తీన్మార్ మల్లన్న కోరుకుంటున్నదే కాంగ్రెస్ చేసిందా ?

ఈ సస్పెన్షన్ తో తీన్మార్ ఎంఎల్సీగా కంటిన్యు అవచ్చుకాని సస్పెన్షన్ ఎత్తేసేంతవరకు పార్టీతో సంబంధముండదు;

Update: 2025-03-01 09:38 GMT

రోగికోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే మందు అనే సామెత ఇపుడు అచ్చంగా ఎంఎల్సీ తీన్మార్ మల్లన్నకు సరిపోతుంది. ఎలాగంటే తీన్మార్ పై పార్టీ శనివారం సస్పెన్షన్ వేటువేసింది. ఈ సస్పెన్షన్ తో తీన్మార్ ఎంఎల్సీగా కంటిన్యు అవచ్చుకాని సస్పెన్షన్ ఎత్తేసేంతవరకు పార్టీతో సంబంధముండదు. తీన్మార్ మల్లన్న(Teenmar Mallnna) అలియాస్ చింతపండు నవీన్ కు కావాలసింది కూడా ఇదే. తాను ఎంఎల్సీగా ఉండాలి కాని పార్టీతో సంబంధం ఉండకూడదనే కోరుకుంటున్నాడు. చాలకాలంగా పార్టీలో(MLC Teenmar Mallanna) తీన్మార్ ఇమడలేకపోతున్నాడు. అందుకనే పార్టీలోనుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. ఉత్తగా పార్టీకి రాజీనామా చేస్తే ఇబ్బందులు వస్తాయేమో అని ఒక ప్లాన్ చేసినట్లున్నాడు. అదేమిటంటే పార్టీలోనే ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లుగా ఆరోపించటం.

పార్టీ కూడా తీన్మార్ లాంటి వాళ్ళని చాలామందినే చూసింది కదా. అందుకనే ఇంతకాలం ఈ ఎంఎల్సీ ఏమన్నా పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలో అసలు తీన్మార్ అనే ఎంఎల్సీ ఉన్నాడన్న విషయాన్నే రేవంత్(Revanth) పట్టించుకోలేదు. అయితే ఎంఎల్సీ వైఖరి లక్షణరేఖ కూడా దాటిపోయింది. దీనికి మూడు ఉదాహరణలున్నాయి. మొదటిది కులగణన రిపోర్టును తగలబెట్టడం. రెండో ఉదాహరణ తనకు నోటీసు జారీచేసిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీని ఈకముక్కతో సమానంగా తీసిపారేయటం. మూడో ఉదాహరణ మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి వ్యతిరేకంగా బీఎస్పీ అభ్యర్ధికి బహిరంగంగా ప్రచారంచేయటం.

