ముగిసిన దసరా ఉత్సవాలు.. విజయవాడ పోలీస్ స్టేషన్‌లో చండీ హోమం
దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.
Byline : Vijayakumar Garika
Update: 2024-10-14 14:05 GMT
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో చండీ హోమం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం వీటిని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఆ పద్ధతులను పురస్కరించుకుని పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. అనంతరం దసరా ముగింపు కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్‌వి రాజశేఖరబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వేద పండితులు నిర్వహించిన హోమంనందు పూర్ణాహుతిని సమర్పించి, దసరా మహోత్సవాలకు ముగింపు పలకారు. ఈ కార్యక్రమములో పోలీస్ కమీషనర్ స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు. అనంతరం ఆలయ కమాండ్ కంట్రోల్ వద్దకు వెళ్లి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ ఏడాది 6000 మంది వరకూ పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. దాదాపు 15 లక్షల వరకూ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు బాగా పనిచేసారని అన్నారు. నవరాత్రులకు సహకరించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ గౌతమి షాలీ, దేవాలయ ఈవో కేఎస్ రామారావు, ఏడీసీపీలు, ఏసీపీలు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గురుప్రకాష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.