కొడుకు పై ప్రేమ చంద్రబాబును దగ్గుబాటి కలిసేలా చేసిందా!

ఎన్నో ఏళ్ల ఎడబాటు.. బంధువులు అనే మాట మరిచి చాలా ఏళ్లైంది. పేరుకు తోడళ్లుల్లే కాని ఎన్టీఆర్ మరణం తరువాత వారు ఆప్యాయంగా పలకరించుకున్న సందర్భాలు లేవు.;

Update: 2025-02-25 11:34 GMT

రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసిన వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఆయన రెండో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావు, చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు. వీరిద్దరూ ఎన్టీ రామారావుకు అల్లుళ్లు కావడం వల్ల రాష్ట్ర రాజకీయ చరిత్రలో చెప్పుకోదగిన వ్యక్తులుగా ఉన్నారు. రాజకీయాల్లో చాలా కాలంగా ఎదురపడని వ్యక్తులుగా కూడా వీరు మిగిలారు. అప్పుడప్పుడు బంధువుల ఇండ్లలో జరిగే ఫంక్షన్ లకు ఇద్దరికీ ఆహ్వానాలు అందుతుంటాయి. ఆ సందర్భాల్లో ఎదురు పడ్డారు తప్ప రాజకీయ అంశాలపై మాట్లాడుకునే అవకాశం వారు కల్పించుకోలేదు. ఎన్టీ రామారావు క్యాబినెట్ లో వీరిద్దరూ మంత్రులుగా పనిచేశారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా మంచి పేరు సంపాదించారు.

వీరిద్దరూ 1995లో తెలుగుదేశం పార్టీలో, అప్పటి ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విడిపోయారు. ఎన్టీ రామారావును పదవీ చ్యుతుడిని చేయడానికి ఇద్దరూ బాధ్యులే. చంద్రబాబు నాయుడు అప్పట్లో ముఖ్యమంత్రి కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరావుకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే అది సాధ్యం కాలేదు. నాడు విడిపోయిన తోడల్లుళ్ల కలయికకు అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సోమవారం వేదికైంది. ఇరువురి అభిమానులు, తెలుగుదేశం పార్టీలోని ఎంతో మంది ముఖ్యుల్లో వీరి కలయిక ఆసక్తికి దారితీసింది. రాజకీయంగా వారిరువురి ఆలోచనలు, మార్గాలు వేరు కావడం వల్లే ఇంత కాలం కుటుంబ వేడుకల్లో మాత్రమే కలుసుకుంటూ వచ్చారు. ఇన్నేళ్ల కాలంలో దగ్గుబాటి వెంకటేశ్వరావు చంద్రబాబు ఇంటికి నేరుగా ఇంత వరకు వెళ్ల లేదు.

పురందేశ్వరికి మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్

చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరావులు విడిపోయిన తరువాత రాజకీయాలకు దగ్గుబాటి దూరమయ్యారని చెప్పొచ్చు. నందమూరి హరికృష్ణ ఉండగా అప్పుడప్పుడు దగ్గుబాటి కలిసే వారు. బాలకృష్ణ చంద్రబాబుకు దగ్గర కాగా, హరికృష్ణ దగ్గుబాటికి దగ్గరగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో కారంచేడులోని దగ్గుబాటి ఇంటి ముందు బాలకృష్ణ తొడగొట్టారు కూడా. అవన్నీ రానురాను కనుమరుగవుతూ వచ్చాయి. చంద్రబాబుతో విభేదించిన తరువాత పురందేశ్వరి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళ్లారు. సోనియా గాంధీ వద్ద ఎనలేని అభిమానం సంపాదించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.

Delete Edit

రాష్ట్ర విభజనతో మారిన పురందేశ్వరి వ్యూహం

రాష్ట్ర విభజన తరువాత పురందేశ్వరి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షురాలుగా, రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీగా మంచి పొజిషన్ లోనే పురందేశ్వరి ఉన్నారు. పురందేశ్వరి బీజేపీలో ఉండగానే దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు 2019కి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుమారుడు హితేష్ చెంచురామ్ ను పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు నిర్ణయించారు. హితేష్ విదేశాల్లో ఉన్నందున ఇక్కడ పోటీ చేసేందుకు అర్హత లేదని ఎన్నికల కమిషన్ చెప్పటంతో పర్చూరు నుంచి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఓటమి చవి చూశారు. దీంతో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని తండ్రీ కొడుకులు మిన్నకుండి పోయారు.

