మందుబాబులకు దసరా కానుక

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం దసరా కానుకగా మద్యం అమ్మకాలు ప్రారంభించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేట్ వ్యక్తులు అమ్మకాలు చేపడతారు.

Update: 2024-10-01 05:55 GMT

ఏపీలో ప్రైవేట్‌ దుకాణాల్లో మద్యం అమ్మకాలు ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. దసరా కానుకగా మద్యం అమ్మకాలు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి సంబంధించిన నోటిపికేషన్‌ను ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. నూతన మద్యం విధానం ప్రకారం ప్రైవేట్‌ వారికి అప్పగిస్తారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి అక్టోబరు 1నుంచి అవకాశం కల్పించారు. ఈనెల 9వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఆ తరువాత లాటరీ తీసి ఎంపికైన వారి వివరాలు ప్రకటిస్తారు. 11వ తేదీకి ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

దసరా నుంచి కొత్త షాపులు
కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షాపులు ఈనెల 12 నుంచి ప్రారంభమవుతాయి. మద్యం అమ్మకాలను ప్రైవేట్‌ వ్యక్తులు రన్‌ చేస్తారు. లాటరీలో షాపులు దక్కించుకున్న వారు దుకాణాల్లో అమ్మకాలు చేపడతారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న షాపులు అన్నీ అద్దెలకు తీసుకున్న రూములే. ఈ రూముల్లోనే కొత్తగా మద్యం అమ్మకాలు ఆయా రూముల ఓనర్లతో మాట్లాడుకుని షాపులు దక్కించుకున్న వారు మొదలు పెడతారా? లేక వారు సొంతగా రూములు అద్దెలకు తీసుకుంటారా? లేక వారి సొంత భవనాలు ఉంటే వాటెల్లో ప్రారంభిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని షాపులకు ప్రభుత్వం ఎక్కువ అద్దెలు చెల్లిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి షాపుల్లో కొత్తగా వచ్చిన వారు అదే షాపును అద్దెకు తీసుకుని కొనసాగించే అవకాశాలు లేవు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే వ్యవహారం ప్రైవేట్‌ వారిలో ఎక్కువగా ఉంటుంది.
12 నగరాల్లో ప్రీమియం స్టోర్లు
గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినట్లుగానే ప్రీమియం స్టోర్లు 12 నగరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో అనుమతులు ఇచ్చింది. ఈ స్టోర్లకు దరఖాస్తులు చేసుకునే వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఆ వివరాలు ఎక్సైజ్‌ శాఖ వారు ప్రత్యేకంగా తెలియజేస్తారు. ఈ స్టోర్లలో నేరుగా మద్యం కొనుగోలు దారులు సూపర్‌ మార్కెట్లో సరుకులు కొన్న విధంగా వెళ్లి తమకు కావాల్సిన బ్రాండ్స్‌ చూసి పరిశీలించి కొనుగోలు చేయొచ్చు. అన్ని రకాల బ్రాండ్స్‌ ఉంటాయని, విదేశీ మద్యం కూడా అందుబాటులో షాపుల్లో దొరుకుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మద్యం దుకాణా దారులు వారికి నచ్చిన బ్రాండ్స్‌ కొనుగోలు చేసేందుకు షాపుల్లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది.
ఏరియాలను బట్టి డిపాజిట్లు
గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విభజించి డిపాజిట్లు ప్రభుత్వం తీసుకుంటోంది. మినిమం రూ. 50 లక్షల నుంచి డిపాజిట్‌ ప్రారంభమవుతుంది. అత్యధికంగా రూ. 85 లక్షల వరకు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తి ఎన్ని షాపులకైనా డిపాజిట్లు చెల్లించవచ్చు.
మొత్తం 3,396 దుకాణాలు
