సీమలో కరువు బెంగ.. కోస్తాలో తుపానుల బెడద!

22 ఏళ్ల పరిస్థితిని ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అనంతపురం జిల్లాలో కరువు, శ్రీకాకుళం జిల్లాపై తుపానుల ప్రభావం అధికంగా ఉన్నట్టు తేల్చారు.;

Update: 2025-06-07 02:00 GMT
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సం

కరువు కోరల్లో రాయలసీమ చిక్కుకుంటుంటే.. తుపాన్లు, వరదల్లో కోస్తాంధ్ర కొట్టుమిట్టాడుతోంది. ఒక ప్రాంతం వానల్లేక పంటలు పండకుండా పోతుంటే.. మరో ప్రాంతం అధిక వర్షాలు, పెనుగాలులతో కకావికలమవుతోంది. ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ రెండు ప్రాంతాలూ తరచూ ప్రకృతి ప్రకోపానికి గురవుతూనే ఉన్నాయి. గడచిన 22 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆ విషయాలేమిటంటే?

అనంతపురంలో వర్షాల్లేక ఎండిన పంటలు 

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు బీ సహదేవరెడ్డి, పీవీ రమేష్‌బాబు, పీ రాధిక, సీహెచ్‌ శ్రీనివాస్‌లు రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలపై పరిశోధనలు సాగించారు. 2002 నుంచి 2024 వరకు 22 ఏళ్ల పాటు జరిపిన వీరి అధ్యయనంలో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు, ఏ జిల్లాలు ఎలాంటి ప్రభావంలో ఉన్నాయి? వంటి అంశాలపై వీరి అధ్యయనం సాగింది. ఈ 22 ఏళ్లలో రాయలసీమలో ఎక్కువ కరువు ప్రభావం చూపిందని, ఖరీఫ్‌ సీజనులో 15 సంవత్సరాలు కరువుందని, ఏడేళ్లు కరువు లేదని పేర్కొంది. వీరి అధ్యయనంలో ఖరీఫ్‌లో కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు 17 ఏళ్లు, కర్నూలు 16, ప్రకాశం 14, నెల్లూరు 12, విజయనగరం 11, శ్రీకాకుళం, గుంటూరు 10, విశాఖపట్నం 7, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఆరేళ్ల చొప్పున కరువు బారినపడ్డాయి. ఇక రబీ సీజనులో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే కరువు ఏర్పడినట్టు గుర్తించారు. రబీలో మొత్తం 13 (ఉమ్మడి) జిల్లాల్లో 2018–19లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా 10 జిల్లాలు, 2017–18లో ఐదు జిల్లాలు అంటే విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలు కరువుకు గురయ్యాయి. వీటిలో అనంతపురం 9, ప్రకాశం 5, కర్నూలు, కడప 3 సంవత్సరాలు మొత్తం జిల్లాలు కరువుకు లోనయ్యాయి. అనంతపురం జిల్లాలో 1.0 వద్ద అధిక కరువు ముప్పు సూచిక ఉంది. ఆ తరువాత చిత్తూరు 0.96, కడప 0.71, ప్రకాశం 0.70, కర్నూలు 0.67 వద్ద ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సం 

ఏపీ ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 44 శాతం ఉష్ణమండల తుపానులు, సంబంధిత ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ 22 సంవత్సరాల్లో శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు 10–11 సంవత్సరాలు తుపానులను ప్రభావితం చేశాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 నుంచి 6 ఏళ్లు తుపానులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం ఎక్కువగా తుపానులకు గురవుతోంది. ఫలితంగా ఈశాన్య రుతుపవనాల సమయంలో చాలా తుపానులు రాష్ట్రాన్ని దాటతాయని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అధ్యయనం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ ఒక దుర్భలమైన తీరప్రాంతం కావడంతో గత 22 ఏళ్లలో 11 తుపానులను, ఐదు వాయుగుండాలను ఎదుర్కొంది. 2007, 2008, 2010, 2013, 2018 సంవత్సరాల్లో ఐదు వాయుగుండాలు నమోదయ్యాయి. అయితే 2006, 2018ల్లో రెండు తుపానులు సంభవించాయి. 2010, 2013, 2014, 2020లో నాలుగు తీవ్రమైన తుపానులు ఏర్పడ్డాయి.
ఏపీలో 60 శాతం వర్షాధార పంటలే..
ఆంద్రప్రదేశ్‌లో పంటలకు 60 శాతం వర్షాధారమే. రాష్ట్రంలో 67.19 లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూములుండగా అందులో నీటిపారుదల సదుపాయం 28.08 లక్షల హెక్టార్లుండగా, 39.11 లక్షల ఎకరాలు వర్షాధారంతో సాగవుతోంది. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఎక్కువగా కరువు పరిస్థితులను,. ఏపీలోని తూర్పు తీర ప్రాంతం అత్యధికంగా తుపాను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ శాస్త్రవేత్తలు 2002 నుంచి 2024 వరకు జరిపిన అధ్యయనంలో.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్, అగ్రికల్చరల్‌ స్టాటస్టిక్స్, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ల డేటాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. కోస్తాంధ్రలో పరిశీలిస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తుపాను బెడదను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఇక ఈ 22 ఏళ్లలో 17 ఏళ్లపాటు కరువుతో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలు, 11 తుపాన్ల తాకిడితో శ్రీకాకుళం జిల్లా మొదటి ర్యాంకులో ఉన్నాయి. ఇటు కరువు, అటు తుపానులు, వరదలు పంటలను ఎడాపెడా దెబ్బతీశాయి. ఈ శాస్త్రవేత్తలు తమ అధ్యయన వివరాలను కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌లో ఐసీఏఆర్‌–సీఆర్‌ఐడీఏలు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ రెయిన్‌ఫెడ్‌ అగ్రికల్చర్‌ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వివరించారు.
Tags:    

Similar News