Gaddar awards in Tollywood|గద్దర్ కు ‘టాలీవుడ్’ తలొంచిందా ?
ఉత్తమచిత్రాలకు, ఫీచర్ ఫిల్ములు, బాలల చిత్రాల్లో బెస్ట్ అనిపించుకున్న సినిమాలకు, నటీనటులకు గద్దర్ అవార్డులు అందుకోవటానికి తెలుగుచిత్ర పరిశ్రమ అంగీకరించింది;
మొత్తానికి ప్రజాగాయకుడు గద్దర్ కు టాలీవుడ్ తలొంచినట్లయ్యింది. ఉత్తమచిత్రాలకు, ఫీచర్ ఫిల్ములు, బాలల చిత్రాల్లో బెస్ట్ అనిపించుకున్న సినిమాలకు, నటీనటులకు గద్దర్ అవార్డులు అందుకోవటానికి తెలుగుచిత్ర పరిశ్రమ అంగీకరించింది. గద్దర్(Gaddar awards) అవార్డులకు సంబంధించిన మీటింగ్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి గద్దర్ అవార్డుల కమిటి ఛైర్మన్, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గద్దర్ కు టాలీవుడ్(Tollywood) తలొంచింది అన్నది ఎందుకంటే చాలాకాలం గద్దర్ అవార్డుల బహుకరణపై స్పందించటానికి కూడా సినీప్రముఖులు ఇష్టపడలేదు. ఆమధ్య రేవంత్ రెడ్డి ఒక బహిరంగసభలో మాట్లాడుతు నంది అవార్డుల పేరుతో ఇస్తున్న అవార్డులను ఇకనుండి గద్దర్ అవార్డుల పేరుతో ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అవార్డులను నంది పేరునుండి గద్దర్ పేరుకు మార్చే విషయమై సినీప్రముఖుల స్పందనను తెలియజేయాలని రేవంత్(Revanth) కోరినా ఎవరూ స్పందించలేదు.
గద్దర్ అవార్డుల బహుకరణ విషయంలో రేవంత్ ప్రకటనపై స్పందించటానికి కూడా చాలామంది టాలీవుడ్ ప్రముఖులు ఇష్టపడలేదు. నందిఅవార్డుల పేరును గద్దర్ అవార్డుల పేరుతో బహుకరించటాన్ని చాలామంది సినీప్రముఖులు అంగీకరించలేకపోయారు. ఈవిషయంలో అభిప్రాయాలు చెప్పమని రేవంత్ అడిగినా ఎవరూ నోరిప్పలేదు. అంటే తమ అయిష్టాన్ని నోటితో చెప్పకుండా మౌనంతోనే చెప్పారని అర్ధమవుతోంది. అయితే ఈ విషయంలో రేవంత్ కూడా ఏమీమాట్లాడలేదు. ఈనేపధ్యంలోనే పుష్పసినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరగటం, ఒకమహిళ మరణించగా ఆమెకొడుకు కోమాలోకి వెళిపోవటం అందరికీ తెలిసిందే. ఈఘటనకు కారకుడైన అల్లుఅర్జున్ పై పోలీసులు కేసునమోదుచేయటమే కాకుండా అరెస్టుచేసి కోర్టు ద్వారా రిమాండుకు పంపారు.
పనిలోపనిగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుండవని, సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు కూడా కుదరదని రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. రేవంత్ ప్రకటనదెబ్బకు మొత్తం సినీపరిశ్రమంతా ఉలిక్కిపడింది. బెనిఫిట్, ప్రీమియర్ షోలు లేకపోయినా, టికెట్లరేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతించకపోతే పెద్దసినిమాలు దెబ్బతినేయటం ఖాయం. దాంతో వాళ్ళల్లో వాళ్ళు కూడబలుక్కుని అత్యవసరంగా రేవంత్ తో భేటీకి తయారయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కమ్ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ద్వారా సినీ ప్రముఖులు రేవంత్ తో సయోధ్య చేసుకున్నారు. సయోధ్య అన్నది ఎందుకంటే రేవంత్ సీఎం అయిన తర్వత మర్యాదపూర్వకంగా కూడా సినీప్రముఖుల్లో చాలామంది వచ్చి అభినందనలు కూడా చెప్పలేదు. దాంతో సినీప్రముఖుల్లో చాలామంది రేవంత్ ను చిన్నచూపు చూశారనే ప్రచారం అందరికీ తెలిసిందే.
విషయం ఏదైనా రేవంత్ ప్రకటనదెబ్బకు ప్రముఖులంతా దిగొచ్చారు. ఈ మీటింగులోనే అప్పుడెప్పుడో రేవంత్ ప్రకటించిన గద్దర్ అవార్డులకు కూడా టాలీవుడ్ సానుకూలంగా స్పందించింది. దానిఫలితమే తాజాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గద్దర్ అవార్డుల కమిటి సమావేశం జరగటం. మార్చిలో ఉగాధి పండుగ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రధానం చేయాలన్న భట్టి ప్రతిపాదనకు కమిటి ఆమోదం తెలిపింది. అవార్డులో నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా అందించాలని కమిటి డిసైడ్ చేసింది. తెలుగులో నిర్మించిన ఉత్తమచిత్రాలకు, జాతీయసమైక్యత, సాంస్కృతిక, విద్య, సామాజిక ఔచిత్యం ఉండే అత్యుత్తమ చిత్రాల్లో సాంకేతికనైపుణ్యం, విలువలతో కూడిన సినిమాలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యంగా భట్టి చెప్పారు. ఈ కమిటీ మీటింగులో గద్దర్ అవార్డుల కమిటి ఛైర్మన్ బీరంగి నర్సింగరావు, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ, హరీష్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.