సోమవారంతో ఇప్పటి వరకు కొనసాగిన మద్యం దుకాణాల లైసెన్స్‌ రద్దయింది. అంటే మంగళవారం నుంచి మద్యం దుకాణాల్లో మద్యం అమ్మినా అనాథరైజ్‌డ్‌గా అమ్మినట్లే. దుకాణాల లైసెన్స్‌లు పునరుద్దరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే కొత్తగా ప్రైవేట్‌ వారికి అప్పగించేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచే ప్రక్రియ ప్రారంభమైనందున దుకాణాలు కొనసాగే అవకాశం ఉందనేది ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌ వారు చెబుతున్నారు. ఇకపై దుకాణాల వద్ద క్యూలైన్లు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే లిబరల్‌గా అన్ని బ్రాండ్స్‌ అందుబాటులో ఉంటాయి. పైగా ఎప్పుడైనా మద్యం కొనుగోలు చేసే వారు ఎక్కడంటే అక్కడ కొనుగోలు చేయవచ్చు. విజయవాడ నగరంలో ప్రీమియం స్టోర్స్‌ ఉంటాయి కాబట్టి ఫుల్‌ బాటిల్స్‌ కొనుగోలు చేసేవారంతా మాల్స్‌కు వెళతారు. విజయవాడలో ఎన్ని మాల్స్‌ ఏర్పాటు చేస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. విశాఖపట్నంలో కూడా రెండు మాల్స్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తిరుపతిలో కొంత మేర మద్యం వ్యాపారాన్ని తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలిపిరి రోడ్డులో షాపులు పెట్టకుండా చర్యలు తీసుకున్నది.
మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏమిటి?
ఇప్పటి వరకు మద్యం దుకాణాల్లో వివిధ కేటగిరీలో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. వారిని గత ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన తీసుకుంది. నూతన ప్రభుత్వం వారిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. కనీసం ప్రస్తుతం ఉన్న 29 డిపోల్లోనైనా కొందరికి అవకాశం కల్పిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గత నెల 7వ తేదీన విధులు బహిష్కరిస్తున్నామని మద్యం షాపుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రకటించడంతో అప్పట్లో ప్రభుత్వం వారికి నచ్చజెప్పి విధుల బహిష్కరణకు పోకుండా చర్యలు తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ వెలువడంతో తమకు అవకాశం లేదని భావించిన మద్యం షాపుల్లో పనిచేసే ఉద్యోగులు మంగళవారం నుంచి విధులు బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఉదయం 11 గంటలలోపు ఉద్యోగుల గురించి ఏ విషయం తేల్చకుంటే విధులు బహిష్కరిస్తామని వారు ప్రకటించారు.
షాపుల వద్దే ఉంటాం...
కచ్చితంగా షాపులు తెరవాల్సిందేనని ఎక్సైజ్‌ శాఖ వారు ఉద్యోగులపై వత్తిడి పెంచారు. సోమవారం నుంచి ఎకైజ్‌ శాఖ కమిషనర్‌ నిశాంత్‌ కుమార్‌తో చర్చలు జరుగుతున్నా ఒక కొలిక్కి రాలేదు. మంగళ వారం నుంచి విధులు నిర్వహించాలంటే మాకు ప్రభుత్వం నుంచి రాత పూర్వక హామీ ఇవ్వాలని, లేకుంటే విధులు బహిష్కరించి షాపుల వద్దే హామీ వచ్చే వరకు ఉంటామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పాశల రామచంద్రరావు తెలిపారు.
మూడు విధాలుగా దరఖాస్తులు
దరఖాస్తులు మూడు విధాలుగా సమర్పించొచ్చని ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో డెబిట్, క్రెడిట్‌ కార్డుల నుండి పేమెంట్‌ ఒక విధానం కాగా, బ్యాంకు చలానాల ద్వారా రెండో విధాన మన్నారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్‌ స్టేషన్‌ ద్వారా అప్లికేషన్‌ పొందవచ్చని కార్యదర్శి మీనా తెలిపారు. ఈ పాలసీ 2026 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుంది. అయితే నాన్‌ రీఫండబుల్‌ రుసుం కింద ఒక్కో దానికి రూ. 2లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ ద్వారా లైసెన్సులను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. అక్టోబర్‌ 11న ఈ లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు. తర్వాత రోజు అంటే అక్టోబరు 12 నుంచి లైసెన్సులు పొందిన వ్యక్తులు కొత్త దుకాణాలను ప్రారంభించుకోవచ్చు.
Tags:    

Similar News