పురందేశ్వరి గెలుపుకు కృషి

దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజమహేంద్రవరం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు ఆమె గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన బీజేపీలో చేరలేదు. పురందేశ్వరి గెలిచిన తరువాత బీజేపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కాని, ఆమెతో కలిసి రాజకీయ సభలు, సమావేశాలకు వెళ్లడం కానీ చేయలేదు. తనకంటూ ఒక ప్రత్యేకత ఉందనేందుకు ఇవి ఉదాహరణలు. దగ్గుబాటికి కాస్త మొండి పట్టుదల కూడా ఎక్కువే. ఖాళీగా ఉన్న సమయంలో పుస్తక రచనపై దృష్టి పెట్టారు. గతంలో ఎన్నో ప్రముఖ దినపత్రికలకు వ్యాసాలు రాసారు. ఈ వ్యాసాలను త్వరలో అంతర్ వీక్షణం పేరుతో గుండ్లకమ్మ మాస పత్రిక ఎడిటర్ సందిరెడ్డి కొండలరావు పుస్తకం అచ్చు వేసేందుకు నిర్ణయించారు. డాక్టర్ దగ్గుబాటి చేసిన కొన్ని రచనలు పలువురి మన్ననలు పొందాయి.

కూటమి ప్రభుత్వం వల్ల చంద్రబాబు ఇంటికి పురందేశ్వరి

కూటమి ప్రభుత్వంలో పురందేశ్వరి పాత్ర కూడా కీలకంగా మారింది. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడం, రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ కావడం వల్ల ఆమెకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. పార్టీ పనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పురందేశ్వరి పలు మార్లు వెళ్లారు. దాంతో పాటు చెల్లెలితో కలిసి మాట్లాడటం, లోకేష్ ను, కుటుంబ సభ్యులను పలకరించడం సాధారణమైంది. చంద్రబాబుకు వదిన కావడం వల్ల చంద్రబాబు కుటుంబంలోని మనిషిగా మారారు. పురందేశ్వరి, భువనేశ్వరి, బాలకృష్ణ ఒకే వేదికపై ఇటీవల సరదాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకున్నారు. కుటుంబ వ్యవహారాలు సరదాగా మాట్లాడుతూ ప్రజల్లో నవ్వుల పూవులు పూయించారు. ఇలా పురందేశ్వరి చంద్రబాబు కుటుంబానికి బాగా దగ్గరయ్యారు.

నిరాడంబరుడు డాక్టర్ దగ్గుబాటి

తన రాజకీయ చరిత్రలో దగ్గుబాటి వెంకటేశ్వరావు నిరాబంబరుడిగా పేరు సంపాదించారు. ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక సారి పార్లమెంట్ కు, మరో సారి రాజ్య సభకు ఎన్నికయ్యారు. దాదాపు 30 ఏళ్లకు పైగా ప్రజా ప్రతినిధిగా కొనసాగారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆడంబరత్వాన్ని చాటుకున్నట్లు కనిపించలేదు. 2019 ఎన్నికల్లో దగ్గుబాటి ఓటమి ఆయనను ఒకింత ఇబ్బంది పెట్టింది. డబ్బులేని రాజకీయాలు చేయాలనుకోవడం కూడా తన తప్పేమో అంటూ అప్పుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీత ధోరణులకు దారి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కొడుకుపై ప్రేమే చంద్రబాబుతో కలిపిందా?

తాను రాసిన ‘ఆది నుంచి నేటి వరకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు వెళ్లారు. సరదాగా మాట్లాడు కుంటూ కొద్దిసేపు గడిపారు. వచ్చేనెల 6న విశాఖ నగరంలోని గీతం యూనివర్సిటీలో జరిగే పుస్తకావిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ యూనివర్సిటీ కూడా బందువులదే కావడం విశేషం. ఈ విషయం అలా ఉంచితే ప్రజల్లో ఒక బలమైన చర్చ జరుగుతోంది.

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు రాజకీయాల్లో ఈతలు, మోతలు చూశారు. తన భార్య కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాజకీయాల్లోనూ కీలకంగా ఉన్నారు. ఒకప్పుడు దగ్గుబాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ తన కుమారుడు హితేష్ చెంచురామ్ ను రాజకీయ ధీరునిగా చూడాలనే ఆలోచన ఆయనను చంద్రబాబు ఇంటికి నడిపించిందనే చర్చ మొదలైంది.

హితేష్ తన రాజకీయ వారసునిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనే ఆలోచన దగ్గుబాటిలో ఉంది. అలా లేకుంటే 2019లో హితేష్ ను ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచన చేసే వారు కాదు. పైగా కుటుంబం రాజకీయాల్లో ఆరితేరినది కావడం విశేషం. భవిష్యత్ రాజకీయాల్లో అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్ సీపీలు పోటా పోటీగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే తోడల్లుళ్ల కుటుంబాలు, పిల్లలు కలిపి తిరుగుతున్నారు. అందరూ సంతోషంగా గడుపుతున్నారు. తోడల్లుళ్లుగా ఇన్నేళ్లు రాజకీయంగా విడిపోయి సాధించింది ఏమీ లేదని, నిత్యం రాజకీయ పటంలో ఉంటూ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేసే వారు మాత్రమే రాజకీయ చిత్ర పటంలో ఉంటారని చంద్రబాబు నిరూపించారు. దీనిని దగ్గుబాటి గమనించారని, అందుకే పట్టుదలలు వదిలి అందరితో కలిసి కుటుంబంలో రాజకీయ సంతోషం నింపాలనే ఆలోచనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News