ఎన్ని నీళ్లు సముద్రంలో కలిసాయో తెలుసా?
వరద నీరు సముద్రం పాలవుతోంది. కాలువల్లో నుంచి బయటకు వెళ్లాల్సిన నీరు ఊర్లపైకి వస్తోంది. ఇదుకు కారణాలు ఏమిటి? ఎందుకు వరద నీరు సముద్రం పాలవుతోంది?
ఈ సంవత్సరం జూన్ 4 వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ తరువాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. ఇరువురూ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులను, రిజర్వాయర్లను బాగు చేయడంలో విఫలమయ్యారు. కొత్త ప్రాజెక్టులు లేకపోగా పాత ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ లేకుండా పోయింది. రాయలసీమపై అందరూ ప్రేమ కురిపించడం, వెనుక బడిన ప్రాంతమని చెప్పడం, నీరు లేక రాయలసీమ పూర్తిగా వెనుకబడిందని చెప్పడం చేస్తున్నారు. నిజానికి ఇటీవల సంభవించిన వరద నీటిని రాయలసీమ ప్రాజెక్టుల్లో నింపుకుంటే ఏడాది పాటు రాళ్ల సీమ రత్నాల సీమగా మారేది కాదా? ఇందుకు కారకులు పాలక ప్రతిపక్షాలు కాదా? ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ప్రశ్నిస్తే గతంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కోసం పైసా విడుదలైందా అని ప్రశ్నిస్తున్నారు సీఎం చంద్రబాబునాయుడు. గత ఐదేళ్లు సరే అంతకు ముందు ఐదేళ్లు రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు పాలించలేదా? అప్పుడు రాయలసీమ ప్రాజెక్టులపై ఎందుకు ప్రేమ చూపలేకపోయారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని దిగిపోయే ముందు అప్పటి సీఎం వైఎస్ జగన్ నీళ్లు వదలకుండానే ప్రారంభించారు. ఎంత దారుణమంటే నీళ్లు వదలకుండా ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు? ఈ లాజిక్ చాలు పాలకులు ఎంత తెలివైన వారో చెప్పటానికి. వెలిగొండ ప్రాజెక్టుకు మొదట చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దానిని 80శాతం పూర్తి చేశారు. తర్వాత కె రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్ లు పరిపాలించారు. 15 ఏళ్లలో వెలిగొండ ఏ ఒక్కరికీ పట్టలేదు. ఎట్టకేలకు ఆరు నెలల క్రితం జగన్ ప్రాజెక్టును పూర్తి చేశాననిపించారు.
ప్రాజెక్టు పూర్తయితే వరద నీరు శ్రీశైలం నుంచి ఎందుకు వెలిగొండ ప్రాజెక్టు ట్యాంకు నింపలేకపోయారు. కారణాలు సీఎం చంద్రబాబునాయుడు చెప్పాల్సి ఉంటుంది. ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్షల మందికి తాగు నీరు అందించే ప్రాజెక్టు ఇది. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలు వెలిగొండతో సస్యశ్యామలం అవుతాయి. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం పూర్తిగా జల కళను సంతరించుకుంటుంది. లక్షల క్యూసెక్స్ నీరు సముద్రం పాలైంది. వెలిగొండ ప్రాజెక్టు మాత్రం అలాగే నీటి కోసం నోరెళ్లబెట్టుకుని ఉంది.
