ట్రావెల్ బ్యాన్ ఎన్నిరకాలో తెలుసా ?
ట్రావెల్ బ్యాన్ అంటే పౌరుల ప్రయాణాలపై ఆయా దేశాల ప్రభుత్వాలు విధించే నిషేధాన్నే ట్రావెల్ బ్యాన్ అనంటారు;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అధ్యక్షుడు అయినదగ్గర నుండి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచదేశాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. ట్రంప్ తీసుకున్న అలాంటి నిర్ణయాల్లో తాజా నిర్ణయం ఏమిటంటే ట్రావెల్ బ్యాన్(Travel Ban). 41 దేశాల్లోని పౌరులు అమెరికా(America)లోకి అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించాలని ట్రంప్(America President Donald J Trump) నిర్ణయించారు. అయితే తన నిర్ణయం ఇంకా అధికారికం కాలేదు, పార్లమెంటు ఆమోదం పొందలేదు. అందుకనే అధికారికంగా ట్రావెల్ బ్యాన్ పై ఉత్తర్వులు జారీకాలేదు. ట్రంప్ ఆలోచనల ప్రకారం ట్రావెల్ బ్యాన్ ఎదుర్కోబోతున్న దేశాలు మూడు గ్రూపులుగా ఉండబోతున్నాయి. అవేమిటంటే మొదటి గ్రూపులో ఆప్ఘనిస్ధాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి పది దేశాలున్నాయి. ఈ దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా పూర్తిగా నిషేధం విధించబోతున్నారు.
రెండో గ్రూపులో ఎరిట్రియా, హైతీ, లావోస్, మయున్మార్, దక్షిణ సూడాన్ దేశాలున్నాయి. ఈ దేశాలనుండి అమెరికాలో చదువుకోవాలని అనుకుంటున్న విద్యార్ధులు, పర్యాటకులకు మాత్రమే వీసాలు జారీచేయాలని నిర్ణయించారు. మూడో గ్రూపులో పాకిస్ధాన్, భూటాన్ సహా 26 దేశాలున్నాయి. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోకపోతే పౌరులను అమెరికాలోకి పాక్షికంగా రాన్నివ్వకూడదని ట్రంప్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికైతే లోపాలు అంటే ఏమిటో క్లారిటిలేదు. చైనా(China) నుండి వచ్చే విద్యార్ధులకు అమెరికాలో చదువుకునే వీలు లేకుండా బ్యాన్ పెట్టాలని ఎప్పటినుండో రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. భద్రతాపరమైన కారణాలతో చైనా విద్యార్ధులను అమెరికాలోకి రానీయకూడదని చాలామంది ఎంపీలు కోరుతున్నారు. చైనా విద్యార్ధులను అమెరికాలోకి రానివ్వటం ద్వారా సైన్యంపై నిఘా, మేథోసంపత్తి హక్కుల చౌర్యానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఎంపీలు మొత్తుకుంటున్నారు.
ట్రంప్ తాజా నిర్ణయం నేపధ్యంలో అసలు ‘ట్రావెల్ బ్యాన్’ అంటే ఏమిటనే విషయమై చర్చ మొదలైంది. ట్రావెల్ బ్యాన్ అంటే పౌరుల ప్రయాణాలపై ఆయా దేశాల ప్రభుత్వాలు విధించే నిషేధాన్నే ట్రావెల్ బ్యాన్ అనంటారు. ట్రావెల్ బ్యాన్ అన్నది చాలా రకాలుగా ఉంటుంది. భౌగోళిక పరిస్ధితులు, యుద్ధ నేపధ్యం, అంటువ్యాధుల నియంత్రణ, వాతావరణ పరిస్ధితుల ఆధారంగా కూడా బ్యాన్ విధించవచ్చు. ట్రావెల్ బ్యాన్ అన్నది తాత్కాలికం కావచ్చు లేదా దీర్ఘకాల, శాశ్వత బ్యాన్ కూడా కావచ్చు. అంటువ్యాధుల నిరోధానికి విధించే ట్రావెల్ బ్యాన్ కు ఉదాహరణ కోవిడ్-19(Covid-19). కోవిడ్ సమస్యను కంట్రోల్ చేయటానికి చాలాదేశాలు అప్పట్లో హెల్త్ బ్యాన్ విధించాయి. ఎందుకంటే ప్రయాణీకులు ఒక దేశంనుండి మరోక దేశానికి ప్రయాణించే నేపధ్యంలో కోవిడ్ వైరస్ ను ఎక్కడ తీసుకువస్తారో అన్న ఆందోళనతో కోవిడ్ ప్రబలంగా ఉన్న కాలంలో చాలా దేశాలు ట్రావెల్ హెల్త్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.
