12వ పీఆర్సీ కోసం పిడికిళ్లు బిగించిన ఏపీ ఎన్జీవోలు గత ప్రభుత్వ రివర్స్ పీఆర్సీతో చాలా నష్టపోయామంటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే తాత్కాలిక భృతి(ఐఆర్) ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన వేతనాల్ని తిరిగి ఇప్పించేలా చర్యలు చేపట్టాలంటున్నారు. గత ప్రభుత్వం నియమించిన 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసినందున నిర్ణీత కాల పరిమితితో పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు వీలుగా వెంటనే 12వ పీఆర్సీ కమిషనరును నియమించాలని కోరారు. నవంబర్ 3 ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్ లో జరిగిన ఏపీ జెఎసి, అమరావతి స్టేట్ సెక్రటేరియట్ ఉద్యోగుల సమావేశం బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం నేతలు పలిశెట్టి దామోదర రావు, టి.వి.ఫణిపేర్రాజు, కనపర్తి సంగీతరావు మాట్లాడారు. వాళ్లు ఏమన్నారంటే.
"గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పీఆర్సీ తో గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయాం. ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారు. ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలంగా పరిష్కారం కానీ ఆర్దిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకోవాలి. సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి" ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చేసిన తీర్మానాలు ఇవీ!
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు, పెన్షన్లు 1 వ తేదీన చెల్లిస్తూ, ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నందుకు ముందుగా ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. సుమారు 18 అంశాలపై తీర్మానాలు చేశారు.
1.దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి, పద్ధతికి గత ప్రభుత్వం గండి కొట్టి, కనీసం ఎన్నికల ముందైనా ఐఆర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్ళినందున, ఇప్పటికే 15 నెలల కాలాన్ని ఉద్యోగులు కోల్పోయినందున తక్షణమే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలి. 12వ పీఆర్సీ కమిషనర్ ను వెంటనే నియమించాలి.
2. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను గత ప్రభుత్వం కోత వేసి 11వ రివర్స్ పీ ఆర్ సి లో తగ్గించినందున, ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబులను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలా చూసి వృద్ధులను ఆదుకోవాలని కోరారు.
3. గత 10 ఏళ్లుగా పూర్తి జబ్బుతో పని చేయకుండా పోయిన ఉద్యోగుల, పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేశాలా తగు చర్యలు తీసుకోవాలని, ఇ హెచ్ యస్ స్కీమ్ కోసం ప్రతినెలా మా జీతాల్లో, పెన్షన్లలో డబ్బులు రికవరీ చేసుకోని కూడా ఎవరికీ ఉపయోగకరంగా ఈహెల్త్ స్కీమ్ లేనందున, తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యమైన "క్యాస్ లెస్ ట్రీట్ మెంటు" ప్రతి ఉద్యోగి/పెన్షనర్ కు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
4. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా 2 ఏళ్లకు పెంచాలి. 5. గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ, మరి కొన్ని శాఖలలో వారిని 2023 - ఆక్ట్ 30 ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని, విద్య, ఇతర శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను నేటికీ కనుబద్ధీకరించ లేదని, కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు.
6. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్ లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసమోతున్నారు. వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమానపనికి సమానవేతనం ఇచ్చేలా చర్యలు తీసుకొవాలని, ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆధుకోవాలని విజ్ఞప్తి చేశారు.
7. ఉద్యోగులకు 11 వ పిఆర్సీ బకాయిలతో పాటు 2018 జులై నుంచి డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావడం లేదు.
8. ఉద్యోగులు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా గత ప్రభుత్వం వాడుకుని ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. 2022 నుంచి ఉద్యోగులకు ఎన్ క్యాష్మెంట్ ఆఫ్ ఎరండ్ లీవ్, APGLI, సరెండర్ లీవులు, ముఖ్యంగా 24గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవులు మంజూరు చేయాలని కోరారు.