమ వినతి పత్రాలు అందాయని, కానీ గాజు గ్లాసును కేవలం జనసేనకే కేటాయిస్తూ తాము నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు.

ఫలించిన జనసేన యుద్ధం

గాజు గ్లాసు గుర్తును పొందాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతోంది. తొలుత ఈ గుర్తును ఫ్రీ సింబల్‌గా ప్రకటించిన ఈసీ తాజాగా ఈ గుర్తును జనసేనకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లూ జనసేన చేసిన యుద్ధం ఫలించింది. అయితే పోలింగ్ దగ్గర పడుతుండటంతో పార్టీ గుర్తు విషయంలో జనసేన తీవ్ర ఆందోళనకు గురైంది. ఇప్పుడు గుర్తు మారినా, తమ గుర్తుతో మరొకరు ఎన్నికల బరిలో నిలబడినా తమకు నష్టం వాటిల్లుతుందని జనసేన భావించింది. ఈ అంశాలను వివరిస్తూ పార్టీ పెద్దలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వారి అభ్యర్థనను మన్నించిన ఈసీ.. గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

న్యాయపోరాటం చేసిన జనసేన

గాజు గ్లాసును ఎన్నికల సంఘం ఫ్రీసింబల్‌గా ప్రకటించడంతో ఆ గుర్తును తమకు కేటాయించాలంటూ కొన్ని రిజిస్టర్డ్ పార్టీలతో సహా, కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసీని కోరారు. దీంతో గాజు గ్లాసు గుర్తు కోసం జనసేన పార్టీ న్యాయపోరాటం కూడా చేసింది. ఈ అంశంపై జనసేన.. హైకోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం.. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గాజు గ్లాసును మరే ఇతర అభ్యర్థికి లేదా పార్టీకి కేటాయించొద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం జనసేన పోటీ చేయని సీట్లలో కూడా గాజు గ్లాసు గుర్తును ఎవరికీ కేయించదని కోరుతూ జనసేన, టీడీపీ ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. వారి అభ్యర్థనను స్వీకరించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి.. ప్రతి జిల్లా కలెక్టర్‌కు కూడా గాజు గ్లాసును జనసేనకు తప్ప మరే ఇతర పార్టీకి కేటాయించొద్దని వివరించింది. అంతేకాకుండా గాజు గ్లాసును.. జనసేనకు కామన్ సింబల్‌గా గుర్తిస్తున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News