అమరావతిలో వెలుతురు రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో చీకటి కారాదు...

మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డా ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ.

Update: 2024-12-22 11:54 GMT

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,

అమరావతి రాజధాని పేరుతో, మీ ప్రభుత్వం, ఒక్క గుంటూరు జిల్లాలోనే, 50-60,000 కోట్ల రూపాయల ఖర్చు, వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలలో చేస్తారని ప్రకటనలు చేయడం జరుగుతున్నది. అందుకు కావాల్సిన నిధులు ప్రపంచబ్యాంక్, ADB, ఇతరులు ఇస్తున్నారని కూడా, మీ ప్రభుత్వం ప్రకటించింది.

ఆ సంస్థలు ఎంత నిధులు సమకూర్చినా, అటువంటి రుణాలు US డాలర్ల రూపంలో ఉండటం కారణంగా, రుణ భారం అధికంగా ఉంటుంది. ఆ అప్పును భవిష్యత్తులో తీర్చే భారం, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రజల మీద పడుతుందని మీ ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రానికి ఏటా వచ్చే ఆదాయంలో, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల వద్ద నుంచి వసూలు చేసే టాక్సులపాత్ర ఎంతైనా ఉంది. అందుకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి కావలసిన నిధులను కేటాయించే బాధ్యత మీ ప్రభుత్వానికి ఉందని గుర్తించాలి.
అంత పెద్ద ఖర్చుతో కూడిన అమరావతి రాజధాని ప్రాజెక్టు వలన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఎంత లాభం కలగగలదో తెలియదు కాని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిధుల నుంచి, 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు తరలించి, మూడు, నాలుగు సంవత్సరాల పరిమితిలో, ఒకే జిల్లాలో ఖర్చు చేయడం కారణంగా, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను, మీ భాగస్వాములైన NDA కూటమి ప్రభుత్వం ప్రైవేటు పాలు చేస్తుంటే, ఆ ప్రైవేటీకరణను ఆపి, వైజాగ్ స్టీల్ ను పునరుద్ధరించే బదులు, మీ ప్రభుత్వం అనకాపల్లి దగ్గరలో, ప్రైవేటు కంపెనీ అయిన Arcelor-Mittal స్టీల్ ప్లాంట్ ను స్థాపిస్తున్నాము అనడం, ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఉదాసీనతకు నిదర్శనం. అటువంటి ప్రైవేట్ ప్లాంట్ లో స్థానిక ప్రజల కన్నా, ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. SC/ST/OBC లకు రిజర్వేషన్లు లేకపోవడం వలన, అన్యాయం జరుగుతుంది. అదే కాకుండా, మీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల ప్రకారం, వేలాది ఎకరాల ప్రజల భూములను, చట్టవిరుద్ధమైన Land Pooling Scheme (LPS) ను అమలు చేసి, చట్టపరమైన వారి హక్కులకు భంగం కలిగిస్తూ, ప్రైవేట్ కంపెనీ కోసం తీసుకునే అవకాశం ఉంది.
మీ ముందున్న ప్రభుత్వం కూడా, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను ఆపకుండా, ఒక ప్రైవేటు కంపెనీకి కడప దగ్గర స్టీల్ ప్లాంటును పెట్టేందుకు అనుమతులు ఇవ్వడం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ విషయంలో ముందున్న ప్రభుత్వ వైఖరికి, మీ ప్రభుత్వ వైఖరికి తేడా కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో, మీ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులు తీసుకువస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారు.