మీడియా నుండి రాజకీయాల్లోకి

మొదట తీన్మార్ మల్లన్న ఒక ఛానల్లో తీన్మార్ న్యూస్ ప్రజెంట్ చేసేవాడు. మొదటినుండి కేసీఆర్ కు వ్యతిరేకంగా వీడియోలు చేసేవాడు కాబట్టి ఆ వీడియోలకు జనాల్లో ఆధరణ పెరిగింది. దాంతో తీన్మార్ కు ఒకరకంగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అందుకనే తన చూపు రాజకీయాలపైకి మళ్ళింది. 2015లో నల్గొండ-వరంగల్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయాడు. బీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి గెలవగా బీజేపీ అభ్యర్ధికి రెండోప్లేసు వస్తే తీన్మార్ మూడోప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓడిపోయాడు. మళ్ళీ 2021లో నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా పోటీచేసి మళ్ళీ పల్లా చేతిలోనే ఓడిపోయాడు. ఆ తర్వాత పరిణామాల్లో తీన్మార్ 2023లో కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ ప్రచారకమిటి కన్వీనర్ గా నియమితులయ్యాడు. 2021లో ఎంఎల్సీగా గెలిచిన పల్లా బీఆర్ఎస్ తరపున 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటంతో ఎంఎల్సీకి రాజీనామా చేశాడు. 2024 ఎన్నికల్లో మూడోసారి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్(Congress) అభ్యర్ధిగా పోటీచేశాడు కాబట్టే తీన్మార్ ఎంఎల్సీగా గెలిచాడు. అయితే తీన్మారేమో తాను అభ్యర్ధిగా పోటీచేయబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నట్లుగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో బాగానే ఉన్న ఎంఎల్సీకి తర్వాత ఏమైందో తెలీదు. పార్టీని, ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ ను టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు. స్వపక్షంలోనే విపక్షంగా తయారయ్యాడు. తీన్మార్ పద్దతిపై ఎన్ని ఫిర్యాదులు అందినా నాయకత్వం ఉపేక్షించింది. పార్టీ, ప్రభుత్వంతో పాటు రేవంత్ మీద బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు వద్దని అధిష్ఠానం సీనియర్ నేతలతో చెప్పించింది. అయినా సరే ఎంఎల్సీ తన ధోరణి మార్చుకోలేదు. ఇంతలో బీసీ వాదనకు బలంపుంజుకోవటంతో తీన్మార్ మరింతగా రెచ్చిపోవటం మొదలుపెట్టాడు.

బీసీ సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని, రేవంత్ ను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని రేవంత్ కు అల్టిమేటమ్ కూడా ఇచ్చాడు. ఇదేసమయంలో ప్రభుత్వం రిలీజ్ చేసిన కులగణన రిపోర్టంతా తప్పులతడక అంటు కాపీని తగలబెట్టాడు. రిపోర్టును తీన్మార్ తగలబెట్టడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు అడ్వాంటేజ్ గా తీసుకుని రేవంత్ పై దుమ్మెత్తిపోశాయి. దాంతో రేవంత్ కు బాగా మండింది. అందుకనే పార్టీ క్రమశిక్షణ కమిటి ద్వారా నోటీసు ఇప్పించాడు. అయితే నోటీసును ఎంఎల్సీ ఏమాత్రం పట్టించుకోలేదు. నోటీసు అందిన దగ్గర నుండి మరింతగా రెచ్చిపోయాడు. ఇదే నేపధ్యంలో ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారం చేశాడు.

మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా కాంగ్రెస్ అభ్యర్ధి వూటుకూరి నరేంద్రరెడ్డికి వ్యతిరేకంగా బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు ప్రచారంచేశాడు. బీసీ సంఘాల ఓటర్లను బీఎస్పీ అభ్యర్ధి గెలుపుకు సమీకరించాడనే ఆరోపణలొచ్చాయి. దాంతో తీన్మార్ విషయాన్ని రేవంత్ సీరియస్ గా తీసుకుని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాడు. తెలంగాణకు కొత్తగా అపాయింటైన ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తో కూడా చెప్పి అధిష్ఠానంకు చెప్పించి చివరకు శనివారం సస్పెండ్ చేయించాడు.

అయితే పార్టీ నుండి సస్పెండ్ అవటం తీన్మార్ హ్యాపీగా ఫీలయ్యే అంశమే. ఎలాగంటే తాను పార్టీలో ఇమడలేకపోతున్నడు. పార్టీ నుండి బయటపడి ఫ్రీబర్డ్ లాగ ఉండాలని కోరుకుంటున్నాడు. పార్టీలో నుండి సస్పెండ్ అయితే ఏమవుతుంది రాజ్యాంగబద్దంగా సంక్రమించిన ఎంఎల్పీ పదవి ఉన్నపుడు. ఇందుకనే ఈరోజు నుండి తీన్మార్ మల్లన్న పూర్తిగా ఫ్రీబర్డ్ అనే చెప్పుకోవాలి. జరిగింది చూసిన తర్వాత తీన్మార్ మల్లన్న కోరుకున్నదే పార్టీ చేసిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరీ సస్పెన్షన్ వ్యవహారం చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News