ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ఆధిపత్య పోరు
అధ్యక్ష్య కార్యదర్శుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ప్రస్తుతం వారిద్దరూ ఎంపీ లు కావడం విశేషం.;
వారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్ష్య కార్యదర్శులు. తెలుగుదేశం పార్టీ నాయకులు. పార్లమెంట్ సభ్యులు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరు ఎంపీ అయ్యాక ఏసీఏ కు అధ్యక్షులు అయ్యారు. రెండో వారు కార్యదర్శి అయిన తరువాత రాజ్యసభకు ఎంపికై ఎంపీ అయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కు అత్యంత సన్నిహితులు. లోకేష్ ప్రోద్బలంతోనే వారు ఇరువురూ ఎంపీలు కాగలిగారు. ఒకరు అమెరికా లో వ్యపారాలు చేస్తూ రాజకీయాల్లోకి రాగా రెండో వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఏపీ రాజకీయ రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఇద్దరూ కీలక వ్యక్తులుగా మారారు.
ఒకరు అవునంటే మరొకరు కాదంటారు..
కేశినేని శివనాథ్ (చిన్ని) తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు. ప్రస్తుతం ఈయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షులు. సానా సతీష్ బాబు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు. ఈయన ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు కార్యదర్శి. వీరిరువురికి అసోసియేషన్ లో పొసగటం లేదు. నాది పెత్తనం అంటే కాదు నాది పెత్తనం అంటున్నారు. ఇరువురూ ఒకరు అవునంటే ఒకరు కాదంటున్నారు. ఈ వ్యవహారాలు ఇంకా బహిర్గతం కాలేదు. అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో నాకు విశేష అధికారాలు ఉన్నాయని కేశినేని చిన్ని అనుకుంటున్నారు. కార్యదర్శి ని అయినందున నాకు విస్తృత అధికారాలు ఉన్నాయనే భావనలో సానా సతీష్ బాబు ఉన్నారు.
పాలవర్గంతో సంప్రదించకుండానే విరాళాలు ఇస్తారా?
కేశినేని శివనాథ్ సానా సతీష్ బాబుకు తెలియకుండా హామీలు ఇవ్వటం, ప్రోత్సాహకాలు ప్రకటించడంలో ముందున్నారు. నిజానికి పాలక వర్గ సభ్యుల ఆమోదం పొందిన తరువాత అధ్యక్షుడైనా, కార్యదర్శి అయినా తగిన హామీలు ఇవ్వాలి. ఆర్థిక పరమైన హామీలు ఇవ్వాలంటే అసోసియేషన్ సభ్యుల తీర్మానం అవసరం. ఇటీవల విజయవాడలో బుడమేరు పొంగి వేల ఇళ్లు వరదల్లో మునిగిపోయారు. ఈ ఘోర విపత్తు నుంచి బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. సుమారు ఐదు వందల కోట్ల వరకు విరాళాలు ప్రభుత్వానికి అందాయి. ఇదే సందర్భంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ ప్రకటించారు. కనీసం కార్యదర్శితో కూడా సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఒక క్రీడా కారుడు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడంతో ఆయనకు రూ. 25 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు. ఈ విషయంలో కూడా కార్యదర్శిని కానీ, ఇతర సభ్యులను కానీ సంప్రదించ లేదు. దీంతో కార్యదర్శికి ఈ విషయాలు ఆగ్రహం తెప్పించాయి.
అధ్యక్షుని ఆదేశాలతో డబ్బులు ఇవ్వాలా?
అధ్యక్షుడు పాలక వర్గంతో సంబంధం లేకుండా హామీలు ఇస్తూ కోట్లు విరాళంగా ఇస్తున్నారు. చెక్స్ పై నేను సంతకం చేయనని, ఆ విషయం అధ్యక్షునికి చెప్పాలని అకౌంటెంట్ కు కార్యదర్శి చెప్పినట్లు సమాచారం. జాయింట్ అకౌంట్ లో నిధులు ఉంటాయి. కార్యదర్శితో పాటు కోశాధికారి సంతకం పెడితేనే నిధులు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు చెక్ పవర్ ఉన్న వారికి కూడా తెలియకుండా హామీలు ఇచ్చి డబ్బులు డ్రా చేయమంటే ఎలాగంటూ కార్యదర్శి సతీష్ చిన్నీకి సహాయ నిరాకరణ చేపట్టినట్లు సమాచారం. దీంతో అధ్యక్షుడైన ఎంపీ చిన్ని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. తనకు సహకరించాలని కోరినా కార్యదర్శి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని చిన్ని లోకేష్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
సతీష్ ను కార్యదర్శి పదవి నుంచి తప్పిస్తారా?
సానా సతీష్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కావడం వల్ల కార్యదర్శి పదవిని వేరే వారికి కేటాయిస్తే బాగుంటుందని చిన్ని లోకేష్ ముందుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. లోకేష్ ఈ విషయంలో ఏ విధంగానూ స్పందించ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సానా సతీష్ ను ఏసీఏ కార్యదర్శి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. సానా సతీష్ లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పుడు అన్నీ తానై చూసుకున్నారు. ఆర్థికంగానూ పాదయాత్రకు సహకారం అందించినట్లు ఇప్పటికీ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతటి ప్రాధాన్యత పార్టీలో ఉన్నందున సతీష్ బాబును కార్యదర్శి పదవి నుంచి తప్పిస్తారా? అనే సందేహాలు కూడా పలువులో వ్యక్తమవుతున్నాయి.
ఇష్టానుసారంగా టీము సభ్యుల నియామకం
పైగా టీముల ఎంపికపై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. టీమ్ లో 15 మంది మాత్రమే ఉండాలి. అవసరమైతే మరో ముగ్గురిని ఎక్స్ ట్రా ప్లేయర్లుగా పెట్టుకుంటారు. అలా కాకుండా ఒకే సారి టీమ్ కు 25 మందిని సెలక్ట్ చేస్తున్నారని, కొందరికి ఆడే అవకాశం లేకపోయినా టీముకు వర్తించే సౌకర్యాలు అనుభవిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. ఇందులో కూడా అధ్యక్ష కార్యదర్శుల వైపు నుంచి ఒకరిని మించి ఒకరు రెకమెండేషన్ లు చేస్తున్నారనే చర్చ కూడా ఏసీఏలో జరుగుతోంది. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం మరమ్మతులకు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు శనివారం అమరావతిలో కేశినేని శివనాథ్ తెలిపారు. నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాలన్నింటిలోనూ కేశినేని శివనాథ్ పైచేయిగా ఉన్నారని, సభ్యులను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. క్రీడా కారుల సంక్షేమం, క్రీడాభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులు ఇష్టానుసారం వాడుతున్నరని అసోసియేషన్ లోని వారు అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.