అమరావతి ఆర్థిక నగరం ఎప్పుడవుతుందో తెలుసా?
ఏపీ రాజధాని అమరావతి ఆర్థిక నగరంగా ఎప్పుడు మారుతుంది. తెచ్చిన అప్పులు ఎప్పటికి తీరుస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికోసం ఎంత కష్టపడాల్సి ఉంటుంది.
Byline : G.P Venkateswarlu
Update: 2024-07-06 03:00 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆర్థిక నగరంగా మారుతుందని మొదట అందరూ కలలు కన్నారు. ఐదేళ్లలో అవన్నీ మాయమయ్యాయి. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ ఐదేళ్లలో అమరావతి ఆర్థిక నగరంగా మారుతుందా? నిరుద్యోగ యువతకు వరం కానుందా? అన్నీ పాలకుల చేతుల్లోనే ఉన్నాయంటున్నారు ఆర్థిక పరిశీలకులు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేకపోవడం, ప్రపంచంలోని పలు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయనే ధీమాతో ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ప్రారంభించడం జరిగిపోయాయి. 55వేల ఎకరాల వరకు భూమి ఉన్న అతి పెద్ద ప్రాజెక్టు అమరావతి. ఈ భూమిపై పలు నిర్మాణాలు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుకోవడంతో పాటు ప్రపంచ దేశాలు ఇటువైపు చూసే విధంగా రాజధాని నిర్మాణం జరగాల్సి ఉంది.
ఇందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక పరపతి సంస్థలు సహకరించాయి. ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి తిరుగులేని ప్రచారం వచ్చింది. మూడేళ్ల కాలంలో నిత్యం అమరావతి పేరు దేశంలోనే కాకుండా ప్రపంచ పటంలో నానింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి ఉంది.
జగన్ తీరుతో అప్పులపై పెరిగిన వడ్డీలు
రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పరపతి ద్వారా 2017లో పనులు ప్రారంభించారు. కొన్ని విభాగాలకు సంబంధించిన భవన నిర్మాణాలు చేపట్టి దాదాపు 80 శాతం వరకు పూర్తి చేశారు. ప్రభుత్వం మారటంతో 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి అవసరం లేదని ప్రకటించారు. జరుగుతున్న పనులను మధ్యలోనే ఆపివేశారు. దీంతో అమరావతి నగరం అప్పులు తీర్చలేని పరిస్థితికి వచ్చింది. పనులు ఇంచు కూడా కదల లేదు. అందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కారణం. దాదాపు పూర్తయిన భవనాలకు ఫినిషింగ్ ఇచ్చి అద్దెలకు ఇచ్చినట్లైతే కనీసం వడ్డీలైనా అనుకున్న ప్రకారం కట్టగలిగేవారు. అది కూడా జగన్ ప్రభుత్వం చేయలేదు. పూర్తిగా చెదులు పట్టేవరకు ఎదురు చూసింది. అయితే నిర్మాణాలకు ప్రారంభంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టాల్సి వచ్చింది.
ఇప్పటి వరకు అప్పులకు కట్టిన వడ్డీ రూ. 2,646.93 కోట్లు
అప్పుడు, ఇప్పుడు అప్పులతోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాల కోసం ప్రభుత్వం అప్పులు చేసింది. కేవలం అప్పులు చేసి నిర్మాణాలు గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించడం విశేషం. ఇప్పటి వరకు సిఆర్‌డిఏ తీసుకున్న అప్పులకు రూ. 2,646.93 కోట్లు వడ్డీ కింద, రూ. 530.77 ప్రిన్స్‌పల్ అమౌంట్ రూపంలో తిరిగి చెల్లించింది. సిఆర్‌డిఎ అమరావతిలోని భూమిని అభివృద్ధి చేసి దానిపై డబ్బు సంపాదించాల్సి ఉంది. ఆదాయం లేకపోయినా సిఆర్‌డిఎ వేల కోట్లు అప్పులు చేసింది. హడ్కో నుంచి రోడ్లు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 1,151.59 కోట్లు 9.10 శాతం వడ్డీకి తీసుకుంది. 15 సంవత్సరాల లోపులో క్వార్టర్లీ పద్దతిపై అప్పు, అసలులో కొంత భాగం చెల్లించాల్సి ఉంది. ఐదేళ్ల మారిటోరియం ముగిసిన నేపథ్యంలో రూ. 230.77 కోట్ల ప్రిన్స్‌పల్ అమౌంట్, వడ్డీ కింద రూ. 643.07 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వేర్వేరు ప్రాజెక్టుల కోసం అమరావతి బాండ్స్ ద్వారా రూ. 2,000కోట్లు 10.31 శాతం వడ్డీకి తీసుకున్నారు. దీనికి రూ. 300 కోట్లు అసలు, రూ. 1,179 కోట్లు వడ్డీ చెల్లించారు.
బ్యాంకుల హెచ్చరికతో అప్పు చెల్లించిన జగన్ ప్రభుత్వం
హౌసింగ్ ప్రాజెక్టు కోసం బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 1,955 కోట్లు రూ. 8.50 వడ్డీకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రూ. 824.78 కోట్లు వడ్డీ చెల్లించారు. హౌసింగ్ ప్రాజెక్టు మొత్తం అప్పులో రూ. 530 కోట్లు చెల్లించారు. నిర్మాణాలు ఆగిపోవడం వల్ల వాటి నుంచి వస్తాయనుకున్న ఆదాయాలు, పన్నులు రాకపోవడంతో ఆర్థికంగా ఈ ప్రాజెక్టు పెను భారంగా మారింది. ఇటీవల బ్యాంకుల వారు అప్పులు కట్టాలని నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో ఎన్‌పీఏలో చేరుస్తామని, దేశంలో మరే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోలేరని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పును చెల్లించింది. గత సంవత్సరం ఇది పెద్ద సమస్యగా మారింది. అప్పులు పెరిగి పోవడం, వాటి నుంచి వస్తుందనుకున్న ఆదాయం రాకపోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వ తీరే కారణమయింది.
పడిపోయిన రేటింగ్
అప్పులు పెరగటం, ఆదాయం లేకపోవడంతో అమరావతికి రేటింగ్ పడిపోయింది. తొలుత 2018లో అక్యూట్ రేటింగ్ ఎఎ ఉంటే ఇప్పుడు సి కి పడిపోయింది. బ్రిక్స్ వర్క్ రేటింగ్ 2018లో ఎఎ ఉంటే ఇప్పుడు బిబి ప్లస్‌కు పడిపోయింది. దీంతో నిధుల రాకకు గ్యారెంటీ లేకుండా పోయింది. సిబిల్ రేటింగ్‌కు సంబంధించి క్రిసిల్ ఎ ప్లస్ రేటింగ్ ఇవ్వగా ప్రస్తుతం బిబి ప్లస్‌కు పడిపోయింది. దీనివల్ల రుణ దాతలు ముందుకు రావాలన్నా, పెట్టుబడులు పెట్టే వారు ఇక్కడికి వచ్చి రుణం తీసుకోవాలన్నా సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల విడుదల చేసిన స్వేతపత్రంలో పేర్కొనడం విశేషం.