వైజాగ్ రైల్వే జోన్ నిధులు పింక్ బుక్లో ఉన్నాయా?

రైల్వే బడ్జెట్లో దక్షిణ కోస్తా జోన్ ఊసేది? ఇటీవల ఈ జోన్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417 కోట్ల కేటాయింపులు.;

Update: 2025-02-04 11:46 GMT

విశాఖ రైల్వే స్టేషన్

విశాఖపట్నం రైల్వే జోన్.. ఈ పేరు దాదాపు దశాబ్దకాలంగా ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో నానుతూనే ఉంది. కానీ ఈ జోన్ మాత్రం బ్రహ్మపదార్థంగానే మారిపోయింది. పుట్టుకకు ముందే దీనికి 'దక్షిణ కోస్తా రైల్వే జోన్'గా పేరు పెట్టారు. అప్పట్నుంచి పురిటి కష్టాల తోనే కొట్టుమిట్టాడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. ఏటా రైల్వే బడ్జెట్లో ఈ జోన్ కు నిధులు కేటాయిస్తారని ఆశపడడం, కేటాయింపులు లేకపోవడం ఆనవాయితీ అయిపోయింది. ఈసారి రైల్వే బడ్జెట్లోనూ అదే జరిగింది.. ఆశ నిరాశే అయింది. అయితే రైల్వే బడ్జెట్లో జోన్ కు నిధులు కేటాయించకపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదని, 'పింక్ బుక్' లో కేటాయింపులు ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇంతకీ పింక్ బుక్ లో విశాఖ రైల్వే జోన్ నిధులుంటాయా? అన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న!

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రకటన చేసింది. కానీ ఆ తర్వాత రెండు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ/ఎన్డీయే ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. అయినప్పటికీ ఆ జోన్ గురించి పట్టించుకోవడమే మానేసింది. అప్పట్నుంచి ఏవేవో కుంటిసాకులతో ఈ జోన్ కనీసం శంకుస్థాపనకే నోచుకోలేదు. ఇలా ఈ జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ జోన్ శంకుస్థాపన వాయిదా పడుతూ వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది.

జనవరి 8న విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఎట్టకేలకు ఈ రైల్వే జోన్కు శంకుస్థాపన చేశారు. ఇక జోన్ కు నిధుల కేటాయింపు జరుగుతుందని, పనులు ప్రారంభమవుతాయని ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈసారి రైల్వే బడ్జెట్లో దీనికి పుష్కలంగా నిధులు కూడా కేటాయిస్తారని ఆశపడ్డారు. సోమవారం రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులను వివరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ.9,417 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే ఈ నిధుల్లో ప్రతిష్టాత్మక దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేటాయింపులే లేకపోవడం విశేషం! అంతేకాదు.. విశాఖపట్నం, విజయవాడల్లో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులకు కూడా నిధులు విదిల్చలేదు.

గతంలోనూ ఇలాగే...

విశాఖ రైల్వే జోన్లు నిధులు కేటాయింపై వివక్ష కొత్తేమీ కాదు.. ఈ జోన్కు రెండేళ్ల క్రితం రైల్వే బడ్జెట్ (2023-24) కేవలం రూ. వెయ్యి మాత్రమే కేటాయించారు. గత ఏడాది (2024-25) రూ.9 కోట్లు ఇచ్చారు. ఈసారి మాత్రం ఒక్క రూపాయీ విదిల్చలేదు. కొత్తగా ఏర్పడిన రాయగడ డివిజన్ కు మాత్రం రూ. కోటిన్నర అంబ్రెల్లా పనుల కింద రూ.1.50 కేటాయించారు. కానీ కొత్తగా ఏర్పాటవుతున్న సౌత్ కోస్టల్ జోన్కు మాత్రం శూన్య హస్తమే చూపడం విశేషం! విశాఖ రైల్వే జోన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే పనులెలా ముందుకు వెళ్తాయని జెడ్ ఆర్యూసీపీ సభ్యుడు కంచుమర్తి ఈశ్వర్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. పింక్ బుక్లోనైనా జోన్ కు నిధులు కేటాయింపులు జరపాలని కోరారు.

