వాటికి దూరంగా ఉండండి.. యువతకు హోం మంత్రి సూచన

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల బారిన పడొద్దంటూ ఆంధ్రప్రదేశ్ యువతను హెచ్చరించారు రాష్ట్ర హోం మంత్రి వంగలపుడి అనిత. లోన్‌యాప్‌లు, హనీట్రాప్‌లలో పడొద్దని చెప్పారు.

Update: 2024-08-10 09:41 GMT

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల బారిన పడొద్దంటూ ఆంధ్రప్రదేశ్ యువతను హెచ్చరించారు రాష్ట్ర హోం మంత్రి వంగలపుడి అనిత. లోన్‌యాప్‌లు, హనీట్రాప్‌లలో పడొద్దని చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ప్రజలను మోసం చేయడానికి నేరస్తులు రోజుకో కొత్త మార్గం ఎంచుకుంటున్నారని, కాబట్టి ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని అనిత చెప్పారు. నాలుగు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా రూ.1,730 కోట్ల సైబర్ నేరాలు జరిగాయని ఆమె వెల్లడించారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. ఇందులో హోం మంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగానే సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్‌ను ప్రారంభించారు.

16 రకాల మోసాలపై అవగాహన

సైబర్ నేరాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అమాయకపు ప్రజలు ఈ మోసగాళ్ల బారిన పడకుండా ఉండటానికి అన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే దాదాపు 16 రకాల సైబర్ నేరాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా 24శాతం వరకు సైబర్ నేరాలు పెరిగిపోయాయని, నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్‌లు, సైట్‌ల ద్వారా నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారని ఆమె వివరించారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సామాజిక మాద్యమాలే కీలకం

సైబర్ నేరాలకు సామాజిక మాద్యమాలే కేంద్రంగా మారాయని అన్నారామే. సామాజిక మాద్యమాల్లో మనం ఇస్తున్న వ్యక్తిగత సమాచారాన్ని ప్రధానంగా మార్చుకునే నేరస్తులు తమ ప్లాన్స్‌ను రూపొందించుకుంటున్నారని, వాటిని వాడుకునే మనలను మోసం చేస్తున్నారని, ఈ సమాచారమే సైబర్ మోసాలకు కారణమవుతుందని తెలిపారు. లోన్‌యాప్‌లు, హనీట్రాప్‌లు, ఇతర యాప్‌ల ఊబిలో పడి ఇప్పటికే పలువురు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని, ఈ నేరాల నియంత్రణకు రాష్ట్రస్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారామే. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్‌ చురుగ్గా పనిచేయాలని, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.

ప్రతి రోజూ ఐదారు నేరాలు: విజయవాడ సీపీ

‘‘ప్రతి రోజుకు 5 నుంచి 6 సైబర్ నేరాల ఫిర్యాదులు అందుతున్నాయి. విద్యార్థులు, వైద్యులు, ఐఏఎస్‌లు.. ఇలా చాలా మంది మోసపోతున్నారు. వీటి నుంచి బయపటపడాలంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఎప్పుడైనా ఇలా మోసపోతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేకుంటే జాతీయ స్థాయిలో ఉన్న సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా మీ ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఈ పోర్టల్.. నేరస్థుల ఆర్థిక లావాదేవాలను నిలిపేస్తుంది. 1930 పోర్టల్‌కు 98 బ్యాంకులతో అనుసంధానం ఉంది. సైబర్ నేరాలపై అవగాహనకు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా కలిసి కట్టుగా విజయవంతం చేయాలి’’ అని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.

Tags:    

Similar News