ఏ పథకాల పేర్లు మారాయో తెలుసా..
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేర్ల మార్పుకు నాంది పలికింది. గత ప్రభుత్వంలో పెట్టిన పేర్లను మార్చేసేందుకు చర్యలు చేపట్టింది.;
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి పథకానికి వైఎస్ జగన్, వైఎస్‌ఆర్ పేర్లు ఎక్కువుగా పెట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ పేర్లను మార్చి వేస్తూ అక్కడక్కడ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు పేర్లు కలిసొచ్చేలా పెట్టారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అమలు చేస్తోన్న పలు పథకాల పేర్లను మార్చి వేసింది. గత ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పేర్లతో పథకాలను అమలు చేశారు. ఈ పథకాలకు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్స్‌గా పేర్లు మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరును మార్చి అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధిగా పేరు పెట్టారు. ఇది గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పేరే.
2019 వరకు ఓవర్‌సీస్ పేరుతోనే ఈ పథకం అమలైంది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం దీని పేరు మార్చేసింది. అలాగే వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు పేరును మార్చి గతంలో ఉన్న చంద్రన్న పెళ్లి కానుక పేరును పునరుద్దరించారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లి కానుక పేరుతోనే అమలు చేశారు. వైఎస్‌ఆర్ విద్యోన్నతి పథకం పేరును గతంలో ఉన్న ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పెట్టిన జగనన్న సీవిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అన్న పేరును తొలగించి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహక పథకంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబరు 04 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఆరు పథకాల పేర్లను మార్చివేసింది.