హిస్టరీ షీట్ అంటే ఏమిటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేరస్తులకు సింహస్వప్నమయ్యారు. 85 మందిపై హిస్టరీ షీట్ తెరిచారు. అసలు హిస్టరీ షీట్ అంటే ఏమిటి? పోలీసులు ఎందుకు తెరిచారు?

Update: 2024-05-22 02:00 GMT

సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన ఎన్నికల్లో నిందితులైన 85 మందిపై హిస్టరీ షీట్ తెరిచారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్, మరో ఇద్దరిపై బహిష్కరణ వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి డిజిపి హరీష్ కుమార్ గుప్తా సిఫార్స్ చేశారు. ఎన్నికలకు ముందు రోజు నమోదైన కేసుల్లో 1,522, ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2,790 మందిని గుర్తించినట్లు డిజిపి తెలిపారు. ఎన్నికల తరువాత నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించారు. ఇప్పటికే నిందితుల్లో కొంత మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. 41ఎ నోటీసులు కొందరికి అందజేసినట్లు డిజిపి గుప్తా తెలిపారు.

రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఇంత మందిపై కేసులు నమోదు చేయడం మొదటి సారిగా భావిస్తున్నారు. ఎన్నిక రోజు పట్టీపట్టనట్లు పోలీసులు ఉన్నందునే నేరస్తులు రెచ్చిపోయి ఇష్టానుసారం వ్యవహరించారు. కత్తులు, గొడ్డళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లు చేతపట్టుకుని హింసకు పాల్పడ్డారు. పల్నాడు ప్రాంతంలో కూడా ఇంతమందిపై ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదు. ఎన్నికల కమిషన్ సీరియస్ గా స్పందించడం, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు సస్పెన్షన్ కూడా చేయడంతో పోలీస్ తో పాటు ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పోలింగ్ రోజు, మరుసటి రోజు రాష్ట్రంలో జరిగిన దాడులను సీరియస్ గా తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎపిలో జరిగిన ఎన్నికల హింసపై సిట్ ను నియమించాల్సిందిగా ఆదేశించి వెంటనే నివేదిక తెప్పించుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పలువురు నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఆ వివరాలు ఇంకా వెల్లడించలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లోకి స్వయంగా వచ్చి ఈవీఎం మిషన్ ను స్వయంగా ధ్వసం చేసిన వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

హిస్టరీ షీట్ అంటే ఏమిటి?

నేరాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులపై పోలీసులు వివరణాత్మక రికార్డు (హిస్టరీ షీట్)ను తయారు చేస్తారు. దీనిని హిస్టరీ షీట్ అంటారు. నేర రకాలు, ముప్పుల స్థాయిని బట్టి కొన్ని రకాలుగా దీనిని వర్గీకరించారు. నేర కార్యకలాపాల కారణంగా ప్రజల భద్రతకు ముప్పని భావించే వ్యక్తుల కోసం తయారు చేసిన సమగ్ర రికార్డు. నేరస్తులను ట్రాక్ చేయడానికి, వారి కదలికలను పర్యవేక్షించడానికి ఈ రికార్డు ఉపయోగ పడుతుంది.

హిస్టరీ షీట్ ను ఎలా ప్రారంభిస్తారు?

నేరచరిత్ర ఉన్న వారిని, నేరాల్లో ప్రమేయం ఉందని పోలీసులు భావించిన వారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గుర్తిస్తారు. వీరిపై సమగ్ర నివేదికను తయారు చేస్తారు. నివేదికలో కొన్ని విషయాలు పొందుపరుస్తారు. అవి ఏమిటంటే..

నేరస్తునికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం తీసుకుంటారు. అందులో వ్యక్తి పేరు, మారు పేర్లు ఉంటే అవి, చిరునామా వంటి వివరాలు నమోదు చేస్తారు.

నేరస్తుడైన వ్యక్తికి సహకరించే వారు, బంధువులు, ఆశ్రయం ఇచ్చే వారు, స్నేహితులు, సహచరుల గురించిన సమాచారం నమోదు చేస్తారు.

నేరస్తుని ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. నేరాలు చేసేందుకు ఆర్థిక మద్దతు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఆస్తి వివరాలు, జీవనోపాధికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు.

ఈ వివరాలు నమోదు చేసిన తరువాత సూపరింటెన్ డెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) వంటి సీనియర్ పోలీసు అధికారులకు అందజేస్తారు.