ప్రకాశం బ్యారేజీ నుంచి జూన్ 1 నుంచి సెప్టెంబరు 13 వరకు 647 టిఎంసీల నీరు సముద్రంలోకి వదిలారు. శ్రీశైలం నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికీ బ్యారేజీ నుంచి వరద నీరు సముద్రంలోకి వదులుతూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 క్యూసెక్కులు. కానీ ఇన్ని రోజులుగా గరిష్టంగా 30,000 క్యూసెక్కులను మాత్రమే తరలించారని ప్రముఖ దినపత్రికలు ప్రచురించాయి. ఎందుకు గరిష్ట స్థాయిలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తరలించలేక పోయారో ప్రజలకు పాలకులు చెప్పాల్సిన అవసరం ఉంది. నీటిని గరిష్ట స్థాయిలో తీసుకోవాలంటే కాలువలు, ఇతర కట్టడాలు సక్రమంగా ఉండాలి. పటిష్టంగా ఉంటేనే నీటిని పూర్తి స్థాయిలో తరలించేందుకు వీలు ఉంటుంది. అటువంటి వ్యవస్థను ప్రభుత్వాలు నీరు కార్చాయి. అందుకే పాలకులు మాట మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో నీటి నిల్వ సామర్థ్యం 18 టిఎంసీలు. నేటి వరకు కూడా 4.18 టీఎంసీల కంటే ఎక్కువ తరలించలేదు. 78 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న సోమశిల రిజర్వాయరుకు 50 టీఎంసీలు, 68 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న కండలేరు రిజర్వాయరుకు కేవలం 13.68 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఎందుకు ఇలా జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్సార్బీసీ) ప్రాజెక్టులో ప్రధాన రిజర్వాయర్ గోరకల్లు. దాని గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 12.44 టీఎంసీలు. కానీ, 8.39 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు. అలాగే, అవుకు రిజర్వాయరు నిల్వ సామర్థ్యం 4.15 టీఎంసీలు. అయితే, 2.9 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలిగారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్స్. అలాంటప్పుడు 1,650 క్యూసెక్స్ మాత్రమే ఎందుకు తరలిస్తున్నారు?
కేవలం ప్రాజెక్టులను చిన్న చూపు చూడటం, దూర దృష్టి లేకపోవడమే ప్రధాన కారణమని, తాత్కాలిక పథకాలు పెట్టి ప్రజలను మభ్య పెట్టి కాలం గడపటం, పదవుల్లో ఉన్నంత కాలం గొప్పలు చెప్పుకోవడం తప్ప శాశ్వత ప్రజా ప్రయోజనాలు పాలకులు చేపట్టటం లేదు. ఇందులో ఎవరి స్వార్థం వారికి ఉంది. తాత్కాలిక పథకాల కంటే శాశ్వత పథ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి ప్రజల మంచిని చూడాలని ప్రజలు అడగటం లేదు. అందుకే పాలకులు కూడా ఆ ప్రజలకు తత్కాలిక తాయిలాలు పెట్టి సర్దుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎంత కాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.
రాయలసీమ ప్రాజెక్టుల్లో వరద నీరును నింపడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక అధ్యక్షులు టి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు సంభవిస్తోందని, ప్రధానంగా రాయలసీమలో ఈ పరిస్థితులు రావడానికి ఇప్పటి వరకు పరిపాలించిన వారంతా కారణమేనన్నారు. రాయలసీమకు కావాల్సిన వనరులు ఉన్నాయి. కళ్ల ముందే నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో కిందకు వెళ్లి సముద్రంలో కలిసింది. ఇది అందరికీ కనిపించే సత్యం. దీనిని ఎవ్వరూ కాదనలేరు. నీటి వినియోగం అనేది ఒక పెద్ద వ్యవస్థ. దానిని నిర్లక్ష్యం చేస్తే ఎలాగని ఆయన ప్రశ్నించారు. నేడు నాగార్జున సాగర్ వంటి పెద్ద ప్రాజెక్టు కాలవల కింద పనిచేసే లస్కర్ లు లేకుండా పోయారు. ఆ పోస్టులు ఫిలప్ చేయడం లేదు. కాలువలపై సూపర్ వైజర్లు లేరు. అందువల్ల నీటి తగాదాలు వస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ కాలువలకు గండ్లు పడుతున్నాయి. మెయింటెనెన్స్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, సాగు నీటి వ్యవస్థను పటిష్టం చేసి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన అన్నారు.