సమర్థమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. అందుకు కూటమి ప్రభుత్వ పాలనే నిలువెత్తు నిదర్శనమ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, హామీలకు కార్యరూపం ఇస్తూ ప్రజలందరికీ అండగా నిలుస్తున్నట్టు తెలిపారు. స్త్రీ శక్తి పథకంతో ఇబ్బందిపడుతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో భరోసా నింపేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు వింటూ ఎల్లప్పుడూ వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ , ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్‌తో కలసి ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండవల్లి లోటస్ పాయింట్ నుంచి విజయవాడ సింగ్ నగర్ వరకు జి రాజేష్ అనే ఆటో డ్రైవర్ కి చెందిన ఆటోలో అతని కుటుంబ సభ్యులతో కలసి ప్రయాణించారు.
అనంతరం సభలో ఆయన పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ..
కూటమి ప్రభుత్వం ప్రతి వర్గానికి అండగా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సందర్భాల్లో ఆటో డ్రైవర్లను కలిసినప్పుడు గ్రీన్ టాక్స్ తో పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మత్తులు చేశాం. అవసరం ఉన్న చోట కొత్త రోడ్లు నిర్మించామని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇచ్చిన మాట నిలుపుకొన్నాము
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల ఇబ్బందుల గురించీ ముందుగా ప్రస్తావించాం. స్త్రీ శక్తి పథకం వారి ఉపాధిని దెబ్బ తీసే అవకాశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని ముఖ్యమంత్రి మాటిచ్చారు. ఆ ప్రకారం ఈ రోజున ఆటో డ్రైవర్ల అందరి ఖాతాల్లో రూ. 15 వేలు చొప్పున జమ చేశామన్నారు. కష్టాల్లో మీకు వెన్నుదన్నుగా నిలవాలని కూటమి ప్రభుత్వ ఉద్దేశం. ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఆటో డ్రైవర్లందరి తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎన్నికల ముందు పిఠాపురం పర్యటనలో ఉండగా నేను ఆటోలో ప్రయాణించిన సందర్భంలో ఆ ఆటో డ్రైవర్ ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందులను, వారి సమస్యలను నాకు వివరించారు. ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకంతో మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అర్హులైన 2 లక్షల 90 వేల 234 మందికి ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. మీ అందరి కోసం కూటమి ప్రభుత్వం రూ. 436 కోట్ల భారాన్ని ఆనందంగా మోస్తుంది. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి, వారి జీవనోపాధి కాపాడటం బాధ్యతగా భావిస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భవిష్యత్తులోనూ ఆటో డ్రైవర్ సోదరులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాను‘ అని పవన్ కల్యాణ్ అన్నారు.