పులివెందులపై ఈసీ కొరడా..
రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-13 03:39 GMT
పులివెందుల నియోజకవర్గం లో ప్రధానంగా జెడ్పిటిసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
వైసిపి రాష్ట్ర నాయకులు ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పులివెందుల జడ్పిటిసి స్థానంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశించింది. దీంతో..
కడప జిల్లా పులివెందుల జడ్పిటిసి స్థానంలో రెండు చోట్ల రీపోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు బారులు తీరారు.
కడప జిల్లాలో పులివెందల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
అందులో,పులివెందుల జడ్పిటిసి పరిధిలో 10,601 మంది ఓటర్లు ఉన్నారు. వారికోసం గ్రామాల్లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పులివెందుల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన హేమంత్ రెడ్డి కూడా ఓటు వేసుకోలేని పరిస్థితి. "వందలాదిమంది మహిళలు కూడా ఓటుకు రానివ్వలేదు" అని మహేష్ రెడ్డి ఆరోపించారు. రీపోలింగ్ జరిపించాలని కూడా మహేష్ రెడ్డి ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు.
పులివెందులలో జరిగిన పరిణామాలపై వైసిపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
"ఈ రెండు కేంద్రాలలో అధికార టిడిపి నాయకులు అక్రమాలకు పాల్పడింది. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఏకపక్షంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు" అని వైసిపి రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు తదితరుల నాయకత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నేకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఫోటోలు ఇతర ఆధారాలను కూడా వారు ఎన్నికల కమిషనర్ కు అందించారు.
కడప జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తేప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పులివెందుల జడ్పిటిసి పరిధిలోని మూడు, 14 కేంద్రాల్లో రీపోలింగ్ ఆదేశించారు.
బారులు తీరిన ఓటర్లు
పులివెందుల లోని అచ్చివెళ్లి, ఈ కొత్తపల్లి కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్ కోసం ఈ కొత్తపల్లి రీపోలింగ్ కేంద్రానికి నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ మెటీరియల్ అందినట్లు సమాచారం తెలిసింది. కొంతసేపటి వరకు ఏజెంట్లు కూడా లోపలికి అనుమతించలేదని తెలిసింది.
ఈ కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో 1273 మంది ఓటర్లు ఉన్నారు.
అచ్చి వెళ్లి పోలింగ్ కేంద్రం పరిధిలో 492 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో తమను మంగళవారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు అని ఓటర్లు ఆరోపించారు.
పట్టు సాధించిన వైసిపి
పులివెందుల జెడ్పిటిసి పరిధిలో కూడా వైసిపి మద్దతుదారులను ఓట్లు వేయనివ్వలేదని ఆ పార్టీ నాయకులు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
"కేంద్రాల్లో తమ పార్టీ మద్దతు ధరించి ఓటరు చీటీలు కూడా టిడిపి నాయకులు లాగేసుకున్నారు. మా వారి ఓట్లు కూడా టిడిపి వారే వేసేసారు" అని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో అన్ని వివరాలు తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహిని పులివెందులలో 14వ పోలింగ్ కేంద్రం ఈ కొత్తపల్లిలోని 1273 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకునేందుకు రీపోలింగ్ ఆదేశించారు. అలాగే, మూడవ నెంబర్ పోలింగ్ కేంద్రం అచ్చివెళ్లిలో కూడా రీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు పోలింగ్ కేంద్రాల వద్ద ఒకపక్క వైసీపీ, టిడిపి నాయకులు మోహరించారు.