కరీంనగర్ ఎంఎల్సీ ఎన్నికలో చెల్లని ఓట్లు ఎవరికొంప ముంచేస్తుందో ?

గ్రాడ్యుయేషన్ చేసిన ఓటర్లలో సుమారు 40 వేలమంది ఓట్లు చెల్లకుండాపోయాయంటే(Invalid Votes) అర్ధమేంటి ?;

Update: 2025-03-04 09:50 GMT

ఎన్నికల్లో గెలవటానికే అందరు పోటీచేస్తారు. గెలుపుకోసం ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతారు. నామినేషన్లు వేసిన దగ్గర నుండి పోలింగ్ ముగిసేవరకు అభ్యర్ధులందరు ఎవరితోచిన వ్యూహాలను వాళ్ళు అనుసరిస్తారు. పోలింగ్ తర్వాత ఎవరి అంచనాలకు తగ్గట్లుగా వాళ్ళు గెలుపోటముల్లో ఒక అంచనాకు వస్తారు. అయితే అభ్యర్ధుల గెలుపోటములకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు కాకుండా సంబంధంలేని మరో కోణం కారణమైతే ? ఇపుడీ విషయమే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్ధులను వణికించేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఓట్లలెక్కింపు జరుగుతోంది. ఫలితం తేలేటప్పటికి బహుశా బుధవారం మధ్యాహ్నం అవుతుందేమో.

పోటీలో 56 మంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీమాత్రం కాంగ్రెస్(Congress) అభ్యర్ధి వూటుకూరి రవీంద్రరెడ్డి, బీజేపీ(BJP) అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ(BSP) తరపున పోటీచేసిన ప్రసన్న హరికృష్ణ మధ్యే అని టాక్ వినబడుతోంది. ఇపుడు విషయం ఏమిటంటే వీళ్ళ ముగ్గురు కూడా ఒక విషయంలో వణికిపోతున్నారట. ఏ విషయంలో అంటే చెల్లని ఓట్ల విషయంలో. అవును, వినటానికి విచిత్రంగానే ఉన్నా చెల్లనిఓట్లే తమ గెలుపును ఎక్కడ దెబ్బతీస్తుందో అనే టెన్షన్ ముగ్గురు అభ్యర్ధుల్లో పెరిగిపోతోందని సమాచారం. పై నాలుగు జిల్లాల పరిధిలోని ఎంఎల్సీ(MLC Counting) నియోజకవర్గంలో 3.56 లక్షల ఓట్లున్నాయి. ఇందులో పోలైంది 2.5 లక్షలు మాత్రమే. అంటే ఉన్న ఓటర్లలో 1.06 లక్షలమంది ఓటింగుకే రాలేదు. పోలైన 2.5 లక్షల ఓట్లలో కూడా చెల్లని ఓట్లు సుమారు 40 వేలున్నాయని తెలిసింది. 40 వేల ఓట్లు చెల్లనివి అంటే చాలా చాల ఎక్కువ.

ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది ఏమిటంటే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో ఓట్లు వేయాల్సింది గ్రాడ్యుయేట్లు మాత్రమే. గ్రాడ్యుయేట్లు అంటేనే చదువుకున్న వారని అర్ధమవుతోంది. మరి గ్రాడ్యుయేషన్ చదివిన వారికి కూడా ఓట్లేయటం రాదా ? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వైరలవుతోంది. అక్షరజ్ఞానం లేనివాళ్ళు లేదా అంతంతమాత్రంగా చదువుకున్న వాళ్ళుకూడా తమఓట్లను జాగ్రత్తగా వేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో గ్రాడ్యుయేషన్ చేసిన ఓటర్లలో సుమారు 40 వేలమంది ఓట్లు చెల్లకుండాపోయాయంటే(Invalid Votes) అర్ధమేంటి ? ఇన్నివేలమందికి ఓటు ఎలావేయాలో తెలీదా ? ఓట్లు వేయటంలో అధికార యంత్రాంగం సరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదా ? లేకపోతే అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చని కారణంగానే ఇన్నివేలమంది తమ ఓట్లు చెల్లుబాటు కాకుండా చేసుకున్నారా ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి.

40 వేల ఓట్లు చెల్లకపోవటంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చెల్లనిఓట్లు తమలో ఎవరిమీద తీవ్ర ప్రభావం పడుతుందో అర్ధంకాక ప్రధాన పార్టీల అభ్యర్ధులు ముగ్గురిలోను టెన్షన్ పెరిగిపోతోంది. చెల్లని ఓట్ల విషయమై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar babu) ఉన్నతాధికారులను ఆరాతీశారు. 40 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. చదువుకున్న వారికి కూడా ఓట్లు ఎలాగ వేయాలో తెలీకపోవటం విచారకరమని మంత్రి మీడియాతో అన్నారు. చెల్లని ఓట్లలో బ్యాలెట్ పేపర్ల మీద కొందరు టిక్కులు పెట్టారు. మరికొందరు ఏవేవో రాతలు రాశారు. ఇంకొందరు బ్యాలెట్ పేపర్ను తిరగేసి ఏవో అంకెలు రాశారు. ఇంకొంతమంది ఓటర్లు ఒకరికిన్నా ఎక్కువమంది అభ్యర్ధులకు ఒకే ప్రాధాన్యత సంఖ్యను వేశారు. ఏమి చేసినా ? ఏమి రాసినా ? చెల్లని ఓట్లు 40 వేలంటే చాలా చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ చెల్లనిఓట్లే ఎవరి కొంపలుముంచుతాయో అర్ధంకాక అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Tags:    

Similar News