శ్రీతేజను గుర్తుపట్టారా ? తాజా పరిస్ధితి ఏమిటో తెలుసా ?

ఆసుపత్రిలో ఎంతకాలం ఉంచుకున్నా ఇంతకన్నా మెరుగు కాదని డాక్టర్లు డిసైడ్ అయిన తర్వాత పిల్లాడిని ఆసుపత్రి నుండి డిస్చార్జి చేశారు;

Update: 2025-04-30 11:00 GMT
Pushpa Movie victim Sri Teja

శ్రీతేజ అంటే బహుశా ఇపుడు ఎవరూ గుర్తుపట్టరేమో. పుష్ప సినిమా(Pushpa Movie victim) బాధితుడు శ్రీతేజ అంటే గుర్తుకురావచ్చు. ఇపుడు ఈఎనిమిదేళ్ళ పిల్లాడి సంగతి ఎందుకంటారా ? పిల్లాడి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని డాక్టర్లు ఆసుపత్రినుండి డిస్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుండి డిస్చార్జ్ అయ్యాడంటే ఆరోగ్యం బాగుందనే అందరు అనుకుంటారు. కాని ఈ పిల్లాడి పరిస్ధితిని ఏమీ బావోలేదు. ఆసుపత్రిలో ఎంతకాలం ఉంచుకున్నా ఇంతకన్నా మెరుగు కాదని డాక్టర్లు డిసైడ్ అయిన తర్వాత పిల్లాడిని ఆసుపత్రి నుండి డిస్చార్జి చేశారు. దాదాపు ఐదుమాసాలు ఆసుప్రతిలో ఉన్న పిల్లాడు ఇపుడు ఎవరినీ గుర్తుపట్టలేని స్ధితిలో ఉన్నాడు. 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తల్లి చనిపోగా పిల్లాడు స్పృహతప్పిపడిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.

పిల్లాడిని పోలీసులే ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత జరిగిన వివాదంలో అల్లుఅర్జున్(Allu Arjun) ఫ్యామిలీ ఆసుపత్రికి చేరుకుని పిల్లాడి వైద్యఖర్చులు అన్నీ తామే భరిస్తామని ఆసుపత్రి యాజమాన్యానికి హామీ ఇచ్చింది. అందుకనే పిల్లాడికి ఇప్పటివరకు ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యం అందింది. అయితే ఎంత వైద్యం అందించినా పిల్లాడి మెదడు మాత్రం సరిగా పనిచేయటంలేదు. తొక్కిసలాటలో పిల్లాడికి ఆక్సిజన్ అందక బ్రైన్ దెబ్బతినటంతో స్పృహతప్పిపోయాడు. ఇపుడు పరిస్ధితి ఏమిటంటే పూర్తి స్పృహలో అయితే ఉన్నాడు కాని ఆహారం నోటిద్వారా తీసుకోలేకపోతున్నాడు. అలాగే మెదడు సరిగా పనిచేయటంలేదు. తండ్రి, చెల్లెలును కూడా గుర్తుపట్టలేకపోతున్నాడని డాక్టర్లే చెప్పారు.

ఇన్సెంటివ్ కేర్ యూనిట్(ఐసీయూ) నుండి ఈమధ్యనే స్పెషల్ గదికి మార్చారు. పిల్లాడు ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరంలేకపోయినా శ్వాసతీసుకుంటున్నాడు. అయితే బ్రైన్ యాక్టివేషన్ కావటంలేదు కాబట్టే ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నట్లు డాక్టర్లు చేతన్, విష్ణు చెప్పారు. ఫిజియోథెరపి కోసం ప్యారడైజ్ సమీపంలోని న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పిస్తే ఉపయోగం ఉంటుందని డాక్టర్లు సలహా ఇవ్వటంతో తండ్రి భాస్కర్ కొడుకును రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించాడు. తన కొడుకు ఆరోగ్యం కేవలం 10 శాతం మాత్రమే బాగుపడిందని తండ్రి చెప్పాడు. కళ్ళు తెరిచి అందరినీ చూస్తున్నా ఎవరినీ గుర్తుపట్టడంలేదని తండ్రి ఆవేధనతో చెప్పాడు. తన కొడుకు ఆరోగ్యం ఎప్పటికి మెరుగవుతుందో ? అందరినీ గుర్తుపట్టేందుకు ఎంతకాలం పడుతుందో తెలీటంలేదని ఆవేధన వెలిబుచ్చాడు.

Tags:    

Similar News