అభివృద్ధి పేరుతో పంట పొలాలు లాక్కోవద్దు
అభివృద్ధి పేరుతో దోపిడీ అనే అంశంపై జన చైతన్య వేదిక నిర్వహించిన చర్చా వేదికలో మాట్లాడిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు.;
రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటూ పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయాలనే నిర్ణయాన్ని పునః పరిశీలన చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జనచైతన్య వేదిక హాలులో కరేడు భూముల నేపథ్యంలో ‘అభివృద్ధి పేరుతో భూదోపిడి’ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రసంగిస్తూ 5,500 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న శ్రీ సిటీలో 300 లకు పైగా 30 దేశాల కంపెనీలు కొనసాగుతుంటే నేడు 8,500 ఎకరాల పచ్చని పంట పొలాలను ఇండోసోల్ అనే ఒక్క కంపెనీకి దారాదత్తం చెయ్యాలనే కుటిల ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. వేలాది మంది కరేడు రైతులు ఏకత్రాటిపై నిలబడి తమ భూములను రక్షించుకోవడానికి చేస్తున్న పోరాటాన్ని అభినందించారు.
అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాలు తీసుకొని అందులో 1,500 ఎకరాలతో రైల్వే స్టేషన్, 2,500 ఎకరాలతో స్పోర్ట్స్ సిటీలతో పాటు 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావించడం అవివేకమన్నారు. 140 మీటర్ల వెడల్పుతో 189 కిలోమీటర్ల పొడవైన 8 లైన్ల అవుటర్ రింగ్ రోడ్ ప్రపంచంలో ఏ దేశ నగరాలలో లేని విధంగా నిర్మించాలనుకోవడం, ఇందుకోసం 8,500 ఎకరాల భూమిని సేకరించడం దుర్మార్గమన్నారు. గతంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ను జగన్ మోహన్ రెడ్డి బినామీ కంపెనీగా పేర్కొన్న తెలుగుదేశం అగ్ర నేతలు నేడు అదే కంపెనీకి బాసటగా నిలవడం విడ్డూరంగా ఉందన్నారు. పైపెచ్చు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ప్రయోజనాలను, సహజ వనరులను కట్ట బెడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ కోనసీమ కేరళ పచ్చదనాన్ని ప్రతిబింబిస్తూ వైవిధ్యం గల పంటలతో, వైవిధ్యమైన జీవన విధానం నెలకొని ఉన్న కరేడు పరిసర ప్రాంతాల లోని పచ్చని పంట పొలాలను భూ సేకరణ పేరుతో ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడం ఘోరమైన తప్పిదమన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 42 వేలకోట్ల కేటాయిస్తే ఇండోసోల్ కంపెనీకి రూ. 46,429 కోట్ల విలువైన ప్రజాధనాన్ని ప్రోత్సహకాలు, సబ్సిడీల రూపంలో ఇవ్వాలని సంకల్పించడం ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. తిరుపతి నగర విస్తీర్ణం 6,700 ఎకరాలు, విజయవాడ నగర విస్తీర్ణం 15వేల ఎకరాలు ఉండగా ఒక్క ఇండోసోల్ కంపెనీకి దాదాపు పదివేల ఎకరాలు కేటాయించాలనుకోవడం భావ్యం కాదన్నారు.
మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ 2013 భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచి బలవంతంగా రైతుల నుంచి పంట భూములను సేకరించడం భవిష్యత్తులో ఆహార భద్రతకు విఘాతాన్ని కలిగిస్తుందన్నారు. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానంతో గత మూడు దశాబ్దాలుగా లక్షలాది ఎకరాలు పెట్టుబడి దారులకు, వ్యాపార వేత్తలకు ధారాదత్తం చేశారని, వీటిలో 75 శాతం భూమిలో ఎలాంటి సంపద సృష్టించకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారి తీసిందన్నారు. భూములు ధారా దత్తం చేస్తూ క్విడ్ ప్రోకోల ద్వారా రాజకీయ లబ్ది, ఆర్థిక లబ్ది పాలకవర్గాలు పొందుతున్నాయని తెలిపారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రూ. 500 కోట్ల విలువైన 5 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ నగర నడి బొడ్డున ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ స్థలాన్ని లులు మాల్ కు కట్టబెట్టాలని నిర్ణయించడం సహేతుకం కాదన్నారు. లులు మాల్ ద్వారా పరిసర ప్రాంతాలలో ఉన్న ఎన్నో కిరాణా షాపులు మూతపడి, ఎందరో ఉపాధి కోల్పోతారని వివరిస్తూ, లులు మాల్ అతి తక్కువ మందికి తక్కువ వేతనాలతో కూడిన ఉపాధిని మాత్రమే కల్పిస్తుందన్నారు.
విజయవాడ, విశాఖపట్నలలో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలోని మెట్రో ప్రాజెక్టు తీవ్ర నష్టాల్లో నడుస్తున్న సంగతిని గుర్తు చేశారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను అభివృద్ధి ముసుగులో ఒప్పులుగా మార్చే ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలని, మేధావుల మౌనం సమాజానికి చేటు అని తెలిపారు.
సీనియర్ న్యాయవాది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు ప్రసంగిస్తూ సామాజిక ప్రభావ అభిప్రాయ సేకరణ అవసరం లేదని కరేడు భూ సేకరణ పై గెజిట్ విడుదల చేయడాన్ని తప్పు పట్టారు. 60 శాతం పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న వాళ్ళ భూములను వివిధ కంపెనీల పేర్లతో తీసుకోవడం ద్వారా రైతాంగం కూలీలుగా మారుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి ప్రసంగిస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వేదికలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వాల అవినీతి ధోరణులను వివరించడానికి కృషి జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి, కరేడు పోరాట కమిటీ నేతలు ఎన్ సుకన్య, పి రామలక్ష్మమ్మ, ప్రొఫెసర్ డి ఏఆర్ సుబ్రహ్మణ్యం, కొరివి వినయ్ కుమార్, ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ చర్చా వేదికలో మాట్లాడారు.