అమరావతి రుణం మీద బాబుకి ఇఎఎస్ శర్మ 2 సూచనలు

అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రుణం స్వీకరిస్తున్నపుడు ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి.

By :  Admin
Update: 2024-07-25 06:47 GMT



రెండు రోజుల క్రింద, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ అమరావతి రాజధాని ప్రాజెక్టు కోసం, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి, రాష్ట్రానికి Rs 15,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందిస్తామని పార్లమెంటులో ప్రకటించడం పట్ల మాజీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డా. ఇఎఎస్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. . ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. అయితే,  ఈ రుణం స్వీకరించేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. లేఖ లోని అంశాలు యధాతథంగా:

గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ( Board of Governors )లో భారతదేశం తరఫున గవర్నర్ గా, ఉన్న నా అనుభవం ఆధారంగా, ఈ క్రింద సూచించిన విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ రుణాన్ని స్వీకరించే ముందు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి ముందస్తు ఈ హామీలు తీసుకోవాలి

  1. ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల కన్సార్షియమ్ రాష్ట్రానికి ఇచ్చే నిధులు, రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ Finance ద్వారా వచ్చే నిధులకు అదనంగా కేంద్రం విడుదల చేయాలి
  2. ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల నుంచి వచ్చే నిధులు డాలర్ రూపంలో ఉంటాయి. డాలర్ -రుపాయి, మారకం ధర పెరగడం వలన ముందుముందు ఈ రుణభారం అధికంగా పెరిగే అవకాశం ఉంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు, భవిష్యత్ లో రుణభారం ఎంతవరకు పెరగ గలదో అంచనాలు వేసి, ఆ భారాన్ని తగ్గించేందుకు, కేంద్రం ఇప్పించే రు 15,000 కోట్లలో, ఎంత గ్రాంట్ గా ఇవ్వాలి, ఎంత రుణంగా ఇవ్వాలి అనే విషయం మీద కేంద్రంతో చర్చించాలి. రాష్ట్రానికి ఇవ్వవలసిన గ్రాంట్ వాటా మీద ముందస్తు హామీ తీసుకోవాలి.

ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణాలు, పర్యావరణ దృష్ట్యా షరతులతో ముడిపడివుంటాయి. గతంలో అదే ప్రపంచ బ్యాంక్, ఇతర సంస్థలు, అమరావతి ప్రాజెక్టు కు కావలసిన నిధుల మీద ఒక విపులమైన ప్రణాళిక ను తయారు చేసి అప్పటి మీ ప్రభుత్వంతో చర్చలు చేయడం, ఆ ప్రాంతంలో కొంతమంది నిర్వాసితులు చేసిన ఫిర్యాదులకు స్పందించి బ్యాంకు వారు ఆ ఫిర్యాదులను పరిశీలించే టీమ్ (Inspection Team) ను నియమించడం, ఆ టీమ్ ఫిర్యాదు చేసిన వ్యక్తులను, ప్రాంత ప్రజలను కలిసి, వారి అభిప్రాయాలను సేకరించి, బ్యాంక్ ఉన్నతస్థాయిలో వారి రిపోర్ట్ ఇవ్వడం, మీకు గుర్తు చేస్తున్నాను. ఆ టీమ్ రిపోర్ట్ ప్రభుత్వం వద్ద ఉండవచ్చు. ఆ రిపోర్టులో ప్రస్తావించిన విషయాలకు అనుగుణంగా, మీ ప్రభుత్వం బ్యాంకు కు కొత్త ప్రాజెక్టు ప్రణాళిక ను ఇస్తే, ప్రాజెక్టు కు అనుమతులు రావడం సులభం అయ్యే అవకాశం ఉంది.

అదే కాకుండా, అమరావతి ప్రణాళిక మీద, జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) వారు OA No 171/2017 లో 2017 నవంబర్ లో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం గురించి ప్రపంచ బ్యాంకు వారు ప్రశ్నించే అవకాశం ఉంది.NGT వారు, అమరావతి ప్రాజెక్టు అమలు సందర్భంలో, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను పాటించాలని, ఆ విషయం మీద పర్యవేక్షణ కోసం, క్రింద సూచించిన సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించాలని, ఆ కమిటీ వారు ప్రతి ఆరు నెలలకు NGT వారికి రిపోర్టులు పంపించాలని ఆదేశించారు.

  1. Director, National Institute అఫ్ Hydrology, Roorkee
  2. A senior scientist nominated by Indian Institute of Science (IISc)
  3. Prof N J Pawar, Savitribai Phule University (Pune)

రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు అటువంటి కమిటీ ని నియమించక పోవడం NGT ఆదేశాలను ఉల్లంఘించడం అయింది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా అటువంటి పర్యవేక్షణ కమిటీ ని నియమించడం అవసరం. ఈ దిశలో రాష్ట్రప్రభుత్వం అమరావతి ప్రాజెక్టు విషయంలో ముందుకు పోగలదని ఆశిస్తున్నాను.


Tags:    

Similar News