సీహెచ్ నర్సింగరావు

 

విశాఖ రైల్వే జోన్ పై నిర్లక్ష్యం వల్లే..

'రైల్వే బడ్జెట్లో సౌత్ కోస్టల్ జోన్ కు నిధులేమీ కేటాయించకపోవడం దుర్మార్గం. రైల్వే జోన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకే ఏమాత్రం ఇష్టం లేదు. నిన్నగాక మొన్న ప్రధాని మోదీ వచ్చి జోన్కు శంకుస్థాపన చేశాక కూడా నిధులు కేటాయించలేదంటే నిర్లక్ష్యం కాక ఏమనాలి? ఇది విశాఖ వాసులతో పాటు ఆంధ్ర ప్రజలకు నమ్మకద్రోహం చేయడమే. ఒడిశా ఒత్తిడి కూడా జోన్కు నిధుల కేటాయించకపోవడానికి ఓ కారణం' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నర్సింగరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు వివరించారు.

ఆశలన్నీ 'పింక్ బుక్ ' పైనే..

వివిధ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయించడం పరిపాటి. కానీ అలా కొన్నింటికి ఈ బడ్జెట్లో నిధులు ఇవ్వకపోయినా పింక్ బుక్ ద్వారా జరుగుతాయని చెబుతున్నారు. బడ్జెట్కు ముందు వివిధ డివిజన్లు/జోన్ల నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపుతారు. వాటిని పరిశీలించి ఆమోదయోగ్యమైనవి భావించిన వాటికి పింక్ బుక్ లో చేరుస్తారు. అలా చేర్చిన వాటికి బడ్జెట్ తో పనిలేకుండా నిధులు కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు విశాఖ సౌత్ కోస్టల్ జోన్కు కూడా అలానే పింక్ బుక్లో నిధుల కేటాయింపు జరిగే ఉంటుందని, త్వరలోనే ఆ విషయం తెలుస్తుందని అంటున్నారు.

 

డీఆర్ఎం మనోజ్కుమార్ సాహు 

వాల్తేరు డీఆర్ఎం ఏమన్నారంటే?

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కు రైల్వే బడ్జెట్లో నిధుల కేటాయింపుపై వాల్తేర్ డీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు స్పందించారు. ఈ జోన్ నిధుల కేటాయింపులు పింక్ బుక్లో ఉంటాయని, త్వరలోనే ఆ వివరాలు వాల్తేరు డివిజన్కు చేరతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఇంకా ఏమన్నారంటే? 'వాల్తేరు డివిజన్ కూడిన జోన్ ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఏపీ నుంచి తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ నాలుగు వందేభారత్ రైళ్లను నడుపుతున్నాం. కొత్త రైళ్ల ఏర్పాటులో మరింత ప్రాధాన్యం దక్కుతుంది.

130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ల కోసం రైల్వే లైన్ల ఆధునీకరణ జరుగుతుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కాంట్రాక్టరు నిలిపి వేశాడు. వీటికి మళ్లీ టెండర్లు పిలిచాం., త్వరలో పనులు పునఃప్రారంభమవుతాయి. వాల్తేరు డివిజన్ లోనూ కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దానికి అవసరమైన శిక్షణ కోసం సిబ్బందిని సికింద్రాబాదు పంపిస్తున్నాం. దేశంలో కొత్తగా మరో 200 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అవి వస్తే విశాఖ- తిరుపతి మధ్య స్లీపర్ వందేభారత్ రైలును ప్రవేశపెట్టేందుకు వీలవుతుంది. కొత్తగా నమో భారత్ రైళ్లు వస్తాయి. అందులో కొన్ని విశాఖ నుంచి ఇంటర్ సిటీలుగా నడిపేందుకు ఆస్కారం ఉంది' అని డీఆర్ఎం సాహు వివరించారు. 

Tags:    

Similar News