వారి ఆమోదం పొందిన తరువాత నేరస్తుని అధికారిక హిస్టరీ షీట్ రెడీ అవుతుంది.

హిస్టరీ షీట్లో ఎటువంటి సమాచారం ఉంటుంది?

వ్యక్తి రూపానికి సంబంధించిన వివరణాత్మక వర్ణన, గుర్తింపుకు సహాయపడే పుట్టుమచ్చలు లేదా ఏవైనా భౌతిక లక్షణాలు షీట్ లో నమోదు చేస్తారు.

హిస్టరీ షీట్ రకాలు

నేరస్తుల వల్ల జరిగే ముప్పును గుర్తించి పోలీసులు నేర కార్యకలాపాల ఆధారంగా హిస్టరీ షీట్ లు తెరుస్తారు.

కెడి: దోపిడీ, గ్యాంగ్ దోపిడీ వంటి నేరాలకు పాల్పడిన నేరస్తులు.

రౌడీషీట్: శాంతికి విఘాతం కల్పించడం, హింసకు పాల్పడటం, ప్రోత్సహించడం వంటి వారిపై ఈషీట్ తెరుస్తారు.

అనుమానిత షీట్: దొంగతనం, దోపిడీకి సంబంధించి కానీ, నేరారోపణ ఉన్న వ్యక్తులపై కానీ ఈషీట్ తెరుస్తారు.

సుప్రీం కోర్టులో అమానతుల్లా ఖాన్ పిటిషన్ గురించి:

2022 మే 13న ఢిల్లీలోని జామియా నగర్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ హిస్టరీ షీట్‌ను తెరిచి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి)కి ఒక షీట్ సమర్పించారు. బెదిరింపులు, అల్లర్లు వంటి నేరాలతో సహా ఖాన్‌పై పెండింగ్‌లో ఉన్న 18 కేసుల జాబితా ఈ ప్రతిపాదనతో పాటు ఉంది. ఈ మొత్తం కేసుల్లో 14 కేసులు తాను నిర్దోషిగా విడుదలయ్యానని ఖాన్ పేర్కొన్నారు.

ఢిల్లీ పోలీసులు సరైన విధానాన్ని అనుసరించారని, పంజాబ్ పోలీస్ రూల్స్ 1934కు కట్టుబడి ఉన్నారనిపేర్కొంటూ, హిస్టరీ షీట్ తెరవడాన్నివ్యతిరేకిస్తూ అప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

సుప్రీం కోర్టుకు ఖాన్ చేసిన అభ్యర్థన తిరస్కరణకు గురైంది. అయితే హిస్టరీ షీట్‌లో అతని మైనర్ పిల్లలు, భార్య వివరాలు కనిపించకుండా చూసుకోవాలని సుప్రీకోర్టు పోలీసులను ఆదేశించింది. హిస్టరీ షీట్‌లో చేర్చడం ద్వారా మైనర్, బంధువులతో సహా అమాయక కుటుంబ సభ్యుల గౌరవం, ఆత్మగౌరవం, గోప్యతకు భంగం కలుగుతుందని, తమను రక్షించాలని ఖాన్ చేసిన అభ్యర్థనపై కోర్టు దృష్టి సారించింది. అమాయక కుటుంబ సభ్యుల వివరాలకు భంగం కలగకుండా చూసేందుకు హిస్టరీ షీట్‌ల ఫార్మాట్‌ను పునఃపరిశీలిస్తామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరణలో పేర్కొన్నారు.

2024 మార్చి 21న ఢిల్లీ పోలీస్ కమిషనర్ జారీ చేసిన స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం మైనర్ బంధువుల వివరాలను హిస్టరీ షీట్‌లో చేర్చ కూడదు.

ప్రివెంటివ్ డిటెన్షన్ (పిడి యాక్ట్): కొన్నిసార్లు శిక్షాత్మకమైనదిగా కాకుండా నివారణ చర్యగా సూచిస్తారు. విచారణ లేకుండానే ఒక వ్యక్తిని ఖైదు చేస్తారు. జైలులో నిర్బంధించడం, సంక్షోభం, ప్రశాంత వాతావరణం రెండింటిలోనూ ఈ చట్టం వర్తిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ద్వారా నిర్బంధించిన లేదా అరెస్టు చేసిన వారికి రక్షణ ఉంటుంది. బ్రిటీష్ కాలంలో కూడా భారతదేశంలో నిరోధక ఖైదు విధించారు.

Tags:    

Similar News