కోవిడ్ వైరస్ కు కేంద్రమైన చైనా నుండి ఎవరుకూడా తమ దేశాల్లోకి అడుగుపెట్టేందుకు లేదని చాలా దేశాలు ట్రావెల్ హెల్త్ బ్యాన్ విధించాయి. దాదాపు రెండేళ్ళు ట్రావెల్ హెల్త్ బ్యాన్ ను చాలా దేశాలు పాటించాయి. యుద్ధపరమైన ట్రావెల్ బ్యాన్ కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తన పౌరులను ఇతర దేశాల్లో ప్రయాణించకుండా అమెరికా 1939లో వార్ ట్రావెల్ బ్యాన్ విధించింది. ప్రస్తుతంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరగుతున్న విషయం తెలిసిందే. సైన్యాన్ని పెంచుకునేందుకు ఉక్రెయిన్(Ukraine) ప్రభుత్వం 18-60 సంవత్సరాల మధ్య ఉన్నమగవాళ్ళని దేశం విడిచి వెళ్ళకుండా వార్ ట్రావెల్ బ్యాన్ విధించింది. ఎందుకంటే రష్యా(Russia)తో యుద్ధంలో ఇప్పటికే లక్షలమంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. యుద్ధంలో పాల్గొనేందుకు మగవాళ్ళు అవసరం కాబట్టి 18-60 మధ్య వయసు వాళ్ళు దేశం విడిచిపెట్టకుండా వార్ ట్రావెల్ బ్యాన్ విధించింది ప్రభుత్వం. ఈయుద్ధాన్ని దృష్టిలో పెట్టుకునే యురోపియన్ యూనియన్ దేశాల ప్రభుత్వాలు తమపౌరులను రష్యాలో పర్యటించకుండా ట్రావెల్ బ్యాన్ విధించాయి.
రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఉండే దౌత్య సంబంధాల ఆధారంగా పౌరుల రాకపోకలు సాగుతుంటాయని అందరికీ తెలిసిందే. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపధ్యంలో రెండు దేశాల మధ్య పౌరుల ప్రయాణంపై రెండు దేశాల ప్రభుత్వాలు నిషేధం విధిస్తాయి. దీనికి ఉదాహరణ దక్షిణకొరియా-ఉత్తరకొరియాల మధ్య ఉన్న డిప్లొమాటిక్ ట్రావెల్ బ్యానే. పై రెండు దేశాల మధ్య సంబంధాలు బాగాలేవు కాబట్టే పౌరుల రాకపోకలను రెండు ప్రభుత్వాలూ చాలా దశాబ్దాల క్రితమే నిషేధించాయి. ఇక వాతావరణ పరిస్ధితుల నేపధ్యంలో ట్రావెల్ బ్యాన్ పెట్టచ్చు. ఇలాంటి ట్రావెల్ బ్యాన్ ప్రధానంగా రెండు దేశాల మధ్యకన్నా దేశంలోని అనేక ప్రాంతాల్లోని వాతావరణ పరిస్ధితులపై స్ధానిక ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయి. ఉదాహరణకు శీతాకాలంలో మనదేశంలోని భద్రినాధ్(Bhadrinadh Temple) ఆలయం. భద్రినాధ్ ఆలయాన్ని శీతాకాలంలో ఆరుమాసాలు మూసేస్తారు. ఎందుకంటే దట్టమైన మంచుతో దేవాలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూరుకుపోతాయి. ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచుప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణీకులను రావద్దని స్ధానిక మున్సిపాలిటీ ముందుజాగ్రత్తగా ప్రకటిస్తుంది. ఇప్పటివరకు ట్రావెల్ బ్యాన్ ఎక్కువగా కోవిడ్-19, రెండో ప్రపంచ యుద్ధం, ఇరాన్-ఇరాక్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి పరిస్ధితుల్లోనే కనబడుతున్నాయి. మరి ట్రంప్ ఆలోచనల్లో ట్రావెల్ బ్యాన్ చట్టం అయితేకాని పూర్తి వివరాలు తెలియవు.