మన ఆంధ్ర.. ఎన్ని రాజవంశాలకు నిలయమో..!
చరిత్రలో మనకు తెలియని ఎన్నో ప్రసిద్ధి గాంచిన రాజవంశాలు ఆంధ్రలోనే కొలువై ఉన్నాయి. వాటిలో ఎన్నో రాజవంశాల గురించి ఆంధ్రుల్లో కూడా చాలా మందికి తెలియదు. అవి ఏవంటే..
By : S Subrahmanyam
Update: 2024-04-15 04:20 GMT
ఏ దేశం గురించి తెలియాలన్నా ఆ దేశ చరిత్ర చదవాల్సిందే. కానీ ప్రపంచంలో అత్యంత లోతైన, పురాతన చరిత్ర ఉన్న దేశాల్లో మన భారతదేశం తొలి స్థానంలో ఉంటుంది. మన దేశ చరిత్ర ఒక అక్షయ తుణీరం లాంటిదే. చదివే కొద్దీ వస్తుంది. తెలుసుకునే కొద్దీ కొత్త విషయాలను నేర్పుతుంది. అటువంటి భారత దేశ చరిత్రలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలను సాధించికున్న ఎన్నో రాజవంశాలకు మన ఆంధ్రప్రదేశ్ నిలయం అన్న విషయం ఎంతమందికి తెలుసు. ఆంధ్రలో కొలువైన శాతవాహనులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం గురించి ఎంతో మందికి తెలుసు. సినిమాల ద్వారా కూడా ఈ రాజవంశాల గురించి నేటి తరానికి తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా మరెన్నో పరాక్రమవంతమైన రాజవంశాలకు ఆంధ్ర నిలయంగా ఉన్నదని తెలుసా.. వాటిలో..
అస్సాకా: ఇది భారతదేశంలోని అతి పురాతన తెలుగు రాజవంశాలలో ఒకటి. ఇది BCE 700-300 మధ్య భారతదేశంలో ఉన్న 16 మహాజానపదాలలో ఒకటిగా ఉంది. ఈ సామ్రాజ్యం గోదావరి, మంజీర నదుల మధ్య కొలువై ఉండేది. వాస్తవానికి వింధ్య పర్వతాలు దక్షిణాన ఉన్న ఏకైక మహాజానపదం కూడా ఇదే. ఈ సామ్రాజ్య రాజధాని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజామాబాద్‌లోని బోధన్ అని నమ్మతారు చరిత్రకారులు.
ఆంధ్ర ఇక్ష్వాకులు: వీరి సామ్రాజ్యం ప్రధానంగా కృష్ణా-గుంటూరు-నల్గొండ ప్రాంతంలో కృష్ణా-గోదావరి నదుల వెంట ఉండేది. ప్రస్తుతం నాగరాజుకొండ అయిన విజయపురి రాజధానిగా పాలన కొనసాగించారు. అంతేకాకుండా వీరిని కల్పిత ఇక్ష్వాకుల వారని కూడా నమ్ముతారు. వీరు ప్రధానంగా BCE 2వ శతాబ్దంలో పరిపాలన చేశారు.
ఆనంద గోత్రికులు: ఈ రాజవంశీకులు కూడా ఆంధ్రను పరిపాలించారు. వీరు ప్రస్తుతం ఆంధ్రలోని గుంటూరు జిల్లాలో ఉన్న కపోతపురం నుంచి 335-425 CE కాలంలో కోస్తా ఆంధ్రను పరిపాలించారు. ఆకాలంలో వారు ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు.
శాలంకాయనులు: ఈ రాజవంశీకులు 300-400 CE మధ్య కాలంలో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని పేదవేగి (అప్పట్లో వేంగి) నుంచి ఆంధ్రను పరిపాలించారు. ఈ రాజవంశీకులు ప్రాథమికంగా బ్రాహ్మణులు. వారి గోత్ర నామం ‘నంది’ని సూచిస్తుంది. వారి కాలంలోనే తెలుగు భాషకు విలక్షణ లిపి లభించింది. అప్పటి నుంచి తెలుగు భాష వినియోగంలోకి రావడం ప్రారంభించింది.
