అమరావతిలో జంగిల్ తొలగింపు ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
రాజధాని అమరావతి ప్రాంతంలో పెరిగిన పిచ్చిచెట్లు తొలగించేందుకు ఖర్చు ఎంత పెడుతున్నారో అంత కంటే నాలుగు కోట్లు ఎక్కువతో ప్రభుత్వ భవనాలు, రోడ్లు నిర్మిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో పిచ్చి చెట్లు (జంగిల్ క్లియరెన్స్) తొలగింపు ఖర్చు వింటే కళ్లు తిరుగుతాయి. అమరావతిలో ప్రభుత్వ భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నది జంగిల్ క్లియరెన్స్ ఖర్చుకంటే నాలుగు కోట్లు మాత్రమే ఎక్కువ. అయితే జంగిల్ క్లియరెన్స్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం కూడా సమస్యగానే చెప్పొచ్చు. అమరావతిలో నిర్మాణాలు చేపట్టడమంటే డబ్బుతో చెలగాటమని పలువురు నిర్మాణ రంగ నిపుణులు వ్యాఖ్యానించడం విశేషం. 2019కి ముందు కూడా చాలా వరకు పిచ్చిచెట్లు పెరిగే ఉన్నాయి. అయితే ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల ప్రాంతంలో మాత్రం చెట్లు తొలగించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాల వేగం పెంచారు. సచివాలయంతో పాటు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాలు వెనువెంటనే చేపట్టనున్నారు. ఇప్పటికే నిర్మాణరంగ నిపుణులు ఈ ప్రాంతంలో పర్యటించి గతంలో వేసిన బేస్‌మెట్స్, ఇతర నిర్మాణాలపై నివేదికలు తయారు చేశారు. ప్రాథమికంగా పరిస్థితిని పాలకులకు వివరించారు. వివరణాత్మకంగా నివేదికను ఒకటీ రెండు రోజులుల్లో ఇస్తారని మునిసిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పి నారాయణ బుధవారం చెప్పారు. జంగిల్ క్లియరెన్స్ పనులను ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.