విశాఖలో విభిన్న వాతావరణం!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేపథ్యంలో విశాఖలో భిన్న వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది.

Update: 2025-10-28 05:09 GMT
విశాఖలో మంగళవారం ఉదయం ఎండ కాస్తున్న దృశ్యం

మొంథా తుఫాన్‌ వేళ విశాఖలో విభిన్న వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం వానకు బదులు ఎండతో సూర్యోదయం అయింది. సోమవారం నాడు మధ్య మధ్యలో కాస్త విరామం ఇచ్చినా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వైజాగ్‌ 10 సెం.మీలకు పైనే వర్షపాతం నమోదైంది. దీంతో తుపాను తీరానికి మరింత చేరువవుతున్న తరుణంలో మంగళవారం ఉదయం ఎలా తెల్లవారుతుందోనని వైజాగ్‌ వాసులు ఉత్కంఠతో చూశారు. అయితే అందుకు భిన్నంగా ఉదయం ఆరు గంటలకే మేఘాలను చీల్చుకుంటూ భానుడు బయటకు వచ్చాడు. మామూలు రోజులకంటే ఒకింత ముందుగానే దర్శనమిచ్చినట్టు కనిపించాడు. అలా ఉదయం ఆరు నుంచి ఏడున్నర గంటల వరకు సూర్యుడు తుపాను గురించి ఏమీ తెలియనట్టు కిరణాలను వెదజల్లాడు.


విశాఖలో మంగళవారం ఉదయం ఎండ కాస్తున్న దృశ్యం

ఆస్వాదించిన వైజాగ్‌ వాసులు..
ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని వైజాగ్‌ వాసులు ఎంతగానో ఆస్వాదించారు. ఇంతలో అప్పటి వరకు కొండలపై విశ్రాంతి తీసుకుంటున్న తెల్లని బెడగొండల్లాంటి దట్టమైన మేఘాలు వేగంగా వచ్చి సూర్యుడిని కమ్మేశాయి. దీంతో చిమ్మచీకట్లు›్ల కమ్ముకున్న కొంతసేపటికే మళ్లీ వాన జోరందుకుంది. వానకు బలమైన ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఈ రెండూ పోటాపోటీగా ప్రతాపం చూపడం మొదలెట్టాయి. ఇలా ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగి మళ్లీ విశ్రమించాయి. దీంతో నగర వాసులు దైనందిన కార్యక్రమాలకు వీలు కలిగింది. మంగళవారం సాయంత్రానికి గాని రాత్రికి గాని మొంథా తుఫాన్‌ కాకినాడకు చేరువలో తీరాన్ని దాటనుంది. అలా తుపాను తీరానికి సమీపించే కొద్దీ వర్షం, పెనుగాలుల ఉధృతి మరింతగా పెరగనుంది. తుఫాన్‌ తీరాన్ని దాటే సమయంలో ఉత్తర కోస్తాంధ్రలో గరిష్టంగా 20 సెం.మీల వరకు వర్షపాతం నమోదవుతుందని, గంటకు 90–110 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే స్పష్టం చేసింది.

విశాఖ ఆర్కే బీచ్‌ బస్టాప్‌ వద్ద కురుస్తున్న వర్షం

Tags:    

Similar News