విష్ణుకుండినులు: ఏడీ 420-624 మధ్య ఉన్న పెద్ద రాజ్యాలలో వీరిది కూడా ఒకటి. దీని గురించి తెలుగు రాష్ట్రాల వెలుపల అతి తక్కువగా తెలుసు. వీరు మొదట ఏలూరు రాజధానిగా పరిపాలించారు. ఆ తర్వాత తమ రాజధానిని అమరావతికి తరలించారు. ఈ రాజవంశం చాళుక్యుల రాజు రెండో పులకేశి ఆక్రమణలో ముగిసింది. విష్ణుకుండినుల రాజవంశంలో రెండవ మాధవ వర్మ గొప్ప పాలకుడిగా పేరుగాంచారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం కోస్తా ఆంధ్రలో వీరి సామ్రాజ్యం విస్తరించింది. విష్ణుకుండినులు.. కళ, వాస్తు శిల్ప కళను గొప్పగా పోషించారు. వీరి పరిపాలన అద్భుతంగా ఉండేదని పేరు. విజయవాడ సమీపంలోని ప్రసిద్ధి చెందిన ఉండవల్లి గుహలు వీరి కాలంలోనే నిర్మించబడ్డాయి. రెండో మాధవ వర్మ.. అశ్వమేధ, రాజసూయ యాగాలను కూడా నిర్వహించారు.
తూర్పు చాళుక్యులు: ఈ సామ్రాజ్యం బాదామి చాళుక్యుల నుంచి ఉద్భవించింది. ఈ సామ్రాజ్యాన్ని వేంగి రీగన్ గవర్నర్‌గా ఉన్న పులకేశిన్ సోదరుడు విష్ణువర్థన్ స్థాపించారు. వారు ఏడీ 624-1189 మధ్య కాలంలో నేరుగా ఆంధ్రను పరిపాలించారు. వీరి వంశాన్ని చంద్ర రాజవంశంగా పేర్కొన్నారు. వారు వేంగి, రాజమహేంద్రవరం(రాజమండ్రి) నుండి తమ పరిపాలనను చేశారు. మహాకవి నన్నయ.. ఆంధ్ర మహాభారతము మొదటి భాగమును రచించడంతో వీరి కాలంలోనే తెలుగు సాహిత్యం వచ్చింది. ప్రస్తుతం ప్రపంచమంతా ప్రసిద్ది చెందిన ద్రాక్షారామం, భీమారామం(సామల్‌కోట్)లోని శైవక్షేత్రాలను వీరి కాలంలోనే నిర్మించారు. వాటితో పాటు బిక్కవోలు దేవాలయాలు కూడా వీరి కాలంలోనే నిర్మించబడ్డాయి.
కోట వంశం: వీరు క్రీస్తు శకం 9-12 శతాబ్దాల మధ్య కాలంలో కృష్ణా, పెన్నా నదుల మధ్య గుంటూరు, వెలనాడు ప్రాంతాలను పాలించారు. వారి గురించి చరిత్ర కారులు కూడా పెద్దగా ఏ విషయాలను కనుగొనలేకపోయారు. అందుకు వారు తమ పాలన, రాజ్యానికి సంబంధించి ఎటువంటి శిలాఫలకాలు, గ్రంథాలను రచించకపోవడమే ప్రధాన కారణమని కొందరు చరిత్రకారులు పేర్కొంటారు. కానీ ఇప్పటివరకు ఈ రాజ వంశానికి సంబంధించి కొత్త అంశాలేవీ తెలియలేదు.
చాగిస్: వీరు తాము సూర్యవంశ క్షత్రీయులమని చెప్పుకుంటారు. వీరు ప్రధానంగా దక్షిణ కోస్తా ఆంధ్రలో నెల్లూరు, కృష్ణా జిల్లాల మధ్య పాలన కొనసాగించారు. వారు గుడిమెట్ట(ప్రస్తుత ప్రకాశం), వినుకొండ(గుంటూరు) రాజధానులుగా పరిపాలన చేశారు. వీరు దాదాపు 350 సంవత్సరాలు పాలించారు. వారికి సొంత కరెన్సీ కూడా ఉండేది. చాగిస్ రాజవంశీయులు పల్నాడులోని కాకతీయులు, హైహేయులతో పొత్తులు కూడా పెట్టుకున్నారు.
వెలనాటి చోళులు: ఈ రాజవంశీకులు 11-13వ శతాబ్ద కాలంలో పాలన కొనసాగించారు. వీరు చోళులు, పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉండే వారు. ప్రధానంగా గోదావరి-కృష్ణా ప్రాంతాన్ని పాలించారు. వారు ఆ ప్రాంత సంస్కృతిని కూడా గణనీయంగా ప్రభావితం చేశారు. అన్ని రకాల కళలను విశేషంగా పోషించిన రాజవంశీకులు వీరు.