మీ ముందున్న ప్రభుత్వం,అదానీ కంపెనీకి చట్టవిరుద్ధంగా Pumped Storage Project లను ఆదివాసీ ప్రాంతాల్లో నిర్మించడానికి, విచ్చలవిడిగా, చట్ట విరుద్ధంగా, అనుమతులు ఇవ్వడం వలన, ఆదివాసీలకు అపారమైన హాని కలిగించింది. ఆ అనుమతులు రద్దు చేయాలని మీకు ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసినా, మీ ప్రభుత్వం ఈరోజు వరకు చలించక పోవడమే కాకుండా, అదానీ సోలార్ కుంభకోణం నేపథ్యంలో, ఆ కంపెనీతో చేసిన ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయలేదు.
అదానీ కంపెనీకి ముందున్న ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువ ఉన్న, వందకు పైన ఎకరాల భూమిని, విశాఖలో డేటా సెంటర్ ముసుగులో చట్టవిరుద్ధంగా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వం ఈరోజు వరకు ఆ భూమిని వెనక్కి తీసుకోలేదు.
ఇదీ ప్రైవేటు పెట్టుబడుల పరిస్థితి!
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కావాల్సింది, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రజల సౌకర్యం కోసం, ప్రభుత్వ పెట్టుబడులు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ పథకాలు, సాగునీటి సౌకర్యాలు.
ఉదాహరణకు, ఉత్తరాంధ్ర లో అతి వెనుకబడిన పలాస, ఇచ్చాపురం వంటి ప్రాంతాలకు కావల్సినది, వంశధార మీద ట్రిబ్యునల్ ఆమోదించిన "నేరేడు" ప్రాజెక్టు ను చేపట్టడం. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, మన రాష్ట్రం తరఫున సుప్రీం కోర్టులో వాదనలు ఆలస్యం అయి, కేసు పరిష్కారం జరగడం లేదు. మీరు NDA లో భాగం అయిన ఒరిస్సా ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో విజ్ఞప్తి చేసి ఉంటే, ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగి ఉండేది. ఆ విషయంలో ఆలస్యం కారణంగా, ఉత్తర శ్రీకాకుళం మండలాలలో, రావలసిన 23.6 టీఎంసీల తాగునీరు లభించడం లేదు. ఆ నీరు లభించివుంటే, లక్షలాది ఎకరాల భూములలో పంటలు పండించి, ఆ ప్రాంత ప్రజలు సర్వతోముఖంగా అభివృద్ధి పొందేవారు.
అదే కాకుండా, వంశధార బహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టు ఆరేళ్లుగా ప్రభుత్వం ముందు ఉన్నా, ముందుకు రావడం లేదు. ఆ నీరు లభించి ఉంటే, వేలాది ఎకరాలకు సాగునీరు లభించి ఉండేది. మీ ప్రభుత్వం రాగానే, ఆ ప్రాజెక్టు చేపడతారని, ఆ ప్రాంత ప్రజలు ఆశించారు కాని నిరాశ పొందారు.
అదే వెనుకబడిన ఉత్తర శ్రీకాకుళం మండలాల్లో, 6,589 మైనర్ సాగునీటి ప్రాజెక్టులు, 1,800 చెరువులు, ఐదేళ్లుగా మైంటెనెన్సు కు నిధులు లేక, వాటి కింద ఉన్న 2,60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరిగ్గా లభించడం లేదు. ఆ విషయంలో, మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా?
రాష్ట్రంలో SC/ST/OBC హాస్టళ్లకు నిధులు లేక, వారి బిల్డింగ్ లు శిధిలావస్థ లో ఉన్నాయని గుర్తించాలి.
ASR, పార్వతీపురం మన్య ప్రాంతాలలో, ఎన్నో ఆదివాసీ గ్రామాల్లో, తాగే నీటి సౌకర్యాలు, పాఠశాల బిల్డింగ్ లు, టీచర్లు, తగిన ఆరోగ్య సౌకర్యాలు, ఎలక్ట్రిసిటీ లేక, అక్కడి ప్రజల అభివృద్ధికి నష్టం కలుగుతున్నది. అందుకు కావలసిన నిధుల కు సంబంధించిన ప్రతిపాదనలు, మీ అమరావతి రాజధాని ఎయిర్ కండిషన్డ్ సెక్రటేరియట్ లో కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. అటువంటి ప్రణాలికల మీద మీ ప్రభుత్వం ఎందువలన చర్యలు తీసుకోవడం లేదు?
ASR జిల్లా అనంతగిరి మండలంలో మారుమూల గ్రామం బూరుగ ఆదివాసీలు, ఏళ్ల తరబడి ఎలక్ట్రిసిటీ లేక బాధపడుతూ, ఎట్టకేలకు ప్రయత్నం చేసి గ్రామంలో ఐదు సోలార్ వీధి దీపాలు పట్టుకోగలిగారు (కింద చూపించిన ఫోటో). అదే సౌకర్యం, అదానీ కంపెనీ వెనకబడే బదులు, ప్రభుత్వం ఆదివాసీ గ్రామాల్లో ఎందుకు కలిగించడం లేదు. 

ఆశ్చర్యమైన విషయమేమంటే, అదే ఆదివాసీ ప్రాంతాల్లో, రాష్ట్ర ప్రభుత్వ నేతలు మైనింగ్ మాఫియాకు పీసా, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ, లైసెన్సులు మాత్రం చాలా వేగంగా ఇస్తున్నారు.

 ఈ రోజు వరకు, రాజ్యాంగం 5వ షెడ్యూల్ కు అనుగుణంగా నియమించాల్సిన ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, మన రాష్ట్రంలో నియమించబడలేదు. గిరిజనాభివృద్ధి మీద ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనతకు ఇది ఒక ఉదాహరణ.

పోలవరం ప్రాజెక్టు క్రింద లక్షలాదిమంది ఆదివాసీలు భూములు, ఉపాధులు పోగొట్టుకున్నారు. వారు నిర్వాసితులై, రాజ్యాంగం 5వ షెడ్యూల్ కింద పొందవలసిన హక్కులు నష్టపోయారు. చాలామంది నిర్వాసితులకు సరైన నష్టపరిహారం లభించలేదు. పోలవరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున దృష్టిసారించిన మీ ప్రభుత్వం, ఆ నిర్వాసితులైన ఆదివాసీ కుటుంబాల సంక్షేమం గురించి ఎందుకు ఆలోచించడం లేదు.

రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితుల కారణంగా వేలాది మంది ఉపాధుల కోసం గల్ఫ్ దేశాలకు వలస పోయి కష్టనష్టాలకు గురి అవుతున్న విషయం మీ ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? రాయలసీమ ప్రజల సంక్షేమ కార్యక్రమాల మీద, మీ ప్రభుత్వం ఎంతవరకు కృషి చేస్తున్నది? ఎంత వరకు ప్రభుత్వ పెట్టుబడులు చేసింది అనే విషయాలమీద, అక్కడి ప్రజల ముందు వివరాలు ఉంచాలని నా విజ్ఞప్తి.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి విషయంలో, నేను కేంద్ర ఆర్థిక మంత్రి గారికి 27-8-2024 ఒక లేఖ రాశాను. కాని మీ ప్రభుత్వం కేంద్రంతో ఈ రోజు వరకు నేను లెేవనెత్తిన విషయం చర్చించలేదని తెలుస్తున్నది. అది ఆ ప్రాంత ప్రజలకు బాధ కలిగించింది.

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టం (2014) లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి విషయంలో 46వ సెక్షన్ ఈక్రింది విధంగా ఉందని మీరు గుర్తించాలి

"Section 46(2) Notwithstanding anything in sub-section (1), the Central Government may, having regard to the resources available to the successor State of Andhra Pradesh, make appropriate grants and also ensure that adequate benefits and incentives in the form of special development package are given to the backward areas of that State.

(3)The Central Government shall, while considering the special development package for the successor State of Andhra Pradesh, provide adequate incentives, in particular for Rayalaseema and north coastal regions of that State"

అంటే, 2014 చట్టం కింద నిధులు లభించి, అభివృద్ధి పొందే హక్కు ఆప్రాంతాల ప్రజలకు ఉంది ఆ విషయంలో మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని నా విజ్ఞప్తి.

అమరావతి రాజధాని విషయంలో, అత్యధికంగా బిల్డింగ్ ల హంగుల మీద ప్రజల నిధులను ఖర్చు చేసే బదులు, ప్రభుత్వ విధానాలలో వికేంద్రీకరణ, ప్రజల గడప వరకు ప్రభుత్వాన్ని తీసుకు రావడం, ప్రజాస్వామ్య విధానాలను పాటించడం అవసరం.

రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు, ఆదివాసీ ప్రజలకు న్యాయం జరగకపోతే రాజధాని ఎంత సొబబుగా ఉన్నా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు హర్షించరని మీరు గుర్తించాలి.





Tags:    

Similar News