రావెళ్ళ నాయకులు: వీరు విజయనగర సామ్రాజ్య సామంతులు. ఈ సామ్రాజ్యం ముసునూరి కపీనీడు కింద పనిచేసిన నాయకులతో రూపొందించబడింది. వారు విజయనగర సామ్రాజ్య సైన్యంలోని అత్యుత్తమ యోధులుగా పరిగణించబడే వారు. విజయనగర సామ్రాజ్యం చేసిన అనేక యుద్ధాలలో విజయం తీసుకురావడంలో వీరు కీలక పాత్ర పోషించారు.
సాయపనేని నాయకులు: వీరు 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి విశేష సేవలందించారు. వీరు 37 కమ్మ నాయక వంశాలలో ఒకరు. వీరు ప్రధానంగా దూపాటి సీమ నుంచి పాలించారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత వీరు కూడా కనుమరుగయ్యారు.
పెమ్మసాని నాయకులు: వీరు గండికోట నుంచి పాలన కొనసాగించారు. గొప్ప యోధుల వంశాలలో వీరు కూడా ఒకరు. పెమ్మసాని నాయకులు 14-17 శతాబ్దాల మధ్య పాలించారు. యుద్దరంగంలో పరాక్రమాన్ని కనబరచడంలో వీరు పేరుగాంచారు. వీరు విజయనగర సామ్రాజ్యంలో సేనాధిపతులుగా సేవలు అందించారు. వీరిలో పెమ్మసాని రామలింగ నాయకులు గొప్ప నాయకుడిగా అందరి మన్ననలు పొందారు. రాయచూర్‌లో చేసిన యుద్ధంలో శ్రీ కృష్ణ దేవరాయల సైన్యానికి ఎన్నడూ లేని గొప్ప విజయాన్ని అందించారు. 1652లో జరిగిన గండికోట యుద్ధం తర్వాత వీరి సామ్రాజ్యం పతనమైంది.
సూర్యదేవర నాయకులు: యుద్ధ రంగంలో పరాక్రమాన్ని చూపించడంలో ఎవరైనా వీరి తర్వాతే అనే విధంగా వీరు యుద్ధ కళల్లో నైపుణ్యాన్ని సాధించారు. ఈ రాజవంశీకులు గుంటూరులోని రేపల్లె నుంచి పాలన కొనసాగించారు. వీరు కూడా విజయనగర రాజ్యానికి సేవలందించిన వారే. విజయనగర సామ్రాజ్యం కోసం ఎన్నో యుద్ధాల్లో తలపడి విజయాలను సాధించారు. గజపతి రాజులపై శ్రీ కృష్ణ దేవరాయలు చేసిన యుద్ధంలో వీరి పాత్ర అత్యంత కీలకం. తళ్ళీకోట యుద్ధం తర్వాత వీరి ప్రభావం తగ్గుముఖం పట్టింది.
రెడ్డి రాజవంశం: ఆంధ్రలో పరిపాలన కొనసాగించిన పెద్ద రాజవంశాలలో ఇది కూడా ఒకటి. ఈ రాజవంశం గురించి తెలుగు రాష్ట్రాల బయట అంతగా తెలియదు. వీరు 1325-1448 మధ్య పాలించారు. ఈ రాజవంశాన్ని ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించారు. వారు ప్రధానంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. వీరి సామ్రాజ్యం ఉత్తరాన కటక్ నుంచి దక్షిణాన కంచి వరకు, శ్రీశైలం వరకు కూడా వ్యాపించింది. ఆ తర్వాత రాజధానిని కొండవీడు, రాజమండ్రికి మార్చారు. రెడ్డి రాజులు.. గుంటూరు జిల్లాలోని కొండవీడులో, కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో శత్రు దుర్భేద్యమైన రెండు కోటలను నిర్మించారు. ఆ తర్వాత వారు విజయనగర సామ్రాజ్య నియంత్రణలోకి వెళ్లారు. ప్రోలయ వేమారెడ్డి తన కాలంలో కోస్తాంధ్ర అంతటా బ్రాహ్మణుల కోసం అనేక అగ్రహారాలను నిర్మించారు. అహోబిలంలో ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించిన వారు కూడా ఈ వీరే. వీరి కాలంలో తెలుగు, సంస్కృత భాషలకు విశేష ప్రాముఖ్యత ఉండేది. ప్రసిద్ధి చెందిన ఎర్రాప్రగ్గడ, శ్రీనాథ, పోతన కవులు వీరి కాలంలోని వారే.